ఏమీ తేల్చలేదు.. సీఎం సూచనలతోనే దూరం!

4 Aug, 2021 03:56 IST|Sakshi

అసంపూర్తిగా ముగిసిన కృష్ణా, గోదావరి సమన్వయ కమిటీల ఉమ్మడి భేటీ

ప్రభుత్వ ఆదేశాలతో గైర్హాజరైన తెలంగాణ ఇంజనీర్లు

నోటిఫికేషన్‌లోని అంశాలపై అభ్యంతరాలున్నాయని తెలిపిన ఏపీ

వాటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని వెల్లడి.. 12న పూర్తి స్థాయి బోర్డుల భేటీ!

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం వెలువరించిన కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీల ఉమ్మడి భేటీ అసంపూర్తిగా ముగిసింది. బోర్డుల పూర్తి స్థాయి భేటీ నిర్వహించాకే సమన్వయ కమిటీల సమావేశం నిర్వహించాలని డిమాండ్‌ చేసిన తెలంగాణ మంగళవారం నాటి భేటీకి గైర్హాజరయ్యింది. కాగా ఆంధ్ర ప్రదేశ్‌.. గెజిట్‌లోని పలు అంశాలపై తమకు అభ్యంతరాలున్నాయని, వాటిపై కేంద్రానికి లేఖ రాసి అక్కడినుంచి స్పష్టత వచ్చాకే అన్ని అంశాలపై స్పందిస్తామని తెలిపింది. ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌లు), నిధులు సహా ఏ ఇతర అంశాలైనా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాకే ముందుకెళతామని అధికారులు చెప్పారు.

సీఎం సూచనలతోనే దూరం!
కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే, గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి బీపీ పాండ్యల అధ్యక్షతన హైదరాబాద్‌ జలసౌధలో ఈ ఉమ్మడి సమావేశం జరిగింది. ఏపీ తరఫున ఈఎన్‌సీ నారాయణరెడ్డితో పాటు ఇతర ఇంజనీర్లు హాజరయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి సోమవారమే తెలంగాణ ఇరిగేషన్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌కుమార్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించారు. అయితే ఈ భేటీకి దూరంగా ఉండాలని ఆయన సూచించినట్లు తెలిసింది. దీంతో తెలంగాణ ఇంజనీర్లు ఎవరూ మంగళవారం నాటి సమావేశానికి హాజరు కాలేదు. బోర్డుల పూర్తిస్థాయి భేటీ తర్వాతే సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని సోమవారం గోదావరి బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ.. మంగళవారం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది.  

మా ప్రభుత్వంతో చర్చించాక చెబుతాం: ఏపీ
ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తేవడం, వాటి అనుమతులు, అనుమతుల్లేని ప్రాజెక్టుల వివరాలు, సీఐఎస్‌ఎఫ్‌ భద్రత, నిధుల విడుదల, విద్యుదుత్పత్తి వంటి అంశాలపై సమగ్ర కార్యాచరణ సిద్ధం చేసే విషయాన్ని బోర్డులు ప్రస్తావించినట్లు తెలిసింది. తమకు సహకరించాలని, అవసరమైన నివేదికలు, వివరాలు ఇవ్వాలని బోర్డులు ఏపీని కోరాయి. దీనిపై స్పందించిన ఏపీ ఇంజనీర్లు.. అన్ని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తేవడం, పర్యవేక్షణకు సిబ్బంది కేటాయింపులు, నిధుల విడుదల వంటి అంశాలపై తమకు కొన్ని అభ్యంతరాలున్నాయని తెలిపారు. దీనిపై త్వరలోనే కేంద్ర జల శక్తి శాఖకు లేఖ రాస్తామని చెప్పారు. ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వడం, నిధుల విడుదల, ప్రాజెక్టులకు అనుమతుల విషయాలపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయాలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. 

గోదావరిలో మున్ముందు తీవ్ర సమస్యలు: ఏపీ ఈఎన్‌సీ
ఉమ్మడి భేటీ ముగిసిన తర్వాత ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ అభ్యంతరాలపై ఓ స్పష్టత వచ్చాకే నోటిఫికేషన్‌ అమలుపై పూర్తి స్థాయిలో స్పందిస్తామని బోర్డుకు చెప్పామని తెలిపారు. అన్ని ప్రాజెక్టులు, గెజిట్‌లో సూచించిన అన్ని అంశాలపై బోర్డు పర్యవేక్షణ అక్కర్లేదని, కేవలం క్లిష్టమైన అంశాలను మాత్రమే బోర్డులు చూస్తే సరిపోతుందని అన్నారు. ఇదే సమయంలో గోదావరి జలాల వినియోగం, మళ్లింపు అంశాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మున్ముందు కృష్ణాలో కన్నా గోదావరిలో తీవ్ర సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని తెలిపారు.

‘గోదావరిలో ఉమ్మడి ఏపీకి 1,430 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఇందులో 1,350 టీఎంసీలను వినియోగించేలా తెలంగాణ కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతారామ, దేవాదుల వంటి పథకాలు చేపడుతోంది. గోదావరిలో మిగులు జలాలు లేవు. ఎగువ రాష్ట్రాలు వినియోగించుకోలేని నీరు మాత్రమే దిగువకు వస్తోంది. ఆయా రాష్ట్రాలు వినియోగం మొదలు పెట్టినా, తెలంగాణ 1,350 టీఎంసీలు వాడినా పూర్తి దిగువ రాష్ట్రమైన ఏపీలోని పోలవరం, గోదావరి డెల్టా సిస్టమ్‌( జీడీఎస్‌)కు తీవ్ర నీటి కొరత ఏర్పడుతుంది. ఇది ఏపీకి తీరని నష్టం చేకూర్చుతుంది..’ అని తెలిపారు. పోలవరం, పట్టిసీమలతో మళ్లిస్తున్న గోదావరి జలాలకు గానూ తమకు 45 టీఎంసీల వాటా ఇవ్వాలని తెలంగాణ కోరడాన్ని ఆయన తప్పుపట్టారు. తెలంగాణ సైతం 241 టీఎంసీల మేర గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తోందని, మరి దీని మాటేమిటి? అని ఆయన ప్రశ్నించారు. సముద్రంలోకి పూర్తి వృధాగా పోతున్న సందర్భంలో తాము మళ్లించుకునే నీటిని వినియోగ వాటాల కింద పరిగణించరాదని కోరుతున్నా తెలంగాణ వినిపించుకోవడం లేదని తెలిపారు. వృధాగా పోతున్న నీటిని వినియోగించుకుంటే తప్పేంటని ప్రశ్నించారు.  

5న రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతంలో పర్యటన
నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు కృష్ణా బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతంలో పర్యటించే అంశం భేటీలో ప్రస్తావనకు వచ్చింది. ఈ నెల 5న జరిగే ఈ పర్యటనకు సహకరించాలని ఏపీని బోర్డు కోరింది. ఇందుకు అంగీకరించిన ఏపీ.. కమిటీలో తెలంగాణ ఇంజనీర్లు లేకుండా చూడాలని షరతు పెట్టింది. దీనిపై బోర్డు ఎలాంటి నిర్ణయం చేసిందీ తెలియలేదు. అయితే తెలంగాణ కోరుతున్నట్లుగా ఈ 12న పూర్తి స్థాయి బోర్డుల భేటీ జరిగే అవకాశం ఉందని తెలిసింది.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు