సాగర్‌ వద్ద కృష్ణమ్మ పరవళ్లు 

15 Aug, 2022 00:49 IST|Sakshi
నాగార్జునసాగర్‌ రేడియల్‌ క్రస్ట్‌గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు

నాగార్జునసాగర్‌: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్ద 26 రేడియల్‌ క్రస్ట్‌ గేట్ల ద్వారా కృష్ణమ్మ దిగువకు పరవళ్లు తొక్కుతోంది. కృష్ణానది పరీవాహక ప్రాంతానికి ఎగువన గల జలాశయాలన్నీ జలకళను సంతరించుకున్నాయి. అదనంగా వచ్చే నీటినంతటినీ ఆయా జలాశయాల నుంచి రేడియల్‌ క్రస్ట్‌ గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌కు 10 రేడియల్‌ క్రస్ట్‌గేట్లను 12 అడుగులు ఎత్తి 3,17,460 క్యూసెక్కుల నీటిని, కుడి, ఎడమగట్టు విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 62,382 క్యూసెక్కులు ఇలా మొత్తం 3,79,842 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

సాగర్‌ జలాశయానికి 3,13,500 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. సాగర్‌ ప్రాజెక్టు 26 రేడియల్‌ క్రస్ట్‌ గేట్లకుగాను 16 గేట్లు 5 అడుగులు, 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు 2,60,316 క్యూసెక్కుల నీటిని స్పిల్‌వే మీదుగా కృష్ణానదిలోకి విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పాదన ద్వారా 33,251 క్యూసెక్కులు మొత్తం కృష్ణానదిలోకి 2,93,567 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ జలాశయం నీటిమట్టం 584.90 అడుగులు(297.1465 టీఎంసీలు). గరిష్టస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు(312.0450 టీఎంసీలు). 

జూరాలకు పెరిగిన ఇన్‌ఫ్లో 
ధరూరు/దోమలపెంట: మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. ఆదివారం ప్రాజెక్టుకు 2.77 లక్షల క్యూసెక్కుల వరద రాగా, 38 క్రస్టు గేట్లు ఎత్తి 2,57,754 క్యూసెక్కులు శ్రీశైలానికి వదిలారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి వరద ప్రవాహంకొనసాగుతోంది. ఈ క్రమంలో ఎగువనున్న ఆయా ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 3,78,483 క్యూసెక్కుల వరద రావడంతో ఆనకట్ట వద్ద పదిగేట్లు ఎత్తి స్పిల్‌వే ద్వారా, విద్యుదుత్పత్తి చేస్తూ 3,79,842 క్యూసెక్కుల నీటిని దిగువన నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు