ఇక నాగార్జునసాగర్‌ వంతు! 

9 Nov, 2021 03:07 IST|Sakshi

ప్రాజెక్టు పరిధిలో పర్యటించనున్న సబ్‌ కమిటీ 

12 లేక 15 నుంచి ఔట్‌లెట్‌ల పరిశీలన 

ఇప్పటికే శ్రీశైలంపై ముసాయిదా రూపకల్పన పూర్తి 

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల స్వాధీనం, వాటి నిర్వహణ అంశాలపై అధ్యయనం చేసేందుకు బోర్డు మరోమారు రంగంలోకి దిగుతోంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో పర్యటించి ఓ ముసాయిదాను రూపొందించిన బోర్డు సబ్‌ కమిటీ, నాగార్జునసాగర్‌ పరిధిలోనూ ఆపరేషన్‌ ప్రోటోకాల్‌పై అధ్యయనం చేసి నివేదిక తయారు చేయనుంది. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే, సభ్యుడు రవికుమార్‌ పిళ్లైల నేతృత్వంలోని బృందం ఈ నెల 12 లేక 15 నుంచి రెండ్రోజుల పాటు సాగర్‌ పరిధిలో పర్యటించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీర్లతో చర్చించనుంది.

సాగర్‌ పరిధిలో ఉన్న కుడి, ఎడమ కాల్వలు, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు, ఏఎంఆర్‌పీ వంటి ఔట్‌లెట్‌లను బోర్డు పరిధిలోకి తేవాలని ఇదివరకే బోర్డులో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. అయితే తమ పరిధిలోని ఔట్‌లెట్‌ల అప్పగింతపై తెలంగాణ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యంగా పవర్‌హౌస్‌ల స్వాధీనానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని అంటోంది. దీంతో గెజిట్‌ అమల్లోకి రాకున్నా, తీర్మానం చేసిన ఔట్‌లెట్‌ల పరిస్థితులు అధ్యయనం చేయాలని సబ్‌ కమిటీ నిర్ణయించింది.  

బోర్డులో చర్చించిన తర్వాతే ఏదైనా.. 
ఔట్‌లెట్‌ల వద్ద ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, నీటి అవసరాలు, వినియోగం, సిబ్బంది, విద్యుత్‌ కేంద్రాలకు నీటి విడుదల, వరద అంచనా తదితరాలను కమిటీ పరిశీలించనుంది. స్థానిక ఇంజనీర్ల నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించనుంది. అయితే శ్రీశైలం పరిధిలో పర్యటన అనంతరం సిద్ధం చేసిన ముసాయిదాపై తెలంగాణ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో, దీనిపై పూర్తి స్థాయి బోర్డులో చర్చించాలని నిర్ణయించింది. ప్రస్తుతం సాగర్‌ పరిధిలోనూ ఆపరేషన్‌ ప్రోటోకాల్‌ సిద్ధం చేసినా.. బోర్డు భేటీలో చర్చకు పెట్టాక, ఇరు రాష్ట్రాల ఆమోదం మేరకే ముందుకెళ్లనున్నారు.    

మరిన్ని వార్తలు