అమిత్‌ షా చెప్పులు మోసిన బండి సంజయ్‌.. గుజరాతీ గులామ్‌ అంటూ కేటీఆర్‌ ఫైర్‌

23 Aug, 2022 05:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి బీజేపీ ఖరీదు కడుతోందని, మునుగోడు ప్రజల స్వాభిమానం ముందు బీజేపీ బట్టేబాజ్‌తనానికి ఓటమి ఖాయమని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. తెలంగాణ ఆత్మగౌరవం, ప్రజల ఆకాంక్షలను ఢిల్లీ పాదుషాలు అర్థం చేసుకోలేరనే విషయం అమిత్‌షా మునుగోడు ప్రసంగంతో రుజువైందని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో కేంద్రమంత్రి అమిత్‌ షాపై కేటీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘అబద్ధాలకు పెద్దకొడుకు అమిత్‌ షా.

ఆయనకు అధికార కాంక్ష తప్ప ప్రజల ఆకాంక్షలు పట్టవు. గాడిద గాత్రానికి ఒంటె ‘ఓహో..’అంటే, ఒంటె అందానికి గాడిద ‘ఆహా’అన్నట్టుగా మోదీ ప్రభుత్వ పనితీరు గురించి అమిత్‌ షా చెప్పుకున్నారు. నల్లచట్టాలతో దేశ రైతులకు ఉరితాడు బిగించేందుకు ప్రయత్నించిన మోదీ ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే కుట్రలకు పాల్పడుతోంది.  ఫసల్‌ బీమా యోజన పథకంలో తెలంగాణ ఎందుకు చేరలేదని ప్రశ్నిస్తున్న అమిత్‌ షాకు ఆయన సొంత రాష్ట్రం గుజరాత్‌ ఈ పథకం నుంచి ఎందుకు వైదొలిగిందో తెలియదా? ఫసల్‌ బీమాతో ఐదేళ్లలో ఇన్సూరెన్స్‌ కంపెనీలు రూ.40 వేల కోట్ల లాభాన్ని పొందాయి. ఫసల్‌ బీమా యోజన తెలంగాణకు ఎలా పనికొస్తుందో అమిత్‌ షా చెప్తే ఇక్కడి ప్రజలు వినే తరించేవారు’అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. 

గోల్డ్‌ మెడల్‌ తెలంగాణకు రూపాయి ఇవ్వలేదు 
‘వేల కోట్ల రూపాయల విలువ చేసే కాంట్రాక్టులతో ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసిన బీజేపీ మునుగోడుకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తుందని ఆశించాం. గోల్‌మాల్‌ గుజరాత్‌కు తప్ప గోల్డ్‌మెడల్‌ తెలంగాణకు రూపాయి కూడా ఇచ్చే సంస్కారం బీజేపీ ప్రభుత్వానికి లేదు. అమిత్‌ షా లాంటి నాయకులు తెలంగాణ గడ్డమీద అసత్యాలతో ప్రచారం చేసినా ఇక్కడి ప్రజలు నమ్మరు’అని కేటీఆర్‌ హెచ్చరించారు. ‘తెలంగాణ ప్రజల అవసరాలు, ఆకాంక్షలను అర్థం చేసుకునేశక్తి బీజేపీకి లేదని అమిత్‌ షా ప్రసంగం ద్వారా నిరూపితమైంది’అని కేటీఆర్‌ తన ప్రకటనలో వ్యాఖ్యానించారు.      

ఇది కూడా చదవండి: అమిత్‌ షాపై కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు

మరిన్ని వార్తలు