ఎమర్జింగ్‌ టెక్నాలజీ..రెండు అంచుల కత్తి: దావోస్‌ సదస్సులో మంత్రి కేటీఆర్‌ 

25 May, 2022 01:43 IST|Sakshi
దావోస్‌ డబ్ల్యూఈఎఫ్‌ సదస్సులో భాగంగా జరిగిన చర్చాగోష్టిలో మాట్లాడుతున్న కేటీఆర్‌

టెక్నాలజీతో కలిగే లాభనష్టాలపై ప్రభుత్వాలకు అవగాహన ఉండాలి 

ఆధునిక సాంకేతికతపై ప్రజలకు భరోసా కల్పించాలి 

తెలంగాణలో ఆశీర్వాద్‌ పైప్స్‌ రూ.500 కోట్ల పెట్టుబడి 

500 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించనున్న సంస్థ 

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో భేటీ అయిన కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్, బ్లాక్‌చైన్, డేటా సైన్సెస్‌ వంటి ఆధునిక ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పరిజ్ఞానం రెండు వైపులా పదును ఉన్న కత్తిలాంటివి. ఈ ఎమర్జింగ్‌ టెక్నాలజీ (కొత్త, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ) వినియోగంతో కలిగే లాభనష్టాలపై ప్రభుత్వాలకు పూర్తి అవగాహన ఉండాలి’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సులో భాగంగా ‘ప్రజా బాహుళ్యంలోకి కృత్రిమ మేథస్సు (ఏఐ).. ప్రజల్లో విశ్వాసం కల్పించాల్సిన ఆవశ్యకత’ అనే అంశంపై మంగళవారం జరిగిన చర్చాగోష్టిలో కేటీఆర్‌ తన అభిప్రాయాలను వెల్లడించారు.  

ప్రభుత్వాలకు నియంత్రణ అధికారాలు ఇవ్వాలి 
‘ఫేషియల్‌ రికగ్నిషన్‌ (ముఖాన్ని బట్టి వ్యక్తుల గుర్తింపు), ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడంలో ప్రజల విశ్వాసం, నమ్మకం పొందడమే ప్రభుత్వాలకు అత్యంత సవాలుతో కూడుకున్న అంశం. డేటా భద్రత, దాని వినియోగంలో నిష్పక్షపాతంగా వ్యవహరించడంతో పాటు, అనుమతి లేకుండా నిఘా కార్యకలాపాలకు ఈ టెక్నాలజీని ఉపయోగించబోమనే భరోసా ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ఎమర్జింగ్‌ టెక్నాలజీ వినియోగంపై ప్రభుత్వ విభాగాలకు ఎలాంటి నియంత్రణ అధికారాలు ఉండాలనే అంశాన్ని స్పష్టంగా నిర్దేశిస్తేనే ప్రజలకు భరోసా ఏర్పడుతుంది. పార్లమెంటరీ విధానంలో ప్రభుత్వాలకు నియంత్రణ అధికారాలు ఇవ్వాలి..’అని కేటీఆర్‌ సూచించారు.  

టెక్నాలజీని సరైన రీతిలో ఉపయోగించాలి 
‘ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ ఆధారంగా నేరస్తులు, తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడం పోలీసులకు సులభమవుతుంది. దీనిద్వారా నేరాల నియంత్రణ, సమర్థ పోలీసింగ్‌ సాధ్యమవుతుందని ప్రభుత్వాలు అర్థం చేసుకుంటున్నాయి. అయితే ఈ టెక్నాలజీని ఉపయోగించే ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలి. ఈ టెక్నాలజీని సరైన రీతిలో ఉపయోగిస్తే పోలీసులతో పాటు ప్రజలకు కూడా విస్తృత ప్రయోజనాలు కలుగుతాయి. ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ ద్వారా సేకరించే డేటా, ఇతర ఫలితాలను ప్రజలతో పంచుకున్నపుడే ఈ ప్రక్రియ విజయవంతం అవుతుంది..’అని మంత్రి వ్యాఖ్యానించారు. చర్చాగోష్టిలో నిప్పన్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ తకయుకి మోరిట, ఉషాహిది సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ ఈడీ ఎంజీ నికోల్, ఎడ్జ్‌టెక్‌ సీఈఓ కోయెన్‌వాన్‌ ఓస్ట్రోమ్‌ పాల్గొన్నారు. అలాగే దావోస్‌ వేదికగా డెలాయిట్‌ గ్లోబల్‌ సీఈఓ పునీత్‌ రంజన్‌ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. డిజిటల్‌ హెల్త్, డిజిటల్‌ ఎడ్యుకేషన్, వాతావరణ మార్పు అంశాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడంపై చర్చించారు. 

నోవార్టిస్‌ విస్తరణ ప్రణాళికలు 
‘అనేక దేశాల్లో తయారీ యూనిట్లతో పాటు పరిశోధన కేంద్రాలను కలిగిన నోవార్టిస్‌ హైదరాబాద్‌లో కంపెనీ విస్తరణ ప్రణాళికలు రూపొందిస్తోంది. భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బహుళ జాతి ఫార్మా కంపెనీల్లో నోవార్టిస్‌ సామర్థ్యం అతిపెద్దది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నోవార్టిస్‌ కార్యాలయం 9వేల మంది ఉద్యోగులతో రెండో అతిపెద్ద కార్యాలయంగా మారింది. హైదరాబాద్‌లోని ఆవిష్కరణలు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల వల్లే ఇది సాధ్యమైంది.’అని నోవార్టిస్‌ సీఈఓ వాస్‌ నరసింహన్‌ దావోస్‌లో కేటీఆర్‌తో భేటీ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

సోదరుడు వైఎస్‌ జగన్‌తో భేటీ అద్భుతం 

  • డబ్ల్యూఈఎఫ్‌ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కేటీఆర్‌ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వైఎస్‌ జగన్‌తో దిగిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ.. ‘నా సోదరుడు ఏపీ సీఎం జగన్‌తో భేటీ అద్భుతంగా జరిగింది..’అని మంత్రి ట్వీట్‌ చేశారు.  
  • మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రేతోనూ కేటీఆర్‌ భేటీ అయ్యారు. తెలంగాణ ఐటీ, లైఫ్‌సైన్సెస్‌ రంగంపై ఆదిత్య ఠాక్రే ఆసక్తి చూపగా, పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ చేపట్టిన హరితహారం, పంచాయతీరాజ్‌ చట్టంలో 10 శాతం నిధులను గ్రీన్‌ బడ్జెట్‌ కింద కేటాయించడం గురించి కేటీఆర్‌ వివరించారు. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు త్వరలో హైదరాబాద్‌ రానున్నట్లు ఆదిత్య థాకరే తెలిపారు.  
  • ఏపీ లోక్‌సభ సభ్యులు మిథున్‌రెడ్డి, ఎన్‌ఈసీ కార్పొరేషన్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నొరిహికో ఇషిగురో, భారతి ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌ భారతి మిట్టల్, వైస్‌ చైర్మన్‌ రాజన్‌ భారతి మిట్టల్, హెచ్‌సీఎల్‌ ఎండీ విజయ్‌ గుంటూరు, భారత్‌ ఫోర్జ్‌ డిప్యూటీ ఎండీ అమిత్‌ కళ్యాణిలు కేటీఆర్‌ను కలిశారు. 

ఆశీర్వాద్‌ రూ.500 కోట్ల పెట్టుబడి
తెలంగాణలో రూ.500 కోట్లు పెట్టుబడితో 500 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించాలని ఆశీర్వాద్‌ పైప్స్‌ (ఎలియాక్సిస్‌) నిర్ణయించింది. ఈ మేరకు దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో మంగళవారం ఒప్పందం కుదిరింది. తెలంగాణలో ఏర్పాటు చేసే ప్లాంట్‌ ద్వారా స్టోరేజి, డిస్ట్రిబ్యూషన్‌ పైప్స్, ఫిట్టింగ్స్‌ వంటి ప్లాస్టిక్‌ ఉత్పత్తులు తయారు చేస్తామని కంపెనీ సీఈఓ కోయిన్‌ స్టికర్‌ వెల్లడించారు. ఉత్పత్తులను దేశీయ మార్కెట్‌కే పరిమితం చేయకుం డా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తామన్నారు.  

>
మరిన్ని వార్తలు