భారీగా నిధులివ్వండి.. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వండి

24 Jan, 2022 02:43 IST|Sakshi

పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ 

ఎన్‌ఐడీ, ఫార్మాసిటీ, నిమ్జ్‌లకు కూడా 

హైదరాబాద్‌–బెంగళూరు, హైదరాబాద్‌–విజయవాడ పారిశ్రామిక కారి డార్‌లను జాతీయ పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. హుజూరాబాద్, జడ్చర్ల–గద్వాల్‌–కొత్తకోట నోడ్‌లను ఫాస్ట్‌ట్రాక్‌ ప్రాతిపదికన అభివృద్ధి చేసే ప్రతిపాదనలను త్వరలో కేంద్రానికి పంపుతాం. ఈ రెండు కారిడార్లకు బడ్జెట్‌లో 1,500 కోట్ల చొప్పున కేటాయించాలి.
– కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన, భవిష్యత్తు ప్రణాళికకు భారీగా నిధులు కేటాయించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్రాన్ని కోరారు. పారిశ్రామిక అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్న తెలంగాణకు సాయం అందించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. త్వరలో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపులో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆదివారం కేటీఆర్‌ లేఖ రాశారు. అందులోని ముఖ్యాంశాలు ఇలా.. 

హైదరాబాద్‌ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న నేషనల్‌ డిజైన్‌ సెంటర్‌ (ఎన్‌ఐడీ)కు అవసరమైన పరికరాలు, ఇతర వసతుల కల్పనకు నిధులు కేటాయించాలి. దీనికి ఎనిమిదేళ్లపాటు నిర్వహణ ఖర్చు కేంద్రం ఇవ్వాలి. ఇందులో 25 శాతం భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 

కేంద్రం ఇప్పటికే గుర్తించిన హైదరాబాద్‌–వరంగల్, హైదరాబాద్‌–నాగపూర్‌ పారిశ్రామిక కారిడార్‌లలోని హైదరాబాద్‌ ఫార్మా సిటీ, నిమ్జ్‌ (జహీరాబాద్‌) నోడ్‌లకు అవసరమైన ఆర్థిక సాయం అందించాలి. వీటిలో మౌలిక వసతులకు రూ.5 వేల కోట్లు అవసరం. హైదరాబాద్‌–నాగపూర్‌ కారిడార్‌లో మంచిర్యాలను కూడా నోడ్‌గా గుర్తించి, ఒక్కో నోడ్‌కు రూ.2వేల కోట్ల చొప్పున రూ.6వేల కోట్లు కేటాయించాలి. 

‘హైదరాబాద్‌–బెంగళూరు, హైదరాబాద్‌–విజయవాడ పారిశ్రామిక కారిడార్‌లను జాతీయ పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. హుజురాబాద్, జడ్చర్ల–గద్వాల్‌–కొత్తకోట నోడ్‌లను ఫాస్ట్‌ట్రాక్‌ ప్రాతిపదికన అభివృద్ధి చేసే ప్రతిపాదనలు త్వ రలో కేంద్రానికి పంపుతాం. ఈ రెండు కారిడార్లకు రూ.1,500 కోట్లు చొప్పున కేటాయించాలి. 

ఏడేళ్లుగా డిఫెన్స్, ఏరోస్పేస్‌ రంగాల్లో పురోగతి సాధిస్తున్న హైదరాబాద్‌ను.. ఇటీవల కేంద్రం ప్రతిపాదించిన రెండు డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌ కారిడార్ల పరిధిలో చేర్చాలి. హైదరాబాద్‌కు ఉన్న భౌగోళిక, రవాణా అనుకూలతలతోపాటు ఇక్కడ ఉన్న డీఆర్‌డీఎల్, బీడీఎల్, ఎన్‌ఎఫ్‌సీ, ఈసీఐఎల్, ఓడీఎఫ్‌ వంటి రక్షణరంగ సంస్థల వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అంతర్జాతీయ విమానాశ్రయం, రెండు ఏరోస్పేస్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ పార్కులు వంటి అనుకూలతలను ‘డిఫెన్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ కారిడార్‌’ఏర్పాటులో పరిగణనలోకి తీసుకోవాలి. 

ఇప్పటికే నిమ్జ్‌ హోదాను పొందిన హైదరాబాద్‌ ఫార్మాసిటీ ప్రాజెక్టు పూర్తయితే రూ.64వేల కోట్ల పెట్టుబడులు, 5.6 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఫార్మాసిటీలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా మాస్టర్‌ప్లాన్‌కు రూ.50కోట్లు, రోడ్ల లింకేజీ, నీటి సరఫరా, విద్యుత్‌ సరఫరా, రైల్వే కనెక్టివిటీ వంటి వాటి కోసం రూ.1,399 కోట్లు కేటాయించాలి. జీరో లిక్విడ్‌ డిశ్చార్జి ఆధారిత ట్రీట్‌మెంట్‌ ప్లాంటు తదితరాల కోసం మరో రూ.3,554 కోట్లు కలుపుకుని మొత్తంగా రూ.5,003 కోట్లు కేంద్ర బడ్జెట్‌లో కేటాయించాలి.    

మరిన్ని వార్తలు