‘ఫ్లో కెమిస్ట్రీ’తో వినూత్న ఆవిష్కరణలు

26 Nov, 2021 03:32 IST|Sakshi
సీఓఈ ఒప్పంద పత్రాలను చూపుతున్న కేటీఆర్‌ తదితరులు 

ఫార్మా రంగానికి ఊతం: కేటీఆర్‌  

సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌ రంగాల పురోగతిని కొనసాగించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. దీనికోసం ఫార్మా దిగ్గజాలతో కలిసి ఫ్లో కెమిస్ట్రీలో కొత్తగా సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌(సీఓఈ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కేంద్రం స్థాపన వల్ల ఫార్మారంగంలో బహుళ ప్రయోజనాలతో కూడిన ఆవిష్కరణలు ఊపందుకుంటాయి. ఔషధ రంగ పరిశోధన, అభివృద్ధిలో ఫ్లో కెమిస్ట్రీ సాంకేతికతను చొప్పించడం ద్వారా ఔషధాల తయారీలో కీలకమైన ముడి రసాయనాల (ఆక్టివ్‌ ఫార్మా ఇంగ్రిడియెంట్స్‌)ను నిరంతరం తయారు చేసే అవకాశం ఏర్పడుతుంది.

సీఓఈ ఏర్పాటుకు ముందుకొచ్చిన కన్సార్టియంతో ప్రభుత్వం గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ సమక్షంలో జరిగిన ఈ ఒప్పందంపై జీవీ ప్రసాద్‌ (డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌), డాక్టర్‌ సత్యనారాయణ చావా (లారస్‌ ల్యాబ్స్‌), శక్తి నాగప్పన్‌ (లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌)తోపాటు డాక్టర్‌ శ్రీనివాస్‌ ఓరుగంటి (డాక్టర్‌ రెడ్డీస్‌ లైఫ్‌సైన్సెస్‌ ఇనిస్టిట్యూట్‌) సంతకాలు చేశారు.

హైదరాబాద్‌లోని డాక్టర్‌ రెడ్డీస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లైఫ్‌సైన్సెస్‌ ఆవరణలో ఏర్పాటయ్యే ఈ కేంద్రానికి డాక్డర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్, లారస్‌ ల్యాబ్స్‌ నుంచి నిధులు, ఇతర సహకారం లభిస్తుంది. సీఓఈలో జరిగే పరిశోధనలకు పేరొందిన శాస్త్రవేత్తలు మార్గదర్శనం చేస్తారు. ఫ్లో కెమిస్ట్రీలో నైపుణ్యం, నిరంతర ఉత్పత్తి ద్వారా లబ్ధిపొందేందుకు ఈ కన్సార్టియంలో మరిన్ని పరిశ్రమలు చేరి లబ్ధిపొందేలా ప్రభుత్వం సహకారం అందిస్తుంది. 

ఉత్పత్తిలో ఆధునిక పద్ధతులు: కేటీఆర్‌ 
పరిశోధన, అభివృద్ధి మొదలుకుని ఉత్పత్తిలో ఆధునిక పద్ధతులు అవలంబించడంతోపాటు కాలుష్యరహిత, సుస్థిర విధానాల వైపు దేశీయ ఔషధ తయారీ రంగం మళ్లేందుకు ‘ఫ్లో కెమిస్ట్రీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’పేరిట ఏర్పాటయ్యే హబ్‌ దోహదపడుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

సీఓఈ ఏర్పాటులో డాక్టర్‌ రెడ్డీస్, లారస్‌ ల్యాబ్స్‌ ఎనలేని సహకారం అందించాయని కితాబునిచ్చారు. లైఫ్‌సైన్సెస్‌ రంగంలో తెలంగాణకు ఉన్న ప్రాధాన్యతను కాపాడుకుంటూనే మరింత పురోగతి సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ చెప్పారు.

లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో ఫ్లో కెమిస్ట్రీ సీఓఈ ఏర్పాటు మైలురాయి వంటిదని, రాష్ట్రంలో ఈ రంగాన్ని 2030 నాటికి వంద బిలియన్‌ డాలర్ల పరిశ్రమగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని లైఫ్‌ సైన్సెస్‌ విభాగం డైరక్టర్‌ శక్తి నాగప్పన్‌ అన్నారు. సీఓఈలో తమకు భాగస్వామ్యం కల్పించడం పట్ల రెడ్డీస్‌ ల్యాబ్స్‌ కో చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్, లారస్‌ ల్యాబ్స్‌ సీఈఓ డాక్టర్‌ సత్యనారాయణ చావా హర్షం వ్యక్తం చేశారు.   

మరిన్ని వార్తలు