రైతు వేదికలకు టీఫైబర్‌ 

31 Aug, 2021 01:33 IST|Sakshi
అగ్రిహబ్‌ ప్రారంభోత్సవంలో మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు

వీటి అనుసంధానంతో సమస్త సాగు సమాచారం గ్రామాల్లోని రైతులకు.. 

అగ్రిహబ్‌లో సామాన్య రైతులకు స్థానం కల్పించాలి 

వ్యవసాయ పరిశోధనల విస్తృతి పెరగాలి 

అగ్రిహబ్‌ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌  

పాల్గొన్న మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబితారెడ్డి 

ఏజీ వర్సిటీ (హైదరాబాద్‌): వ్యవసాయంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలని, వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన అగ్రిహబ్‌లో సామాన్య రైతులకు స్థానం కల్పించాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. క్షేత్రస్థాయిలో సామాన్య రైతుల ఆలోచనలు, ఆవిష్కరణలకు ఆగ్రిహబ్‌ వేదిక కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రైతు సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన 2,601 రైతు వేదికలకు టీ–ఫైబర్‌ అనుసం ధానం చేస్తున్నామని చెప్పారు. దీంతో రాష్ట్రంలో ఎక్కడ వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమం జరిగినా, పరిశోధనలు జరిగిన గ్రామాల్లోని రైతు వేదికల ద్వారా రైతులు చూడొచ్చన్నారు.

తెలుగు భాషను కాపాడుకోవడం అందరి బాధ్యత అని, అగ్రిహబ్‌లో సామాన్య రైతులకు తెలిసేలా తెలుగులో రాసి ఉంచాలని చెప్పారు. సోమవారం రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రూ.9 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన అగ్రిహబ్‌ను కేటీఆర్‌.. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. వర్సిటీలో ఏర్పాటు చేసిన దేశంలోని వివిధ కంపెనీలకు చెందిన వ్యవసాయ అధునాతన యంత్రాలను, విత్తనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలన్నది ముఖ్యమంత్రి ఆశయమని, అందుకే మనం ఏ పని చేసినా సామాన్య రైతులకు పనికొచ్చేలా ఉండాలని చెప్పారు. రైతును మించిన శాస్త్రవేత్త లేరని వారి ఆలోచనలో మార్పు తెచ్చి నూతన పద్ధతుల్లో పంటలు పండించేలా శిక్షణ ఇవ్వాలని సూచించారు.  

ప్రపంచదేశాలకు ఎగుమతి చేసేలా.. 
దేశంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి ఏటా 60 వేల కోట్లు ఖర్చు చేస్తోంది కేసీఆర్‌ ప్రభుత్వమే అని చెప్పుకోవడం చాలా గర్వంగా కేటీఆర్‌ అన్నారు. వ్యవసాయ పరిశోధనల విస్తృతి పెరగాలని, నూతన వంగడాలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. దేశానికే కాకుండా ప్రపంచ దేశాలకు తెలంగాణ నుంచి పండ్లు, కూరగాయలు ఎగుమతి చేసేలా ప్రభుత్వం వర్సిటీలో జరిగే పరిశోధనల కోసం రూ.100 కోట్లు కేటాయించిందన్నారు. ఏడేళ్లుగా చేస్తున్న మిషన్‌ కాకతీయ, హరిత హారంలాంటి కార్యక్రమాల ద్వారా పలు ప్రాంతాల్లో భూగర్భజలాలు భారీగా పెరిగాయని చెప్పారు. సిరిసిల్ల ప్రాంతంలో 6 మీటర్లు భూగర్భ జలం పెరగడంతో ముస్సోరి ఐఏఎస్‌ అకాడమీలో పాఠ్యాంశంగా బోధిస్తున్నారని ఉదహరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2023 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిందని, అది ఒట్టి హామీగానే మిగిలిపోయిందని దుయ్యబట్టారు.

కేసీఆర్‌కు ఇష్టమైన రంగం:నిరంజన్‌రెడ్డి
మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు అత్యంత ఇష్టమైన రంగాల్లో మొదటిది వ్యవసాయం, రెండోది సాగునీటి రంగం, మూడోది గ్రామీణాభివృద్ధి అని చెప్పారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో త్వరలో వేరుశనగ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో ఎక్కడికెళ్లినా భూమికి పచ్చని రంగేసినట్లు అన్న గోరటి వెంకన్న పాటలా మారిందని, ఇది ముఖ్యమంత్రి కృషి ఫలితమే అని చెప్పారు. వ్యవసాయానికి సంబంధించిన పలు పుస్తకాలను మంత్రు లు ఆవిష్కరించారు. అనంతరం వ్యవసా య కళాశాల టాపర్లుగా వచ్చిన విద్యార్థులకు పట్టాలు ఇచ్చి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, నాబార్డ్‌ చైర్మన్‌ గోవిందరాజులు, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, సుధీర్‌రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి, వర్సిటీ వీసీ డాక్టర్‌ ప్రవీణ్‌రావు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు