బీజేపీ కుట్ర కోణం!

19 Mar, 2023 01:14 IST|Sakshi

టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీపై లోతుగా దర్యాప్తు జరపాలని డీజీపీని కోరాం: కేటీఆర్‌ 

నిందితుడు బీజేపీ క్రియాశీల కార్యకర్త.. ఎన్నో ఫొటోలున్నాయి 

ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం కుట్ర అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే అన్నారు 

ఇందులో క్రిమినల్‌ మోటివ్, కుట్ర అనుమానాలు 

ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర ఉందో లేదో శోధించాలి 

టీఎస్‌పీఎస్సీలో లోపాలను సరిదిద్ది కట్టుదిట్టం చేస్తాం 

ఈ వ్యవహారంలో వ్యవస్థ, సంస్థాగత తప్పిదాలు లేవు 

అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు 

సాధ్యమైనంత త్వరలో పరీక్షలుంటాయి.. యువత నిరాశకు గురికావద్దు 

ప్రశ్నపత్రాల లీకేజీపై సమావేశం అనంతరం మీడియాతో మంత్రి వెల్లడి 

విపక్షాలు పిల్లల జీవితాలతో ఆడుకోవడం సరికాదని వ్యాఖ్య

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై మాకూ ఓ అనుమానం ఉంది. ఈ కేసులో అనుమానితుడిగా, నిందితుడిగా అరెస్టయిన రాజశేఖర్‌ రెడ్డి బీజేపీ క్రియాశీల కార్య కర్త. అతడి వెనుక ఎవరైనా ఉన్నారా? ఏమైనా కుట్ర కోణం ఉందా? అన్న అంశాలను వెలికి తీయాలని బీఆర్‌ఎస్‌ తరఫున డీజీపీకి ఫిర్యాదు చేశాం. మా ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు ఇస్తుంటే.. ఇలా నోటిఫికేషన్లు ఇవ్వడం కుట్ర అని, యువతను బిజీగా ఉంచి తమ దగ్గరికి రానీయకుండా చేయడానికే నోటిఫికేషన్లు ఇచ్చా రని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు (బండి సంజయ్‌) స్వయంగా అన్నారు. దీన్ని బట్టి అనుమానించాల్సి వస్తోంది..
– బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌:  టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి రాష్ట్రంలోని యువత, నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. సాధ్యమైనంత త్వరగా మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. ఈ లీకేజీ కేసులో నిందితుడు రాజశేఖర్‌రెడ్డి సామాజిక మాధ్యమాల్లో చాలా చురుకుగా బీజేపీ అనుకూలతను ప్రదర్శిస్తూ, ఆ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేశాడని.. ఇందుకు సంబంధించి ఎన్నో ఫొటోలు ఉన్నాయని తెలిపారు.

ఇలాంటి వ్యక్తి ఉండటంతోనే అనుమానిస్తున్నామని.. ఈ కుట్ర కోణంలో దర్యాప్తు జరపాలని డీజీపీ, రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని కోరుతున్నామని చెప్పారు. ప్రశ్నపత్రాల లీకుల వెనక ఎవరున్నా.. వారు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ఏ పార్టీవారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు, భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ జరగకుండా అమలు చేయాల్సిన సంస్కరణలపై శనివారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, సీఎస్‌ శాంతికుమారి, టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ తదితరులతో మంత్రి కేటీఆర్‌ సమావేశమై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడమే కుట్ర అనే ధోరణిలో మాట్లాడిన వ్యక్తి (బండి సంజయ్‌) పార్టీకి సంబంధించిన వ్యక్తి ఏ2గా దొరకడం చూస్తే ఇందులో కుట్రకోణం ఏమైనా ఉందా? ప్రభుత్వాన్ని బద్నాం చేసి యువతలో లేని పోని అనుమానాలు కలిగించే విధంగా నిందలు వేసి అప్రతిష్టపాలు చేయాలని కుట్ర ఉందా? అన్నది శోధించాలని డీజీపీని కోరుతున్నాం. 

ఇది వ్యవస్థ వైఫల్యం కాదు.. 
టీఎస్‌పీఎస్సీలోని ఇద్దరు వ్యక్తులు చేసిన ఒక తప్పుతో మొత్తం వ్యవస్థకు చెడ్డపేరు వస్తోంది. దీనిని నివారించి ఉండాల్సింది. రాష్ట్ర యువతలో భరోసా నింపాల్సిన బాధ్యత ఉందని భావించి సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో ఈ సమావేశం నిర్వహించాం. గత 8 ఏళ్లలో దేశంలోని 28 రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా టీఎస్‌పీఎస్సీ అత్యధిక సంఖ్యలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తి చేసింది.

155 నోటిఫికేషన్లు ఇచ్చి 37వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసింది. ఉమ్మడి ఏపీలో ఏదైనా పరీక్ష జరిగిందంటే ఏపీపీఎస్సీ మీద పుంఖానుపుంఖాలుగా ఆరోపణలు వచ్చేవి. టీఎస్‌పీఎస్సీ 37 వేల ఉద్యోగాలు భర్తీ చేసినా ఏ ఒక్క ఆరోపణ రాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన ఇంటర్వ్యూలలో పక్షపాతం ఉండేదని ఆరోపణలున్న నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ ఇంటర్వ్యూల విధానాన్ని రద్దు చేసింది. 

సంస్కరణలపై చర్చించాం.. 
ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులే కాదు.. వారి వెనకాల ఎవరున్నా నిష్పక్షపాతంగా సిట్‌ దర్యాప్తు పూర్తయిన తర్వాత చట్టపరంగా కఠినాతి కఠినంగా శిక్షించే బాధ్యత మాది. ఇది వ్యవస్థ వైఫల్యమో, సంస్థాగత వైఫల్యమో కాదు. కేవలం ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు. లక్షల మంది పిల్లలకు ఇబ్బంది ఎదురైంది. ఇలా మళ్లీ జరగకుండా చేయాల్సిన మార్పులు, సంస్కరణలపై సుదీర్ఘంగా చర్చించాం. 

యువత ఆందోళన చెందవద్దు 
లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నాం. నిరుద్యోగ యువతకు సంబంధించి ఏవో కొన్ని వార్తలు (ఆత్మహత్యల వార్తలు) వస్తున్నాయి. యువత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారి వెంట ప్రభుత్వం ఉంది. నాలుగు పరీక్షలను రద్దుచేసిన నేపథ్యంలో ఆ అభ్యర్థులు మళ్లీ ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు.

పటిష్టమైన నివారణ చర్యలతో సాధ్యమైనంత త్వరగా పరీక్షలు నిర్వహిస్తాం. గతంలో దరఖాస్తు చేసుకున్న వారంతా మళ్లీ పరీక్ష రాసేందుకు అర్హులే. టీఎస్‌పీఎస్సీలో హ్యాకింగ్‌ జరగలేదని సిట్‌ ప్రాథమిక దర్యాప్తులో తేలింది.  

విపక్షాలు పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు 
లీకేజీ అంశాన్ని చిలువలు పలువలు చేసి ఇష్టమొచ్చినట్టు మాట్లాడి యువతలో అశాంతి, అసహనం చెలరేగేలా, ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేలా విపక్షాల నేతలు వ్యాఖ్యలు చేయడం సరికాదు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి ఉంది.

రాజకీయ నిరుద్యోగులు, బేహారుల రెచ్చగొట్టే మాటలను నిరుద్యోగులు పట్టించుకోవద్దు. ఆరేడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. కొందరు నేతలు ఎన్ని చిల్లర ప్రయత్నాలు, ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు ఏం చేయాలో అదే చేస్తారు. 

మీరా మాకు నీతులు చెప్పేది? 
కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి అక్కడ ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పోయేటట్టు చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని స్వయంగా ప్రధాన మంత్రి అన్నారు.

ఎక్కడ పోయాయి ఆ ఉద్యోగాలు అని అడిగితే.. పకోడీలు వేయడం కూడా ఉద్యోగాలని అంటారు. అలాంటి మీరు (బీజేపీ నేతలు) వచ్చి ఉద్యోగాలపై మాకు చెప్తే చాలా దరిద్రంగా ఉంటుంది. చెప్పి మాటపడొద్దు. 

రాష్ట్రంలోని ప్రతి కంప్యూటర్‌కి నేనే బాధ్యుడినా? 
రాజ్యాంగబద్ధమైన టీఎస్‌పీఎస్సీ రోజువారీ వ్యవహారాల్లో ప్రభుత్వం పాత్ర ఉండదు. ప్రభుత్వం తరఫున ఒక సెక్రటరీ మాత్రమే ఉంటారు. కానీ ఐటీ మంత్రిని బర్తరఫ్‌ చేయాలని ఒకరు అంటారు. రాష్ట్రంలోని ప్రతి కంప్యూటర్‌కు నేనే బాధ్యుడినా? ఇంటర్‌ బోర్డు, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లలో ఏం జరిగినా ఐటీ మంత్రిది తప్పు అంటారు.

గుజరాత్‌లో 8 ఏళ్లలో 13 పేపర్లు లీకైతే అక్కడ ఎవరైనా మంత్రిని బర్తరఫ్‌ చేశారా? రాజీనామా చేశారా? మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణంలో నేరుగా సీఎం మీద ఆరోపణలు వస్తే ఆయన రాజీనామా చేశారా? అస్సాంలో మొన్న పోలీసు నియామకాల ప్రశ్నపత్రం లీకైతే సీఎం రాజీనామా చేశారా..’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.  

24 గంటలూ రీడింగ్‌ రూమ్‌లు.. ఉచిత భోజన వసతి 
రద్దయిన గ్రూప్‌–1, డీఏఓ, టీపీఓ, ఏఈఈ పరీక్షల కోచింగ్‌ మెటీరియల్‌ను రెండు, మూడు రోజుల్లో ఆన్‌లైన్‌లో ఉచితంగా అందుబాటులోకి తెస్తాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టడీ సర్కిళ్లను బలోపేతం చేస్తాం. జిల్లాల్లోని రీడింగ్‌ రూమ్‌లు ఇకపై 24 గంటలూ తెరిచి ఉంటాయి.

అక్కడ అభ్యర్థులకు ఉచిత భోజన వసతి కల్పిస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా సీఎస్‌ నాయకత్వంలో కలెక్టర్లు శిక్షణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. ఇంకా ఏమైనా నిర్దిష్ట డిమాండ్‌ వస్తే నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. 

మరిన్ని వార్తలు