ఆనాటి తారకరాముడి డైలాగ్‌తో​ అదరగొట్టిన కేటీఆర్‌.. అసెంబ్లీలో చప్పట్ల మోత!

13 Sep, 2022 11:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. మూడో రోజు సమావేశాల్లో భాగంగా కొత్త పార్లమెంట్‌ భవనానికి బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. 

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చింది. అంబేద్కర్‌ మూల సిద్ధాంతం ప్రజాస్వామం, సమానత్వం. దేశానికే దిశానిర్దేశం చేసిన దార్శనికుడు అంబేద్కర్‌. సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం సాధించకుండా రాజకీయ ప్రజాస్వామ్యం విజయవంతం కాదు.. విజయవంతంగా నిలదొక్కుకోదు అనే గొప్ప మాటను అంబేద్కర్‌ ఆనాడు చెప్పారు. 

నేను రాసిన రాజ్యాంగం కనుక దుర్వినియోగం అయితే.. దాన్ని నేనే మొదటి వ్యక్తిని అవుతానని చెప్పిన గొప్ప మహానుభావుడు అంబేద్కర్‌. జాతిపిత మహాత్మాగాంధీకి ఏ మాత్రం తగ్గని మహానుభావుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌. ఆయన మహిళల పక్షపాతి.. వారికి సమాన హక్కులు రావాలని పోరాడి పదవికి వదులుకున్న గొప్ప వ్యక్తి అంబేద్కర్‌. 

అంబేదర్క్‌ రాసిన రాజ్యంగంలో ఆర్టికల్‌-3 లేకపోతే.. కొత్త రాష్ట్రాలకు అవకాశం ఇవ్వకపోతే.. నేడు తెలంగాణ రాష్ట్రమే లేదు, శాసనసభే ఉండేది కాదు. రాష్ట్ర శాసనసభ ఆమోదంతో గానీ.. శాసనసభ అంగీకారంతో నిమ్మితం లేకుండానే.. పార్లమెంట్‌లో సింపుల్‌ మెజార్టీతో కచ్చితంగా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చునని చెప్పి ఆర్టికల్‌-3ను పొందుపరిచారు. కాబట్టి, మహానుభావుడు అంబేద్కర్‌కు తెలంగాణయావత్తు సర్వదా.. శతదా.. రుణపడి ఉంటుందని కామెంట్స్‌ చేశారు. 

మరిన్ని వార్తలు