హైదరాబాద్‌కు 2051 వరకు నీటి సమస్య రాకుండా చేశాం: కేటీఆర్‌

13 Mar, 2022 01:46 IST|Sakshi

దశాబ్దం తర్వాత అత్యధిక జనాభా గల రెండో నగరంగా హైదరాబాద్‌ 

మంత్రి కేటీఆర్‌ వెల్లడి 

ప్రభుత్వ ఆస్పత్రులకు మరో 25 వేల పడకలు: మంత్రి హరీశ్‌ 

ప్రతీ పట్టణంలో కొత్త నల్లా కనెక్షన్‌ రూపాయికే ఇస్తున్నాం. గతంలో కాంగ్రెస్‌ హయాంలో ప్రతీ సంవత్సరం ఎండాకాలంలో ఖాళీ కుండలతో నిరసనలు జరిగేవి. నేను హైదరాబాద్‌లో స్కూలుకు వెళ్లినప్పుడూ ఇవే కనిపించేవి. వాటి వల్ల ఎప్పుడూ స్కూలు ఆలస్యమయ్యేది. దానికి కారణం భట్టి విక్రమార్క వాళ్ల పార్టీనే. హైదరాబాద్‌కు 2051 సంవత్సరం వరకు కూడా నీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాం.     – మంత్రి కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాబోయే పదీ పదిహేనేళ్లల్లో ఢిల్లీ తర్వాత హైదరాబాదే ఎక్కువ జనాభా ఉన్న నగరంగా ఉండనుందని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాలను వెనక్కు నెడుతుందని, అందువల్ల దానికి తగినట్లుగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. శనివారం అసెంబ్లీలో తన శాఖ పద్దుపై సభ్యుల చర్చ అనంతరం కేటీఆర్‌ మాట్లాడారు. ‘మెరుగైన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కోసమే పట్టణాలకు ప్రజల వలస ఉంటుంది. హైదరాబాద్‌ నుంచే 45–50% రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) వస్తుంది. మొత్తం పట్టణాల నుంచే 70% జీఎస్‌డీపీ వస్తుంది.

పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకునే మున్సిపాలిటీలను పెంచాం. రాబోయే ఆర్థిక సంవత్సరంలో 142 మున్సిపాలిటీల్లో ప్రతీ పట్టణంలో ఇంటిగ్రేటెడ్‌ వెజ్, నాన్‌ వెజ్‌ మార్కెట్, ప్రతీ ఇంటికి నీటి సరఫరా, వైకుంఠ ధామం, డిజిటల్‌ డోర్‌ నంబర్, మెకనైజ్డ్‌ ధోబీ ఘాట్, మానవ వ్యర్థాల శుద్ధీకరణ, పచ్చదనం పెంచడం వంటివి చేస్తాం. 1,600 నర్సరీలు అన్ని మున్సిపాలిటీల్లో పెట్టాం. దేశంలో హైదరాబాద్‌ ‘ట్రీ సిటీ ఇండియా’అని ఐక్యరాజ్యసమితి చెప్పింది. హైదరాబాద్‌ను జీరో వేస్ట్‌ నగరంగా మార్చాలన్నది లక్ష్యం’అని కేటీఆర్‌ చెప్పారు. 

మరో 25 వేల పడకలు: హరీశ్‌రావు 
ఇప్పటివరకు రాష్ట్రంలో తలసరి ప్రభుత్వం చేసే వైద్య ఖర్చు రూ.1,695 అని, ప్రస్తుత బడ్జెట్లో రూ.3,092 ఖర్చు చేయబోతున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. వైద్య ఆరోగ్యశాఖ పద్దుపై జరిగిన చర్చ అనంతరం ఆయన మాట్లాడారు. ‘డయాలసిస్‌లో సింగిల్‌ యూజ్‌ సిస్టమ్‌ తెచ్చాం. తమిళనాడులో అక్కడి సీఎం స్టాలిన్‌ మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీని వైఎస్సార్‌ ప్రారంభించినా, మంచి పథకం కాబట్టి దాన్ని బలోపేతం చేశాం. కోవిడ్‌లో అత్యధికంగా ప్రాణాలను కాపాడిన రాష్ట్రంగా జాతీయ ఆర్థిక సర్వే చెప్పింది. కేంద్రం అవార్డులు కూడా ఇచ్చింది. ఖమ్మంకు మెడికల్‌ కాలేజీ, ఖమ్మం జిల్లాకు నర్సింగ్‌ కాలేజీ ఇస్తున్నాం. అందుకు అనువైన స్థలం చూడాలని ఈరోజే కలెక్టర్‌కు లేఖ రాశాను. ఉస్మానియా ఆసుపత్రిపై కోర్టు నుంచి క్లియరెన్స్‌ రాగానే కొత్త భవనం కడతాం’అని హరీశ్‌ చెప్పారు.  

టూరిస్టులు 200 శాతం పెరిగారు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 
తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రానికి వచ్చే దేశ విదేశీ టూరిస్టుల సంఖ్య 200 శాతం పెరిగిందని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. తన శాఖలకు సంబంధించి పద్దులపై చర్చ అనంతరం ఆయన మాట్లాడారు. ‘ప్రతీ జిల్లాలో స్పోర్ట్స్‌ స్కూళ్లను పెంచాలని భావిస్తున్నాం. స్పోర్ట్స్‌ అకాడమీలను ఒక్కో జిల్లాలో ఏర్పాటు చేస్తాం. సెట్విన్‌ చిన్న ఎలక్ట్రిక్‌ బస్సులు తేవాలనుకుంటున్నాం. సెట్విన్‌ సంస్థను ప్రతీ నియోజకవర్గానికి తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఒక్కో జిల్లాను ఒక పర్యాటక ప్రాంతంగా చేయాలని నిర్ణయించాం’అని చెప్పారు.     

మరిన్ని వార్తలు