‘సైదాబాద్‌ హత్యాచార ఘటన’పై మంత్రి కేటీఆర్‌ దిగ్భ్రాంతి

12 Sep, 2021 16:06 IST|Sakshi

సత్వరం న్యాయం చేయాలని హోంమంత్రి, డీజీపీకి విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: సైదాబాద్‌ చిన్నారి హత్యాచార ఘటనపై మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి లైంగిక వేధింపులు, అత్యాచారం వార్తతో తీవ్ర మనస్తాపానికి గురయ్యా. నేరస్తుడిని గంటల వ్యవధిలో అరెస్ట్‌ చేశారు. బాధిత కుటుంబానికి సత్వర న్యాయం చేయాలి’ అని కేటీఆర్‌.. హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డిని విజ్ఞప్తి చేశారు.
చదవండి: టీడీపీలో కుతకుతలు.. నిన్న జేసీ, కాల్వకు.. నేడు ఉమా, ఉన్నం

సింగరేణి కాలనీలో తోటిపిల్లలతో కలసి ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారికి గురువారం (సెప్టెంబర్‌ 9) చాక్లెట్‌ ఆశ చూపి తీసుకెళ్లి ఓ యువకుడు అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. చిన్నారి తల్లిదండ్రులు నల్లగొండ జిల్లా దేవరకొండ సమీప తండాకు చెందిన గిరిజన కుటుంబం. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి సింగరేణి కాలనీలో నివసిస్తోంది. ఈ సమయంలోనే ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇక ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పలు సంఘాలు, సామాజికవేత్తలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబానికి పరిహారం అందించాలని, న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.
చదవండి: కాంగ్రెస్‌కు ఊహించని షాక్: హాట్‌హాట్‌గా ఉత్తరాఖండ్‌ రాజకీయం
 

మరిన్ని వార్తలు