టెక్స్‌టైల్‌ చక్కగా.. ప్లాన్‌ పక్కాగా!

1 Mar, 2022 01:42 IST|Sakshi
సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి కేటీఆర్‌ ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అభివృద్ధి పథంలో వెళ్తున్న టెక్స్‌టైల్‌ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్‌ టెక్స్‌టైల్‌ శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే తెలంగాణ వస్త్ర రంగంలో పెట్టుబడులకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. కేటీఆర్‌ టెక్స్‌టైల్‌ శాఖ తరఫున చేపట్టిన పలు కార్యక్రమాలతోపాటు బడ్జెట్‌లో పొందుపరచాల్సిన వివిధ అంశాలపై సోమవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

టెక్స్‌టైల్‌ రంగాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తరఫున చేపట్టాల్సిన కార్యాచరణ, భవిష్యత్‌ ప్రణాళికలపైన సమగ్ర నివేదికను రూపొందించాలన్నారు. గత ఏడున్నరేళ్లుగా ప్రభుత్వం నేతన్నల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అనేక కార్యక్రమాలు చేపట్టిందని, వాటి ఫలితాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయని చెప్పారు. ఈ రంగంలో ఉపాధి కల్పనే ప్రాథమిక లక్ష్యంగా, నేతన్నల సంక్షేమమే పరమావధిగా అనేక వినూత్న కార్యక్రమాలను తెచ్చిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.

దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న టెక్స్‌టైల్‌ రంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, అందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించిందన్నారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను, ఇక్కడి మానవవనరులను, ప్రభుత్వ విధానాలను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. సమావేశంలో జౌళిశాఖ కమిషనర్‌ శైలజా రామయ్యర్, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకట నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు