కరోనా వస్తే ఆగం కావొద్దు 

4 Aug, 2020 03:22 IST|Sakshi
సిరిసిల్లలో కోవిడ్‌–19 కిట్లను అందిస్తున్న మంత్రి కేటీఆర్‌

ప్రజల్లో విశ్వాసం నింపేందుకే తిరుగుతున్నా: కేటీఆర్‌  

రాష్ట్రంలో కరోనా మరణాలు తక్కువే.. 

విపక్షాలది విజ్ఞత లేని విమర్శలు 

సిరిసిల్లలో కరోనా వార్డు, ఐసోలేషన్‌ కేంద్రం ప్రారంభం 

సిరిసిల్ల: ప్రపంచమంతా కరోనా వైరస్‌ విస్తరిస్తుంటే కొందరు పనికి మాలిన విమర్శలు చేస్తున్నారని, వాటిని పట్టించుకోబోమని ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో కరోనా ప్రత్యేక వార్డును, ఐసోలేషన్‌ కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కరోనాపై ప్రతిపక్షాలది విజ్ఞత లేని విమర్శలని పేర్కొన్నారు. ఇలాంటి కష్టకాలంలో రాజకీయాలు మాట్లాడటం బాధాకరమన్నారు.

ఇంతటి క్లిష్ట సమయంలో ఎందుకు తిరుగుతున్నారని పలువురు అంటున్నారని, కానీ ప్రజల్లో విశ్వాసం నింపేందుకే తాను పర్యటనలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా సోకిన వారికి వైద్యం చేయడం లేదని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు మాత్రమే ధైర్యంగా సేవలు అందిస్తున్నారని, అలాంటి వారికి అందరూ అండగా ఉండాలని కోరారు. మీడియా కూడా నెగెటివ్‌ కోణాన్ని వీడి పాజిటివ్‌గా ఆలోచించాలని సూచించారు. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ చేయడం పరిష్కారం కాదని తేలిపోయిందని చెప్పారు. కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కరోనా సోకిన వారి పట్ల మానవతా కోణంలో స్పందించి సాయం అందించాలని, వారిని వెలివేసినట్లుగా చూడొద్దని కోరారు.  

వృద్ధుల ఆత్మహత్య కలచివేసింది 
హైదరాబాద్‌లో ఇద్దరు వృద్ధులకు కరోనా సోకడంతో మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకోవడం తనను ఎంతో కలచివేసిందని మంత్రి పేర్కొన్నారు. నిజానికి కరోనాకు మందే లేదని, నివారణ ఒక్కటే మార్గమని చెప్పారు. ఎంతో మంది కరోనా నుంచి కోలుకుంటున్నారని వివరించారు. వయసులతో సంబంధం లేకుండా.. బాగయ్యారని ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, కాంగ్రెస్‌ నేత వి.హన్మంతరావును ఉదహరించారు. 

మరణాలు చాలా తక్కువ 
దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే.. తెలంగాణలో కరోనా మరణాలు చాలా తక్కువని, ఒక్క శాతం మాత్రమే మరణాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కరోనా వస్తే.. భయపడి బెంబేలెత్తాల్సిన పని లేదన్నారు. అలాగని నిర్లక్ష్యం తగదన్నారు. ఎవరికి వారు ధీమాగా ఉంటూనే.. వ్యాక్సిన్‌ వచ్చే వరకు ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు జాగ్రత్తలు పాటించాలని కేటీఆర్‌ సూచించారు.

నాకు కరోనా వస్తే కోలుకుని ప్లాస్మా ఇస్తా.. 
తనకు కరోనా వస్తే కోలుకున్నాక ప్లాస్మా ఇచ్చి ఆదర్శంగా ఉంటానని కేటీఆర్‌ స్పష్టం చేశారు. కరోనా సోకి కోలుకున్న టీఆర్‌ఎస్‌ నాయకులు ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అందుబాటులో ఉన్న నిధులను వినియోగించుకొని ఆగస్టు నుంచి సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలోని శానిటేషన్‌ సిబ్బంది వేతనాలు పెంచి ఇవ్వాలని కోరారు. జిల్లాలో మెరుగైన వైద్యం, మౌలిక వసతుల కోసం తాను సొంతంగా రూ.20 లక్షలు ఇస్తున్నానని, సీఎస్‌ఆర్‌లో మరో రూ.2.28 కోట్లు సమకూర్చుతున్నామని మంత్రి వెల్లడించారు. కొత్తగా మంజూరైన ఐదు అంబులెన్స్‌లను మంత్రి ప్రారంభించారు. నూలు పౌర్ణమి సందర్భంగా సిరిసిల్లలోని నేతన్న విగ్రహానికి పూల మాల వేశారు. 

మరిన్ని వార్తలు