అసమర్థ ఆర్థిక విధానాలతో వంట గదిలో మంట..

8 Jul, 2022 01:27 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్‌ ధ్వజం

మోదీ ప్రభుత్వ అసమర్థ ఆర్థిక విధానాలే కారణం: మంత్రి కేటీఆర్‌ 

ఎనిమిదేళ్లలో సిలిండర్‌ ధరలో170 శాతం పెరుగుదల

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేని స్థితిలో మోదీ సర్కార్‌

మళ్లీ కట్టెల పొయ్యి వైపు ఉజ్వల లబ్ధిదారుల చూపులు

బీజేపీ పాలన వైఫల్యాలపై టీఆర్‌ఎస్‌ నిరంతర పోరాటం చేస్తుందని వెల్లడి

వంట గ్యాస్‌ ధర పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ నిరసనలు

సాక్షి, హైదరాబాద్‌: నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అస్తవ్యస్త ఆర్థిక విధానాలతో గ్యాస్‌ ధరలు పెరిగి వంట గదుల్లో మంట పుడుతోందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. గడియకోమారు పెరుగుతున్న గ్యాస్‌ ధరలతో దేశ ప్రజలకు గుండె దడ వస్తోందని, ఎనిమిదేళ్లలో వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర 170 శాతం పెరిగి రూ.1,100 దాటిందన్నారు. ప్రపంచంలోనే ఎక్కువ రేటుకు సిలిండర్‌ను అమ్ముతున్న రికార్డును మోదీ ప్రభుత్వం సాధించిందని ఎద్దేవాచేశారు. రాయితీని కూడా ఎత్తివేసి మోదీ ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారని దుయ్యబట్టారు.

ఈ మేరకు కేటీఆర్‌ గురువారం ప్రకటన విడుదల చేశారు. ‘ఓ వైపు రూపాయి విలువ తగ్గుతూ, మరోవైపు పెట్రో ధరలు పెరుగుతుండటంతో నిత్యావసరాల ధరలు పెరిగి భారతీయులకు కుటుంబ బడ్జెట్‌ భారంగా మారింది. కొత్త ఉద్యోగాలు రాక, ఉన్న ఉద్యోగాలు ఊడి ప్రజల ఆదాయం పడిపోయినా మోదీ ప్రభుత్వం ఏ మాత్రం కనికరం లేకుండా ధరల పెంపుతో పీల్చి పిప్పిచేస్తోంది. అధికారంలోకి రాకమునుపు వంట గ్యాస్‌ ధరలపై గొంతు చించుకున్న మోదీ, ఇతర బీజేపీ నేతలు ఇప్పుడు తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేని మోదీ పన్నులు పెంచడాన్ని సుపరిపాలనగా భావిస్తున్నారు’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. 


మోదీ కుటిలనీతిని గమనిస్తున్నారు
‘గ్యాస్‌ ధరల పెంపునకు అంతర్జాతీయ కారణాలను సాకుగా చూపించి తమ చేతకానితనాన్ని దాచాలనుకుంటున్న మోదీ ప్రభుత్వ కుటిలనీతిని దేశ ప్రజలు గమనిస్తున్నారు. ఉజ్వల పథకం పేరిట తమకు అంటగట్టిన గ్యాస్‌ సిలిండర్లకు బదులు లబ్ధిదారులు మళ్లీ కట్టెల పొయ్యి వైపు చూస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీజేపీ జుమ్లా జాబితాలో ఉజ్వల పథకం కూడా చేరింది. ఎన్నికల సమయంలో మాత్రమే ధరలను నియంత్రించినట్లు దొంగ నాటకాలు ఆడే బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా పేదల పట్ల సానుభూతితో వ్యవహరించి గ్యాస్‌ ధరలను తగ్గించాలి. కేంద్ర ప్రభుత్వ అసమర్థ ఆర్థిక విధానాలు, ధరల పెంపుపై టీఆర్‌ఎస్‌ నిరంతరం వివిధ రూపాల్లో ఒత్తిడి కొనసాగిస్తుంది’ అని కేటీఆర్‌ చెప్పారు.

ధరల పెంపుపై టీఆర్‌ఎస్‌ నిరసన
కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలకు నిరసనగా కేటీఆర్‌ పిలుపు మేరకు టీఆర్‌ఎస్‌శ్రేణులు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహించాయి. అన్ని మండల, పట్టణ, డివిజన్‌ కేంద్రాల్లో నిరసనలు చేపట్టాయి. పలుచోట్ల పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనల్లో పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం గండిమైసమ్మ చౌరస్తాలో ఖాళీ గ్యాస్‌ సిలిండర్లు, ఫ్లకార్డులతో నిర్వహించిన నిరసనకు మేడ్చల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు నేతృత్వం వహించారు. రోడ్డుపై కట్టెల పొయ్యిపై వంట చేసి నిరసన తెలిపారు. పెద్దఎత్తున తరలివచ్చిన మహిళలతో మానవహారం నిర్వహించారు.

మరిన్ని వార్తలు