దేశంలోనే బెస్ట్‌ మంత్రిగా కేటీఆర్‌

25 Feb, 2021 15:46 IST|Sakshi

‘ఈ గవర్నెన్స్‌ స్టేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌– 2020’గా తెలంగాణ

స్కోచ్‌ ర్యాంకింగ్‌లో మొదటి స్థానంలో రాష్ట్రం ట్విట్టర్‌లో కేటీఆర్‌ హర్షం 

సాక్షి, హైదరాబాద్‌: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) ద్వారా పౌరులకు మెరుగైన సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు గుర్తింపుగా 2020 సంవత్సరానికి ప్రతిష్టాత్మక స్కోచ్‌ అవార్డులు దక్కాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ‘బెస్ట్‌ పెర్ఫార్మింగ్‌ ఐటీ మినిస్టర్‌’గా, తెలంగాణ రాష్ట్రం ‘ఈ గవర్నెన్స్‌ స్టేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా ఎంపికైంది. 2003 నుంచి కేంద్రంతో పాటు వివిధ రాష్ట్రాలు మెరుగైన పాలన కోసం అనుసరిస్తున్న విధానాలపై చేసిన అధ్యయనం తర్వాత తెలంగాణను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు స్కోచ్‌ గ్రూప్‌ చైర్మన్‌  సమీర్‌ కొచ్చర్‌ వెల్లడించారు. ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌.. కొచ్చర్‌ తరఫున ఈ నెల 23న కేటీఆర్‌కు ఈ అవార్డును అంద జేశారు.

‘ఐటీ సాంకేతికత వినియోగం ద్వారా పౌర సేవలను మెరుగు పరచడంలో తెలంగాణ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోంది. ముఖ్యంగా కోవిడ్‌–19 సమయంలో పౌర సేవలను అందించడంలో ఆధునిక టెక్నాలజీ జీవన రేఖగా నిలిచింది. ఈ విషయంలో అత్యంత శ్రద్ధ చూపిన కేటీఆర్‌కు 2020లో అవార్డు దక్కింది. 2016లోనూ కేటీఆర్‌ ఈ అవార్డును అందుకున్నారు. రెండుసార్లు స్కోచ్‌ అవార్డును అందుకున్న ఏకైక మంత్రి కేటీఆర్‌’ అని కొచ్చర్‌ వ్యాఖ్యానించారు. తనకు అవార్డు లభించడంపై మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశారు.

ఈ గవర్నెన్స్‌లో తెలంగాణ టాప్‌..
ఈ గవర్నెన్స్‌లో 2019 స్కోచ్‌ ర్యాంకింగ్‌లో పదో స్థానంలో నిలిచిన తెలంగాణ, 2020 సంవత్సరంలో మొదటి స్థానంలో నిలిచింది. 2019లో ఎనిమిదో స్థానం సాధించిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, ప్రస్తుత ర్యాంకింగ్‌లో మహారాష్ట్రతో కలిసి రెండో స్థానంలో నిలిచింది. కర్ణాటక, పశ్చిమ బెంగాల్, రాజస్తాన్‌ రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2021 ర్యాంకింగ్‌కు సంబంధించి మదింపు ప్రక్రియ ప్రారంభమైందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల పనితీరును కూడా మదింపు చేస్తామని స్కోచ్‌ అవార్డు కమిటీ పేర్కొంది. 

మరిన్ని వార్తలు