టీఆర్‌ఎస్‌కు నూరేళ్ల ఆయుష్షు

2 Aug, 2020 04:58 IST|Sakshi
శనివారం టీఆర్‌ఎస్‌ కార్యకర్తల జీవిత బీమా ప్రీమియం చెక్కును యునైటెడ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ప్రతినిధులకు అందజేస్తున్న మంత్రి కేటీఆర్‌

వందేళ్లయినా పార్టీ చెక్కుచెదరదు: మంత్రి కేటీఆర్‌ 

నాడు జలదృశ్యం నుంచి చంద్రబాబు మెడపట్టి గెంటేశారు 

నేడు హైదరాబాద్‌ నడిబొడ్డున రాచఠీవీతో కార్యాలయం 

త్వరలో పార్టీ జిల్లా కార్యాలయాలకు ముహూర్తం 

పార్టీ కార్యకర్తల కుటుంబాలకు జీవిత బీమా చెక్కులు పంపిణీ 

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో 2001, ఏప్రిల్‌ 27న పురుడుపోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి వందేళ్లపాటు చెక్కు చెదరదన్నంత బలంగా ముందుకు దూసుకుపోతోందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు అన్నారు. పార్టీ ప్రస్థానంలో ఇరవై ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ముహూర్త, సంకల్పబలంతో అజేయశక్తిగా ఎదిగిందన్నారు. వివిధ ప్రమాదాల్లో మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో శనివారం బీమాచెక్కులను అందజేశారు. ‘టీడీపీ అధినేత, అప్పటి సీఎం చంద్రబాబు నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ను జలదృశ్యం నుంచి మెడపట్టి గెంటేశారు. కార్యకర్తల శ్రమ, రక్తంతో రోడ్డునపడే పరిస్థితి నుంచి ప్రతిపక్షాలను కకావికలం చేసి హైదరాబాద్‌ నడిబొడ్డున రాచఠీవీతో కార్యాలయం నిర్మిం చుకున్నాం. పార్టీలు, లక్ష్యాలు ఎన్ని ఉన్నా టీఆర్‌ఎస్‌ ఇతర పార్టీలలాంటిది కాదు. పార్టీ ఆవిర్భావ సమయంలో నెలకొన్న అనుమానాల్ని పటాపంచలు చేయడంతోపాటు పార్టీని చీల్చే కుట్రలు, నీలాపనిందలను ఎదుర్కొని నిలదొక్కుకున్నాం. మేం ఎమ్మెల్యేలు, మం త్రులుగా ఎదగడం వెనక లక్షలాదిమంది కార్యకర్తల శ్రమ ఉంది’ అని కేటీఆర్‌ అన్నారు.

త్వరలో జిల్లా పార్టీ కార్యాలయాలు 
జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు ఒకటి రెండు చోట్ల మినహా 90 శాతం మేర పూర్తయ్యాయన్నారు. కార్యకర్తల శిక్షణకు కరోనా మూలంగా అంతరాయం కలిగినా, ఇప్పటికే రిసోర్స్‌ పర్సన్లను గుర్తించామన్నారు. త్వరలో పార్టీ కార్యాలయాలు ప్రారంభించి పార్టీ, ప్రభుత్వం, ప్రజల నడుమ కార్యకర్తలు వారధిగా నిలిచేలా శిక్షణనిస్తామని కేటీఆర్‌ వెల్లడించారు. సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు సత్యవతిరాథోడ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బి.వెంకటేశ్వర్లు, ఫరీదుద్దీన్, నరేంద్రనాథ్, సుధీర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్, జి.బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

మా కార్యకర్తల వల్లే మీకు పదవులు 
టీపీసీసీ, టీబీజేపీ నేతలకు టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు చేసిన ఉద్యమం వల్లే పదవులు లభించాయని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ మీద మాట తూలడానికి ముందు కాంగ్రెస్, బీజేపీ నేతలు ఈ విషయం గుర్తుంచుకోవాలన్నారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలబడేందుకు ఇప్పటివరకు రూ.47.65 కోట్లు జీవిత బీమా ప్రీమియం చెల్లించినట్లు కేటీఆర్‌ వెల్లడించారు. ఈ ఏడాది కూడా రూ.16.10 కోట్లు ప్రీమియంగా చెల్లించామని, కార్యకర్తల సంక్షేమం కోసం పార్టీ అ«ధ్యక్షుడు కేసీఆర్‌ కొత్త కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. కరోనా సంక్షోభ సమ యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అండగా నిలబడాలన్నారు.

మరిన్ని వార్తలు