వ్యాక్సిన్‌ లభ్యతే అతిపెద్ద సవాల్‌: మంత్రి కేటీఆర్‌

14 May, 2021 04:10 IST|Sakshi

 45 రోజుల్లోనే రాష్ట్ర ప్రజలందరికీ వ్యాక్సిన్‌ ఇచ్చే వసతులు మనకున్నాయి 

వ్యాక్సినేషన్‌లో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ మెరుగు 

ట్విట్టర్‌లో నెటిజన్ల ప్రశ్నలకు కేటీఆర్‌ జవాబులు 

సాక్షి, హైదరాబాద్‌:  కేవలం 45 రోజుల్లోనే రాష్ట్ర ప్రజలందరికీ వ్యాక్సిన్‌ ఇచ్చే మౌలిక వసతులు అందుబాటులో ఉన్నా వ్యాక్సిన్‌ లభ్యత అతి పెద్ద సవాలుగా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. చిన్నారులకు వ్యాక్సినేషన్‌ జరగనందున ఆన్‌లైన్‌ విధానంలో విద్యా బోధన మరికొంత కాలం కొనసాగే అవకాశముందని తెలిపారు. సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్‌లో ‘ఆస్క్‌ కేటీఆర్‌’పేరిట గురువారం నిర్వహించిన కార్యక్రమంలో.. కోవిడ్‌ నియంత్రణ తదితర అంశాలపై నెటిజన్ల ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానాలిచ్చారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ ప్రశ్నలు–జవాబుల కార్యక్రమం ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. వివిధ ప్రశ్నలకు కేటీఆర్‌ ఇచ్చిన సమాధానాలు ఆయన మాటల్లోనే..  


ఆ పిల్లలకు హెల్ప్‌డెస్క్‌ 
కోవిడ్‌ మూలంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌ని ఏర్పాటు చేసింది. కరోనా మొదటి దశ సంక్షోభంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆక్సిజన్‌ పడకల సంఖ్యను పెంచాం. గత ఏడాది సెప్టెంబర్‌ నాటికి రాష్ట్రంలో 9,213 ఆక్సిజన్‌ బెడ్లు ఉండగా, ప్రస్తుతం 20,739కు పెంచాం.

 
రెండో డోసు ఇచ్చేందుకే ప్రాధాన్యం 
వ్యాక్సినేషన్‌లో జాతీయ సగటుకన్నా తెలంగాణ ముందు వరుసలో ఉంది. రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడిన వారు 92 లక్షలు కాగా, ఇందులో 45 లక్షల మందికి మొదటి డోసు వ్యాక్సిన్‌ అందింది. మరో 10 లక్షల మందికి రెండో డోసు కూడా పూర్తయింది. మొదటి డోసు తీసుకున్న వారికి రెండో డోసు ఇచ్చేందుకే ప్రాధాన్యత ఇస్తున్నాం. రోజుకు 9 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చే సామర్ధ్యం రాష్ట్రానికి ఉంది. వ్యాక్సిన్‌ తయారీదారులైన భారత్‌ బయోటెక్, సీరం ఇన్‌స్టిట్యూట్, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌లతో మాట్లాడుతున్నాం.  కోవాగ్జిన్‌ ఫార్ములాను భారత్‌ బయోటెక్‌ ఇతర కంపెనీలతో పంచుకొని వ్యాక్సిన్‌ అందరికీ అందేలా చూడటంలో కేంద్రమే ఒక నిర్ణయం తీసుకోవాలి.  


కేంద్రం ఆధీనంలో ఆక్సిజన్‌ 
ఆక్సిజన్‌ సరఫరా పూర్తిగా కేంద్రం ఆధీనంలో ఉంది. ఈ విషయంలో యావత్‌ దేశం సవాలును ఎదుర్కొంటోంది. రెమిడెసివిర్‌ మందుల వినియోగాన్ని ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. బ్లాక్‌మార్కెట్లో విక్రయిస్తున్న వారిని అరెస్టు చేస్తున్నాం. కోవిడ్‌ చికిత్సకు వసూలు చేయాల్సిన బిల్లుల విషయంలో జాతీయ స్థాయిలో ఏకీకృత విధానంపై దృష్టి సారిస్తాం. కరోనా నియంత్రణకు ఇంటింటి సర్వేలో భాగంగా 28 వేల బృందాలు 60 లక్షల ఇళ్లను సందర్శించిన ఫలితాలు త్వరలో వస్తాయి. కరోనాను అధిగమించాలంటే 70 శాతం జనాభాకు వ్యాక్సిన్లు వేయాలి. 3.8 కోట్ల డోసుల వ్యాక్సిన్లు అవసరం. సంపూర్ణ లాక్‌డౌన్‌ డిమాండ్‌ ఉన్నా ప్రజల నిత్యావసరాల కోసం ఉదయం పూట వెసులుబాటు కల్పించాం. 

రాష్ట్రానికి ఆక్సిజన్‌ కోటా పెంచాలి..: ఏపీ, కర్ణాటక, చత్తీస్‌గఢ్‌ నుంచి వస్తున్న రోగులకు కూడా ఇక్కడ చికిత్స అందిస్తున్నందున రాష్ట్రానికి ఆక్సిజన్, ఇతర మందుల కోటా పెంచాలి. కోవిడ్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కొందరు బదనాం చేస్తున్నారు. ప్రస్తుత కోవిడ్‌ సంక్షోభంలో మన రాష్ట్రంలో ఉన్న ఫార్మా పరిశ్రమ ప్రాధాన్యతను జాతీయ స్థాయిలో తెలుసుకున్నారు. 

వైద్యుల సూచనలతో అధిగమించా..
నాకు కరోనా సోకినప్పుడు వరుసగా ఏడురోజుల పాటు తక్కువ నుంచి అతి ఎక్కువ డిగ్రీల జ్వరం కొనసాగింది. ఊపిరితిత్తుల్లో కొంత ఇన్ఫెక్షన్‌ కూడా వచ్చింది. మధుమేహ వ్యాధి ఉండటంతో బ్లడ్‌ షుగర్, రక్తపోటు నియంత్రణ కొంత సవాలుగా మారింది. అయితే డాక్టర్ల సలహాలు పాటించడం ద్వారా సమస్యలు అధిగమించా. ప్రస్తుతం కొంత బలహీనంగా అనిపిస్తున్నా.. సాధారణ స్థితికి చేరుకున్నా. కోవిడ్‌ సోకిన వారు ఎవరైనా సొంత వైద్యంతో కాకుండా వైద్యులు సూచించిన మందులు వాడుతూ, మానసిక ధైర్యంతో వైరస్‌ను జయించాలి.   

మరిన్ని వార్తలు