విద్యార్థినులకు కేటీఆర్‌ సాయం

7 Mar, 2022 04:52 IST|Sakshi
కావేరి, శ్రావణిలకు ఆదివారం చెక్కురూపంలో ఆర్థికసాయాన్ని అందజేస్తున్న మంత్రి కేటీఆర్‌ 

ఉన్నత విద్య చదివేందుకు అక్కాచెల్లెళ్లకు చేయూత 

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిభ ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో చదువుకునేందుకు ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు అండగా ఉండే ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కేటీ రామారావు మరోసారి తన ఔదార్యాన్ని చాటు కున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన అక్కా చెల్లెళ్లు కావేరి (21), శ్రావణి (18)ల ఉన్నత విద్య పూర్తయ్యేంత వరకు అండగా నిలుస్తానని హామీఇచ్చారు.

తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ పూర్వ విద్యార్థిని కావేరి సిద్దిపేట సురభి కాలేజీలో చదువుతోంది. ఆమె సోదరి శ్రావణి కూడా మోడల్‌ స్కూల్‌లో చదివి ఏపీలోని తాడేపల్లిగూడెం ఎన్‌ఐటీలో బీటెక్‌ (ఈసీఈ)లో సీటు సాధించింది. ఇద్దరూ మెరిట్‌ కోటాలోనే ఉన్నత విద్యా కోర్సుల్లో సీటు సాధిం చారు. బీఏ గ్రాడ్యుయేట్‌ అయిన వీరి తండ్రి రాజమల్లు గతంలో ప్రైవేటు పాఠశాలలో పనిచేయగా, కరోనా వల్ల ఉపాధి కోల్పోయి రోజూవారీ కూలీగా పనిచేస్తున్నారు.

ట్విట్టర్‌ ద్వారా వీరి పరిస్థితి కేటీఆర్‌కు చేరగా, ఆదివారం రాజమల్లు తన కూతుళ్లతో కలిసి కేటీఆర్‌ను కలిశారు. వారి అవసరాలను తెలు సుకున్న కేటీఆర్‌ ఉన్నత విద్యను పూర్తి చేసుకునేంత వరకు సాయంగా ఉంటానని భరోసా ఇచ్చారు. తమను ఆదుకునేందుకు కేటీఆర్‌ ముందుకు రావడం పట్ల విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు. 

మరిన్ని వార్తలు