నోటీసులు లేకుండానే కూల్చివేతలు

17 Nov, 2020 03:30 IST|Sakshi

చెరువులు, నాలాలు, బఫర్‌ జోన్లు కబ్జా చేసి నిర్మిస్తే ఇక అంతే..

వచ్చే జనవరి/ ఫిబ్రవరిలో కొత్త జీహెచ్‌ఎంసీ చట్టం

ఈ మేరకు చట్టంలో కఠిన నిబంధనలు పెడతాం

టీఎస్‌–బీపాస్‌ విధానాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ 

‘స్వీయ ధ్రువీకరణ’ విధానాన్ని దుర్వినియోగం చేయవద్దని విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌ : వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో కొత్త జీహెచ్‌ఎంసీ చట్టం తీసుకొస్తున్నామని రాష్ట్ర పురపాలక మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వరద వెళ్లేందుకు మార్గం లేక ఇటీవల కురిసిన వర్షాలతో నగరంలోని చాలా కాలనీలు జలమయమయ్యాయని అన్నారు. చెరువుల ఎఫ్‌టీఎల్, నాలాలు, బఫర్‌ జోన్లలోని నిర్మాణాలను ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేసే అధికారం అధికారులకు కట్టబెడుతూ కొత్తగా తీసుకురానున్న జీహెచ్‌ఎంసీ చట్టంలో కఠినమైన నిబంధనలు పొందుపరచనున్నట్లు వెల్లడించారు.

దీనికోసం అవసరమైతే న్యాయ నిపుణులు, న్యాయస్థానాలను సంప్రదిస్తామన్నారు. హైదరాబాద్‌ నగర ఉజ్వల భవిష్యత్‌ కోసం ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. భవన నిర్మాణ అనుమతుల జారీకి కొత్తగా తీసుకొచ్చిన తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ అప్రూవల్‌ సిస్టం(టీఎస్‌–బీపాస్‌)ను సోమవారం ఆయన మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ)లో ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్‌–బీపాస్‌ విధానం దేశంలోనే అత్యుత్తమమైందని, ఒక రూపాయి లంచం ఇవ్వకుండానే ఇళ్ల నిర్మాణ అనుమతులు పొందేలా దీనికి రూపకల్పన చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇతర పాలసీల తరహాలో టీఎస్‌–బీపాస్‌ విధానం కూడా దేశానికి ఆదర్శంగా మారబోతుందన్నారు. 

బాధ్యతాయుతంగా మెలగాలి..
75 చదరపు గజాల లోపు స్థలంలో నిర్మించే ఇళ్లకు అనుమతులు అవసరం లేదని, రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే సరిపోతుందన్నారు. 75 నుంచి 300 చదరపు గజాలలోపు స్థలంలో ఇళ్ల నిర్మాణం కోసం టీఎస్‌–బీపాస్‌ వెబ్‌సైట్‌లో స్వీయ ధ్రువీకరణ ద్వారా దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆటోమెటిక్‌గా అనుమతులు జారీ అవుతాయన్నారు. అయితే, తప్పుడు సమాచారం ఇచ్చి అనుమతులు పొందినా, నిర్మాణంలో సెట్‌ బ్యాక్‌ రూల్స్‌ను ఉల్లంఘించినా, ప్రభుత్వ, ప్రైవేట్‌ స్థలాలను కబ్జా చేసి ఇళ్ల నిర్మాణ అనుమతులు పొందినట్లు తేలినా తక్షణమే నోటీసులు లేకుండా కూల్చివేస్తారన్నారు.

ఈ విషయంలో పౌరులు బాధ్యతాయుతంగా మెలగాలని, ప్రజల మేలు కోరి తీసుకొచ్చిన ఈ విధానాన్ని దుర్వినియోగం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. 300 చదరపు గజాలకు పైబడిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి కేవలం 21 రోజుల్లోగా అన్ని రకాల అనుమతులను, ఎన్‌ఓసీలను జారీ చేస్తామన్నారు. దరఖాస్తుల్లో ఏవైనా లోపాలుంటే తొలి వారంలోనే దరఖాస్తుదారులకు తెలియజేసి వాటిని సరిదిద్దడానికి అవకాశం కల్పిస్తారన్నారు. ఒకవేళ గడువులోగా అనుమతులు రాకుంటే వచ్చినట్లు పరిగణించాలని చెప్పారు.

అనుమతులకు చట్టబద్ధత..
టీఎస్‌–బీపాస్‌ ద్వారా జారీ చేసే తక్షణ ఇళ్ల అనుమతులకు చట్టబద్ధత ఉంటుందని, బ్యాంకుల నుంచి గృహ రుణాలు పొందడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవన్నారు. టీఎస్‌–బీపాస్‌ విధానాన్ని రెరా ఆథారిటీతో అనుసంధానం చేస్తామని, అనుమతులు పొందిన ప్రాజెక్టుల సమాచారం అటోమెటిక్‌గా రెరా ఆథారిటీకి వెళ్లిపోయేలా చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలోనే అత్యున్నతమైన జీవన ప్రమాణాలు, అత్యధిక ఆఫీస్‌ స్పేస్‌ వినియోగం కలిగిన నగరంగా హైదరాబాద్‌కు పేరుందని, నగరంలో స్థిరాస్తి వ్యాపారం బాగా జరుగుతోందన్నారు.

ప్రజలకు అందుబాటులో ఉన్న ధరలకే ఇక్కడ ఇళ్లు లభిస్తాయని పేరుందని, డిమాండ్‌ ఉందని అడ్డగోలుగా ధరలు పెంచవద్దని స్థిరాస్తి వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. కొత్తగా అమలు చేస్తున్న టీఎస్‌–బీపాస్‌ విధానం అమలుపై కొంత కాలం పరిశీలన జరుపుతామని, ఆ తర్వాత అవసరమైన మార్పులు చేర్పులు తీసుకొస్తామని వెల్లడించారు. స్వీయ ధ్రువీకరణ ద్వారా ఇళ్లకు అనుమతి పొందిన పలువురు దరఖాస్తుదారులకు మంత్రి కేటీఆర్‌ ఈ కార్యక్రమంలో అనుమతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ చీఫ్‌ సిటీ ప్లానర్‌ దేవందర్‌ రెడ్డి, డీటీసీపీ విద్యాధర్‌ రావు, క్రెడాయ్‌ రామకృష్ణా తదితరులు పాల్గొన్నారు.       

మరిన్ని వార్తలు