ఇండ్లు కట్టిస్తుండు.. పెండ్లి చేపిస్తుండు

13 Feb, 2022 08:08 IST|Sakshi

హైదరాబాద్‌:  ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ రెండూ కష్టమైనవే. అలాంటిది ముఖ్యమంత్రి కేసీఆరే ఇండ్లు కట్టిస్తుండు.. పెండ్లి చేపిస్తుండు. ఇప్పటివరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల్లో భాగంగా 10 లక్షల ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ.8,421 కోట్లు ఖర్చు చేశాం. ఇగ పెళ్లి చేసుకోవడానికి, ఆ తర్వాత పిల్లల బారసాల చేసుకోవడానికి ఫంక్షన్‌ హాళ్ల నిర్మాణం కూడా ప్రభుత్వమే నిర్మిస్తోంది’ అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

శనివారం సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని బేగంపేట డివిజన్‌లో రూ.61 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్‌రావు, వాణీదేవిలతో కలిసి మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. తొలుత ఎస్పీ రోడ్డులోని ప్యాట్నీ నాలాపై రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వంతెన నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం పాటిగడ్డలో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణ పనులను, ఎస్‌ఎన్‌డీపీ కార్యక్రమంలో భాగంగా రూ.45 కోట్లతో చేపట్టనున్న బేగంపేట నాలా అభివృద్ధి పనులను అల్లంతోటబావి, బ్రాహ్మణవాడీలలో ప్రారంభించారు. పాటిగడ్డలో ప్రజలనుద్దేశించి కేటీఆర్‌ మాట్లాడారు.

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రభుత్వం నుంచి పని చేయించుకోవడం, ప్రజలకు ముందుండి లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా సనత్‌నగర్‌ నుంచే ప్రారంభిస్తున్నామన్నారు. పాటిగడ్డలో ఆర్‌అండ్‌బీకి చెందిన 1,200 గజాల స్థలంలో ఇక్కడివారికి మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌ నిర్మించాలని  తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. ఇక్కడి పేదలు బర్త్‌ డేలు, వివాహాలు.. ఇలా చిన్నా పెద్దా శుభకార్యాలు చేసుకోవాలంటే వేల రూపాయల కిరాయిలు చెల్లిస్తూ ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇక్కడ చక్కటి ఫంక్షన్‌ హాల్‌ నిర్మించాల్సిందిగా తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అడిగిన వెంటనే రూ.6 కోట్లు మంజూరు చేశామన్నారు.

ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణం పూర్తి చేసుకుని వచ్చే దసరా నాటికి ప్రారంభించుకుందామని తెలిపారు. నగరంలో ఎక్కడ చూసినా కేసీఆర్‌ నాయకత్వంలో రహదారులు, మంచినీటి వ్యవస్థలు బాగుపడుతున్నాయని ప్రశంసించారు. కార్యక్రమంలో తలసాని సాయికిరణ్‌ యాదవ్, కార్పొరేటర్లు టి.మహేశ్వరి శ్రీహరి, కొలను లక్ష్మీబాల్‌రెడ్డి, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్లు అరుణ, తరుణి, శేషుకుమారి, రూప, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు సురేష్‌కుమార్‌ యాదవ్, రాజయ్య, శేఖర్‌ ముదిరాజ్, శ్రీనివాస్‌గౌడ్, అఖిల్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు