అభివృద్ధి కోసం అన్నదమ్ముల్లా..

10 Jan, 2021 01:25 IST|Sakshi
డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పట్టాల పంపిణీలో మాట్లాడుతున్న కేటీఆర్‌. చిత్రంలో కిషన్‌రెడ్డి

ప్రతిపక్షాలకు మంత్రి కేటీఆర్‌ సూచన

పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి

‘డబుల్‌’ఇళ్లు అమ్ముకుంటే పట్టాలు రద్దు చేస్తామని హెచ్చరిక

సాక్షి, హైదరాబాద్‌/సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ‘గెలుపు కోసం ఎన్నికల ముందు కొట్లాడుదాం.. తర్వాత అభివృద్ధి కోసం అన్నదమ్ముల్లా కలిసి పనిచేద్దాం’అని మున్సిపల్, ఐటీ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ప్రతిపక్షాలను.. ముఖ్యంగా బీజేపీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. సమన్వయంతో పనిచేద్దామని పిలుపునిచ్చారు. కొత్తగా ఎన్నికైన స్థానిక బీజేపీ కార్పొరేటర్‌కు ఆహ్వానం అందలేదని, ప్రొటోకాల్‌ పాటించడం లేదని ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో బీజేపీ–టీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య  జరిగిన గొడవను దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం హైదరాబాద్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్‌.. బాగ్‌లింగంపల్లి లంబాడితండాలో 126 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలసి ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ.. దేశంలోని ఏ రాష్ట్రంలో జరగనంత గొప్పగా రూ.18వేల కోట్లతో 2.72 లక్షల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు శ్రీకారం చుట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో నిర్మిస్తున్న లక్ష ఇళ్లకు రూ.9,714 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. పేదవాడు ఆత్మగౌరవంతో బతికేందుకు సకల సౌకర్యాలతో ఫ్లాట్లు కట్టి అప్పజెప్పుతున్నామన్నారు. 

అమ్ముకున్నా, కిరాయికిచ్చినా చర్యలు..
మార్కెట్‌లో దాదాపు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల డిమాండ్‌ ఉన్న ఈ ఇళ్లను అమ్మినా, అద్దెకిచ్చినా పట్టా రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని హెచ్చరించారు. ఒక్కో ఇంటికి రూ.9 లక్షలు ఖర్చుచేసి ఇస్తున్నది మీ పిల్లలతో బాగా బతికేందుకేనని అన్నారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో చాలా మంది పేదలున్నారని, వారందరికీ ఇళ్లు ఇవ్వాలన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విజ్ఞప్తికి స్పందిస్తూ.. ఆ మేరకు చర్యలు చేపడతామన్నారు. కంటోన్మెంట్‌ డిఫెన్స్‌ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలిప్పించేందుకు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టేందుకు స్థలం ఇప్పించాలని కేంద్రమంత్రిని కోరారు.

కలసి పనిచేస్తేనే హర్షిస్తారు..
కేంద్రం, రాష్ట్రం కలసిమెలసి ఉంటేనే ఓట్లేసిన ప్రజలు హర్షిస్తారని కేటీఆర్‌ అన్నారు. పరస్పరం గౌరవించుకుందామని.. హుందాగా రాజకీయాల్లో కొనసాగుదామని చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న కార్పొరేటర్‌ శ్రీనివాసరెడ్డి (టీఆర్‌ఎస్‌) ఫిబ్రవరి 10 దాకా ఉంటారు. తర్వాత రవిచారి(బీజేపీ) ఐదేళ్లు ఉంటారని చెప్పారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ అనేక రంగాల్లో ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. 

ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు..
ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని బాగ్‌లింగంపల్లి లంబాడి తండాలో రూ.10.90 కోట్ల వ్యయంతో నిర్మించిన 126 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు.. రూ. 3.50 కోట్లతో అడిక్‌మెట్‌లో నిర్మించిన మల్టీపర్పస్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లకు ప్రారంభోత్సవాలు.. దోమల్‌గూడలో రూ.9.90 కోట్లతో నిర్మించనున్న జోనల్, డిప్యూటి కమిషనర్‌ కార్యాలయాలు.. నారాయణగూడ క్రాస్‌రోడ్స్‌లో రూ.4 కోట్లతో నిర్మించనున్న మోడల్‌ మార్కెట్‌ నిర్మాణానికి కేటీఆర్‌ శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియొద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు. 

నన్ను ఆహ్వానించరా?...
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌పై కిషన్‌రెడ్డి ఫైర్‌
హిమాయత్‌నగర్‌: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌పై మండిపడ్డారు. మంత్రి కేటీఆర్‌ సర్ధిచెబుతున్నా.. అభివృద్ధి కార్యక్రమాలకు నన్ను పిలవరా అంటూ అసహనం వ్యక్తం చేశారు. శనివారం నారాయణగూడ వెజిటేబుల్‌ మార్కెట్‌ శంకుస్థాపన కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 
కిషన్‌రెడ్డి: ‘ఏం కేటీఆర్‌గారూ.. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రొటోకాల్‌ పాటించరా? 
కేటీఆర్‌: ఏమైందన్నా?
కిషన్‌రెడ్డి: ఏ కార్యక్రమానికి నన్ను పిలవట్లేదు. ప్రోటోకాల్‌ పాటించాలి కదా. 
కేటీఆర్‌: కచ్చితంగా పిలవాలన్నా. ఇంటిమేషన్‌ ఇవ్వలేదా?
కిషన్‌రెడ్డి: ఎవరిచ్చారు? అడగండి..
కేటీఆర్‌: (దూరంగా నిలబడ్డ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ని పిలిచి) కిషన్‌రెడ్డి గారికి ఇంటిమేషన్‌ ఇవ్వలేదా?
లోకేశ్‌కుమార్‌: ఇచ్చాం సార్, ముందురోజే చెప్పాం.
కిషన్‌రెడ్డి: తమాషాలు చేస్తున్నారా? చెప్పకుండా చెప్పామంటున్నారు?
కేటీఆర్‌: అన్నా.. పోనీ.. ఇప్పుడొద్దు. నేను మాట్లాడతా. 
కిషన్‌రెడ్డి: అదికాదు.. చెప్పాలి కదా? నాకు అధికారం లేదా? 
కాగా, దీనిపై లోకేశ్‌కుమార్‌ డీఎంసీలను అడగ్గా.. ‘సార్, మేం కిషన్‌రెడ్డి గారికి ముందే చెప్పాం. నాకు కమిషనర్‌ చెబితేనే వస్తా, మీరు చెబితే నేనెందుకు వస్తానని ఆయన అన్నారు. ఏం చేయమంటారు’అని బదులిచ్చారు.

మరిన్ని వార్తలు