ప్రైవేటు భాగస్వామ్యంతో పాలియేటివ్‌కేర్‌

5 Sep, 2021 03:37 IST|Sakshi

స్పర్శ్‌ హోస్పిస్‌కు ప్రాపర్టీ ట్యాక్స్, నీటి పన్ను మినహాయింపునకు కేటీఆర్‌ హామీ

ఆత్మ సంతృప్తినిచ్చే కార్యక్రమంలో పాల్గొన్నానని వెల్లడి

రాయదుర్గం: పాలియేటివ్‌ కేర్‌లోకి ప్రవేశించడానికి తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీరామారావు పేర్కొన్నారు.ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ సేవలు అందజేయాలని సంకల్పించినట్లు ఆయన తెలిపారు. గచ్చిబౌలి డివిజన్‌లోని ఖాజాగూడలో రూ.14 కోట్లతో నూతనంగా నిర్మించిన ‘స్పర్శ్‌ హోస్పిస్‌’ఆస్పత్రి భవనాన్ని మంత్రి కేటీరామారావు శనివారం జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, 2016లో స్పర్శ్‌ హోస్పిస్‌ని మొదటిసారి సందర్శించినప్పుడు పాలియేటివ్‌కేర్‌ అంటే ఏమిటో తెలియదని, మానవత్వానికి ఇది గొప్ప సేవ అని ఆ తర్వాత తెలిసిం దని అన్నారు. ఇలాంటి ఆస్పత్రుల ఏర్పాటుకు చొరవ తీసుకుంటామని, ముందుకొచ్చే వారికి పూర్తిగా సహకరిస్తామన్నారు. స్పర్శ్‌ ఆస్పత్రికి మున్సిపల్‌ ఆస్తిపన్ను, నీటిపన్నుల మినహాయింపు ఇస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.

ఒక రాజకీయ నాయకునిగా అనేక కార్యక్రమాలకు వెళ్తామని, కానీ కొన్ని కార్యక్రమాలు ఆత్మ సంతృప్తి కలిగిస్తాయని ఈ సందర్భంగా వెల్లడించారు. పదేళ్ళుగా మానవతా దృక్పథంతో వైద్యం అందించిన స్పర్శ్‌ హోస్పిస్‌ ఆస్పత్రి కల నెరవేరి సొంత భవనానికి నోచుకోవడం సంతోషంగా ఉందన్నారు. 

పన్ను మినహాయింపు ఇవ్వాలి: వరప్రసాద్‌రెడ్డి 
మానవతా దృక్పథంతో ఉచితంగా సేవలందిస్తున్న స్పర్శ్‌ హోస్పిస్‌ ఆస్పత్రికి మున్సిపల్‌ ఆస్తిపన్ను, నీటి పన్ను, విద్యుత్‌ బిల్లుల నుంచి మినహాయింపులు ఇవ్వాలని శాంతాబయోటెక్‌ సంస్థ వ్యవస్థాపకులు పద్మభూషణ్‌ డాక్టర్‌ వరప్రసాద్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఆస్పత్రి సీఈఓ రామ్మోహన్‌రావు మాట్లాడుతూ, దేశంలోనే రెండు అతిపెద్ద పాలియేటివ్‌కేర్‌ సదుపాయాలలో ఇది ఒకటని, దేశంలో అత్యంత అధునాతన అల్ట్రా మోడ్రన్‌ పాలియేటివ్‌కేర్‌ ఇదేనని గుర్తు చేశారు.

తుదిదశ కేన్సర్‌ రోగులలో బాధను తగ్గించడమే తమ లక్ష్యమన్నారు. పదేళ్లుగా తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఇతర రాష్ట్రాలకు చెందిన నాలుగు వేల మంది రోగులకు ఉచితంగా సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు ఉండే గదుల్లోకి వెళ్ళి వారితో ముచ్చటించి వారికి భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, రోటరీ ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మహేశ్‌కోట్బాగీ, ఫీనిక్స్‌ చైర్మన్‌ చుక్కపల్లి సురేష్, అధ్యక్షుడు వికాస్, ట్రస్టీలు సుబ్రహ్మణ్యం సురేష్‌రెడ్డి, జగదీశ్, ఎస్‌సీఎస్‌సీ కార్యదర్శి కృష్ణ ఎదులతోపాటు పలువురు డాక్టర్లు, దాతలు, వైద్యబృందం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు