ఒక రూపాయి కూడా ఆశించకుండా పనిచేయాలి: కేటీఆర్

8 Apr, 2021 19:53 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ జలమండలిలో మేనేజర్లుగా ఉద్యోగం సాధించిన 93 మందికి మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కే. తారక రామారావు నియామక పత్రాలు  అందజేశారు. ఈసందర్భంగా కేటీఆర్‌ ఉద్యోగాలు పొందిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఉద్యోగాల కల్పనపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. టీఎస్‌పీఎస్‌సీ ఆధ్వర్యంలో ఇప్పటిదాకా, సుమారు లక్షా 33 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేశామని అన్నారు.

ప్రైవేటు రంగంలో అనేక పెట్టుబడులను ఆకర్షించి 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు సృష్టించామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగానికి ఒక ప్రత్యేకత ఉందని.. ప్రజలకు సేవ చేయడంలో తమదైన మార్కు చూపించాలని విజ్జప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ఒకరూపాయి ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎలా సాధించారో.. అలాగే ఒక రూపాయి తీసుకోకుండా నిజాయతీగా వ్యవహరించాలని కోరారు. అభ్యర్థులు  ఈ ఉద్యోగాన్ని ఒక సవాలుగా తీసుకొని జలమండలిని మరింత అభివృద్ది పథాన తీసుకెళ్లేలా కొత్త ఆలోచనలతో పనిచేయాలని సూచించారు. 

చదవండి: కొంగొత్త అంగడి.. నగరంలో ఇక ప్రతిరోజు మార్కెటే!

మరిన్ని వార్తలు