అలా చేస్తే కిషన్‌రెడ్డిని హైదరాబాద్‌ నడిబొడ్డున సత్కరిస్తాం: మంత్రి కేటీఆర్‌

17 Mar, 2022 09:01 IST|Sakshi

సాక్షి, ఎల్‌బీనగర్‌/నాగోలు: నగరంలో నలువైపులా ఒకే తీరు అభివృద్ధి చేస్తున్నామని, ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో రూ.672 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్‌ పాస్‌లు నిర్మించినట్లు, రూ.103 కోట్ల వ్యయంతో  నాలా అభివృద్ధి పనులు చేపట్టినట్లు పురపాలక మంత్రి కేటీఆర్‌ అన్నారు. నాగోలు బండ్లగూడ చెరువు వద్ద నాలా అభివృద్ధి పనులకు, ఎల్‌బీనగర్‌ చౌరస్తాలో అండర్‌పాస్‌ (కుడివైపు), బైరామల్‌గూడ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లైఓవర్‌ను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, మహమూద్‌ అలీ, ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, బి.దయానంద్, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మితో కలిసి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. గతంలో వర్షాలు, వరదలతో  ఎల్‌బీనగర్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఎస్‌ఎన్‌డీపీ ప్రాజెక్ట్‌ కింద రూ.103 కోట్ల వ్యయంతో వరద ముంపును శాశ్వతంగా నివారించేందుకు నాలా అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో రూ.2,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. రాజకీయాలకతీతంగా నగర అభ్యున్నతికి కృషి చేయాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టూరిజం శాఖ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్, డిప్యూటీ మేయర్‌ శ్రీలతా శోభన్‌ రెడ్డి, జోనల్‌ కమిషనర్‌ పంకజ, ఎస్‌ఆర్‌డీపీ సీఈ దేవానంద్, ఎస్‌సీ రవీందర్‌ రాజు, కార్పొరేటర్లు చింతల అరుణ, కొప్పుల నర్సింహారెడ్డి, దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.   
చదవండి: హైదరాబాద్‌: కీలక నిర్ణయం.. ఎక్కడపడితే అక్కడ.. ‘ఫొటోలు’ తీయరిక!


ఫ్లై ఓవర్‌ను ప్రారంభిస్తున్న మంత్రులు కేటీఆర్, సబిత, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మేయర్‌ విజయలక్ష్మి  

10 వేల కోట్లు తీసుకురావాలి: కేటీఆర్‌
స్థానికంగా గెలిచిన బీజేపీ కార్పొరేటర్లు కూడా హైదరాబాద్‌ అభివృద్ధిలో పోటీ పడాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. వరద ముంపు శాశ్వత నివారణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్లు ఖర్చు చేస్తోందని, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10 వేల కోట్లు తీసుకురావాలని కోరారు. వరదల వేళ కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయీ ఇవ్వలేదన్నారు. కిషన్‌రెడ్డి నిధులు తెస్తే హైదరాబాద్‌ నడిబొడ్డున ఆయనకు పౌర సన్మానం చేస్తామన్నారు.  

మరిన్ని వార్తలు