మోదీ మిత్రుల కోసమే పన్ను తగ్గింపు!

17 Dec, 2022 10:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సామాన్యుల కోసం కాకుండా కార్పొరేట్ల కోసమే పనిచేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. పన్నులు, సెస్సుల రూపంలో పెట్రో ఉత్పత్తుల ధరలను అడ్డగోలుగా పెంచేసిన కేంద్రం.. కార్పొ రేట్‌ చమురు కంపెనీలకు మాత్రం విండ్‌ఫాల్‌ టాక్సులు తగ్గించడం ఏమిటని నిలదీశారు.

ఈ మేరకు కేటీఆర్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పెట్రో ఉత్పత్తులపై సెస్సులు, పన్నులు తగ్గించకుండా.. జనం జేబులకు చిల్లుపెట్టడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని విమర్శించారు. కార్పొరేట్‌ చమురు కంపెనీలకు మిగులుతున్న సొమ్ములు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. వాస్తవానికి తెలంగాణ వంటి రాష్ట్రాలు 2014 నుంచి పెట్రో ఉత్పత్తులపై వ్యాట్‌ను ఏమాత్రం పెంచలేదని.. అయినా రాష్ట్రాలే వ్యాట్‌ తగ్గించడం లేదంటూ మోదీ ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా దేశ ప్రజలను తప్పుదోవ పట్టించిందని మండిపడ్డారు.

సెస్‌ల పేరుతో రూ.30లక్షల కోట్లు కొల్లగొట్టి, రాష్ట్రాల పన్నుల వాటాను ఎగవేసిన కేంద్రం.. పైగా రాష్ట్రాలపైనే నిందలు వేస్తోందని విమర్శించారు. కేంద్రం సెస్సుల రూపంలో దోచుకున్న రూ.30 లక్షల కోట్లను వినియోగంలోకి తెస్తే.. లీటర్‌ పెట్రోల్‌ రూ.70, డీజిల్‌ను రూ.60కే అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. 

కార్పొరేట్‌ కంపెనీల లాభం కోసమే.. 
రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధాన్ని బూచిగా చూపి బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలను దోచుకుందని కేటీఆర్‌ ఆరోపించారు. రష్యా నుంచి తక్కువ ధరకు ముడిచమురు కొంటున్నట్టు మోదీ ప్రభుత్వం గొప్పలు చెప్పిందని.. కానీ ఆ చమురును దేశీయ అవసరాలకు వాడకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసి కార్పొరేట్‌ కంపెనీలు భారీగా లాభం ఆర్జించాయని వివరించారు. ఇలా కంపెనీలకు అప్పనంగా వచ్చిన సొమ్ముపై మోదీ ప్రభుత్వం పన్నులు తగ్గించిందని.. దీని వెనుక మోదీ కార్పొరేట్‌ మిత్రులకు చెందిన రెండు కంపెనీలకు లబ్ధి చేకూర్చే ఉద్దే శం ఉందని ఆరోపించారు. చవక చమురు లాభం దేశ ప్రజలకు అందకుండా పోయిందన్నారు. 

బీజేపీవి క్షుద్ర రాజకీయాలు 
మోదీప్రభుత్వం దేశప్రగతి, ప్రయోజనాలను   పట్టించుకోకుండా క్షుద్ర రాజకీయాలతో కాలం గడుపుతోందని కేటీఆర్‌ విమర్శించారు. పెట్రో ధరల తగ్గింపు విషయంలో సంకుచిత రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టాలని.. ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పన్నులు, సెస్సులతో పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచిన కేంద్రం.. ఈ నెపాన్ని తెలంగాణ వంటి రాష్ట్రాలపైకి నెట్టడాన్ని ఆపాలని సూచించారు.  

(చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుడు నందుపై మరో చీటింగ్‌ కేసు )

మరిన్ని వార్తలు