ప్రగతిలో పరిగెత్తే రాష్ట్రాలను ప్రోత్సహించండి

24 Jan, 2021 02:26 IST|Sakshi
ఎఫ్‌టీసీసీఐ ఎక్సలెన్సీ అవార్డు పొందిన దివ్యాంగుడు చంద్రకాంత్‌ సాగర్‌తో సెల్ఫీ దిగుతున్న కేటీఆర్‌

అభివృద్ధిలో భాగస్వాములను చేయండి 

ప్రధాని మాటలు నమ్మాలంటే ఆచరణలోకి రావాలి 

ఆత్మ నిర్భర్‌ ప్యాకేజీతో 20 మందికి కూడా మేలు జరగలేదు 

ఎఫ్‌టీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ‘బుల్లెట్‌ ట్రైన్‌ అహ్మదాబాద్‌కే వెళ్తుంది. హై స్పీడ్‌ రైలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి దక్షిణాది నగరాలు ఉన్నా ముంబై వద్దే ఆగిపోతుంది. ప్రగతి పథంలో పరిగెత్తే రాష్ట్రాలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాల్సి ఉన్నా అది జరగడం లేదు. ప్రగతిశీల రాష్ట్రాలను ప్రోత్సహించాలని కేంద్ర పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లను కోరుతున్నాం. ప్రధాని మోదీ చెప్పే మాటలపై విశ్వాసం ఉండాలంటే అవి ఆచరణలోకి రావాలి’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. చదవండి: (త్వరలో ఐటీకి కొత్త పాలసీ)

తెలంగాణ వాణిజ్య, పరిశ్రమల మండళ్ల సమాఖ్య (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో శనివారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేటీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘రెండ్రోజుల క్రితం జరిగిన నీతి ఆయోగ్‌  భేటీలో రాష్ట్రంలోని పారిశ్రామిక రంగం కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలతో ముందుకు రావడాన్ని ప్రశంసించింది. పరస్పర విమర్శలతో కాలం గడపకుండా కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతాం. అభివృద్ధి, సరికొత్త సంస్కరణలతో తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ నాయకత్వంలో దేశానికే ఆదర్శంగా నిలుపుతాం’అని కేటీఆర్‌ ప్రకటించారు. పారిశ్రామిక రాయితీలు, ప్రోత్సాహకాల కోసం గతేడాది రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో రూ.1,500 కోట్లు కేటాయించినా, కోవిడ్‌–19 కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. 2021–22 బడ్జెట్‌లో నిధులు కేటాయించి రాయితీలు, ప్రోత్సాహకాలకు సంబంధించిన బకాయిలను చెల్లిస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

పరిశ్రమల వివరాలతో బ్లూ బుక్‌.. 
‘రాష్ట్రంలో పారిశ్రామిక సంస్థల వివరాలతో ‘బ్లూ బుక్‌’తయారు చేస్తున్నాం. తద్వారా భారీ పెట్టుబడులతో వచ్చే బహుళ జాతి కంపెనీలతో స్థానిక పరిశ్రమలు భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్ర పారిశ్రామిక విధానంతో గత ఆరేళ్లలో రూ.2.04 లక్షల కోట్ల పెట్టుబడులతో వచ్చిన 13,826 పరిశ్రమలకు అనుమతులు ఇవ్వగా, 14 లక్షల మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి దక్కుతోంది. స్థానికులకు 80 శాతానికి పైగా ఉద్యోగాలిచ్చే సంస్థలకు అదనపు ప్రోత్సాహకాలిస్తాం. పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందించేందుకు తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌) సిద్ధంగా ఉంది’అని కేటీఆర్‌ వెల్లడించారు.

కాళేశ్వరం లాంటి బహుళ ప్రయోజన ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కేవలం మూడున్నరేళ్ల రికార్డు సమయంలో పూర్తి చేసిందని పేర్కొన్నారు. ధాన్యం దిగుబడి పెరిగి ఈశాన్య భారతంతో పాటు తైవాన్, మధ్య ప్రాచ్య దేశాలకు సోనా బియ్యం ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎఫ్‌టీసీసీఐ ఆధ్వర్యంలో 18 కేటగిరీల్లో ఎంపిక చేసిన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు కేటీఆర్‌ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షులు రమాకాంత్‌ ఇనానీ, ఉపాధ్యక్షులు కె.భాస్కర్‌రెడ్డి, అనిల్‌ అగర్వాల్, అవార్డుల కమిటీ చైర్మన్‌ రవీంద్ర మోదీ పాల్గొన్నారు.  

ఆత్మ నిర్భర్‌తో ఒరిగిందేమీ లేదు.. 
‘కోవిడ్‌–19 కారణంగా దెబ్బతిన్న రంగాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్బర్‌ భారత్‌లో భాగంగా ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీతో 20 మందికి కూడా ప్రయోజనం కలగలేదు. వచ్చే ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టే బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మంచి ప్యాకేజీ ప్రకటించడం ద్వారా ఆర్థిక పునరుజ్జీవనానికి కేంద్రం బాటలు వేస్తుందని ఆశిస్తున్నాం. గత 12 త్రైమాసికాల్లో దెబ్బతిన్న దేశ ఆర్థిక పరిస్థితి తిరిగి పుంజుకోవాలని కోరుకుంటున్నాం’అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ‘హై స్పీడ్‌ ట్రైన్, ఇండస్ట్రియల్‌ కారిడార్లు, డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ క్లస్టర్లు వంటి అంశాలపై కేంద్రానికి లేఖలు రాస్తున్నాం. వచ్చే కేంద్ర బడ్జెట్‌లో హైదరాబాద్‌–నాగ్‌పూర్, హైదరాబాద్‌–వరంగల్, హైదరాబాద్‌– బెంగళూరు పారిశ్రామిక కారిడార్లకు నిధులు కేటాయించాలి. పెద్ద ఎత్తున పారిశ్రామికవృద్ధికి బాటలు వేసే ఫార్మాసిటీ, జీనోమ్‌ వ్యాలీ, టెక్స్‌టైల్‌ పార్కులు, ఐటీఐఆర్‌ వంటి వాటిని కేంద్రం ప్రోత్సహించకపోతే పరిగెత్తలేం’అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.   

మరిన్ని వార్తలు