కొత్త ఐటీ కొలువులు.. 46,489

11 Jun, 2021 00:38 IST|Sakshi

6,28,615కు పెరిగిన ఉద్యోగులు 

12.89% వృద్ధితో రూ.1,45,522 కోట్ల ఐటీ ఎగుమతులు 

డేటా సెంటర్లకు నిలయంగా హైదరాబాద్‌ 

ఐటీ శాఖ వార్షిక నివేదికలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌–19 మహమ్మారి తీవ్రత నెలకొని ఉన్నా రాష్ట్ర ఐటీ రంగం 2020–21లో 46,489 కొత్త కొలువులను సృష్టించింది. దీంతో రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 6,28,615?కు పెరిగింది. 2019–20తో పోల్చితే 2020–21లో ఉద్యోగాల్లో 7.99% వృద్ధి నమోదైంది. మంత్రి కేటీఆర్‌ గురువారం ఇక్కడ విడుదల చేసిన రాష్ట్ర ఐటీ శాఖ వార్షిక నివేదిక 2020–21 ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. 12.98 శాతం వృద్ధితో రాష్ట్రం ఈ ఏడాది రూ.1,45,522 కోట్లు విలువ చేసే ఐటీ/ఐటీ రంగ సేవలను ఎగుమతి చేసింది.  
డేటా సెంటర్లకు హైదరాబాద్‌ నిలయంగా మారింది. రూ.20,761 కోట్ల పెట్టుబడులతో అమెజాన్‌ డేటా సర్వీసెస్‌ సంస్థ ఫ్యాబ్‌ సిటీ, ఫార్మాసిటీ, చందన్‌వెల్లిలో మూడు డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తోంది.  
రూ.500 కోట్లతో హైదరాబాద్‌లో స్మార్ట్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తామని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషర్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) ప్రకటించింది. 
హైదరాబాద్‌లో సేల్స్‌ ఫోర్స్‌ కంపెనీ తమ కార్యకలాపాలను ‘వీ–సెజ్‌’ద్వారా మూడు రేట్లు విస్తరింపజేయనుంది. రూ. 119 కోట్లతో 2,500 మందికి ఉద్యోగాలు అందించనుంది.  
భారత్‌లో గ్లోబల్‌ షేర్డ్‌ సరీ్వసెస్‌ నెలకొల్పడానికి గోల్డ్‌మ్యాన్‌ సాచ్స్‌ హైదరాబాద్‌ను ఎంపిక చేసుకుంది.  
ఒప్పో హైదరాబాద్‌లోని తమ ఆర్‌అండ్‌డీ కేంద్రంలో తొలి 5జీ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది.  
యూఎస్‌కు చెందిన బీఎఫ్‌ఎస్‌ఐ మేజర్‌ మాస్‌మ్యూచువల్‌ సంస్థ రూ.1,000 కోట్లతో హైదరాబాద్‌లో తమ గ్లోబల్‌ కెపాసిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 300 మందికి ఉగ్యోగాలు లభిస్తాయి.    

ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ... 
ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ కంపెనీ స్థాపనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మంచి స్పందన లభించింది. వరంగల్‌లో 1,400 సీటింగ్‌ కెపాసిటీతో ఐటీ టవర్‌/ఇన్‌క్యూబేషన్‌ సెంటర్‌ కార్యకలాపాలను ప్రారంభించింది.  
కరీంనగర్‌లో 80 వేల చదరపు అడుగుల స్థలంతో ఐటీ టవర్‌ను ప్రారంభించారు. ఇది 18 కంపెనీలు, 556 సీటింగ్‌ సామర్థ్యం కలిగి ఉంది.  
ఖమ్మంలో ఐటీ టవర్‌ ప్రారంభించగా, ఇక్కడ 19 ఐటీ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.  
నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో ఐటీ టవర్ల నిర్మాణానికి శంకుస్థాపనలు జరిగాయి. నల్లగొండ, రామగుండం, వనపర్తిలో ఐటీ టవర్ల నిర్మాణం జరగనుంది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు