పెట్టుబడిదారుల కోసం ‘పింక్‌ బుక్‌’

28 Jul, 2021 01:48 IST|Sakshi

ఏటా వివిధ శాఖల సమగ్ర సమాచారంతో రూపకల్పన

సాక్షి, హైదరాబాద్‌: సులభతర వాణిజ్యంలో అగ్రస్థానంలో నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని రాష్ట్ర ఐటీ, పరి శ్రమల మంత్రి కేటీ రామారావు అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులతో వచ్చే వారికి మార్గద ర్శకంగా ఉండేలా తెలంగాణ పరిశ్రమల శాఖ రూపొందించిన ‘పింక్‌ బుక్‌’ను మంగళవారం ప్రగతిభవన్‌లో ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రంలోని వసతులు, మౌలిక సౌకర్యాలపై సంపూర్ణ అవగాహన కలిగేందుకు పింక్‌బుక్‌ దోహదం చేస్తుందని, వివిధ ప్రభుత్వ శాఖల కార్యకలాపాలు, శాఖల కాంటాక్టు వివరాలతో రూపొందించిన పింక్‌బుక్‌ ద్వారా పెట్టుబడి దారులు తమ భవిష్యత్‌ పెట్టుబడులపై నిర్ణ యం తీసుకునేందుకు ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు. నిరంతర విద్యుత్, మానవ వనరులు తదితర వివరాలను ఈ బుక్‌లో పొందుపరిచినట్లు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్స్‌ వింగ్‌ డైరెక్టర్‌ సుజయ్‌ కారంపూరి పాల్గొన్నారు.

నెలాఖరులోగా సభ్యత్వ నమోదు 
పలువురు ఎమ్మెల్యేలకు కేటీఆర్‌ ఫోన్‌ 
టీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం లక్ష్యాన్ని చేరు కుంటున్న నేపథ్యంలో కార్యకర్తల వివరాల డిజిటలైజేషన్‌లో వేగం పెంచాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ఆదేశించారు. సభ్యత్వ నమోదు, జిల్లా కేంద్రా ల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం తదితర అం శాలపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈనెల 31తో కార్యకర్తల జీవిత బీమా ప్రీమి యం గడువు ముగుస్తున్నందున సభ్యత్వ నమోదు వివరాలను డిజిటలైజ్‌ చేయాలని ఆదేశించారు. ఆగస్టు 1న బీమా సంస్థకు ప్రీమి యం చెల్లింపు చెక్కుతో పాటు కార్యకర్తల వివరాలను అందజేయాల్సి ఉంటుందన్నారు. సభ్యత్వ నమోదు తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన కేటీఆర్, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో జరగకపోవడానికి కారణాలను ఆరా తీశారు. సభ్యత్వ నమోదు సమయంలో కరోనా లాక్‌డౌన్‌తో లక్ష్యం చేరుకోలేదని ఇన్‌చార్జిలు వివరించారు. లక్ష్యాన్ని చేరని పార్టీ శాసన సభ్యులతో కేటీఆర్‌ ఫోన్‌లో మాట్లాడి త్వరగా వివరాలు ఇవ్వాలని సూచించారు. జిల్లా కేంద్రాల్లో కార్యాలయాల నిర్మాణం పనులను వేగవంతం చేయాలన్నారు. జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు ద్వారా వసూలైన మొత్తాన్ని పార్టీ కార్యాలయంలో జమయ్యేలా చూడాలని పార్టీ ప్రధాన కార్యదర్శులను కేటీఆర్‌ ఆదేశించారు. 

మరిన్ని వార్తలు