‘టీ–శాట్‌ విద్యా, నిపుణ’ యాప్‌ సరికొత్త రికార్డు 

30 Oct, 2020 08:57 IST|Sakshi

పది లక్షల డౌన్‌లోడ్లు దాటడంపై మంత్రి కేటీఆర్‌ అభినందన 

సాక్షి, హైదరాబాద్‌: కళాశాల, పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో విద్యా సంబంధిత విషయాలను అందిస్తున్న టీ–శాట్‌ నెట్‌వర్క్‌ విద్యా, నిపుణ చానెళ్లు సరికొత్త రికార్డు సృష్టించాయి. ఆ యాప్‌కు ఏకంగా 10 లక్షల డౌన్‌లోడ్లు నమోదయ్యాయి. వివిధ పోటీ పరీక్షలకు శిక్షణతో పాటు టీచర్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్స్‌ ప్రసారం చేస్తున్న ఈ చానెళ్లు కరోనా మహమ్మారి నేపథ్యంలో పాఠశాల, ఇంటర్‌ విద్యార్థులకు డిజిటల్‌ తరగతులను కూడా మొదలుపెట్టాయి. 10 లక్షల డౌన్‌లోడ్ల మైలురాయిని సాధించిన సందర్భంగా టీ–శాట్‌ సీఈఓ ఆర్‌.శైలేశ్‌రెడ్డి నేతృత్వంలోని బృందం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసింది. వీరు చేసిన కృషిని మున్సిపల్, ఐటీ శాఖ కేటీఆర్‌ ప్రశంసించారు.

కోవిడ్‌ పరిస్థితుల్లో డిజిటల్‌ క్లాసుల ద్వారా ప్రత్యామ్నాయ పద్ధతుల్లో నేర్చుకునే విధానాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడాన్ని మంత్రి కేటీఆర్‌ అభినందించారు. టీ–శాట్‌ ప్లాట్‌ఫామ్‌ కేవలం విద్యా బోధనకే పరిమితం కాకుండా అన్ని ప్రభుత్వ శాఖలు దాని సేవలు ఉపయోగించుకునేలా రూపొందాలని ఆకాంక్షించారు. టీ–శాట్‌ సేవలు, విస్తృతిని పెంచేందుకు సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా అధికారులకు సూచించా రు. తమ చానెళ్లు ఇప్పటికే ఎయిర్‌టెల్, టాటా స్కైతో 43 కేబుల్‌ నెట్‌వర్క్‌లతో పాటు సన్‌ డైరెక్ట్‌ డీటీహెచ్‌లోనూ వీక్షించవచ్చునని సీఈఓ శైలేశ్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఐటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్, డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌ దిలీప్‌ కొణతం ఉన్నారు.

మరిన్ని వార్తలు