KTR On Women Reservation Bill: నా సీటు కోల్పోవాల్సి వచ్చినా సిద్ధమే..!

21 Sep, 2023 01:54 IST|Sakshi

జీవితం చాలాచిన్నది.. నా పాత్ర పోషించాననే అనుకుంటున్నా 

పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు..మనస్ఫూర్తిగా స్వాగతం: కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘భారత పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ జరుగుతోంది. ఈ బిల్లును మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఈ బిల్లు అమలులోకి వస్తే మరింతమంది మహిళానేతలు ప్రజాజీవితంలోకి వస్తారు. నేను నా సీటు కోల్పోవాల్సి వచ్చినా దానికి సిద్ధంగా ఉన్నా. మనందరివి చాలా చిన్నజీవితాలు, అందులో నా పాత్ర నేను పోషించాననే అనుకుంటున్నాను’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ.రామారావు అన్నారు. ‘క్యాపిటా లాండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌’(సీఎల్‌ఐ) కొత్తగా పునర్నిర్మించిన ‘ఇంటర్నేషనల్‌ టెక్‌ పార్క్‌ హైదరాబాద్‌’(ఐటీపీహెచ్‌)ను కేటీఆర్‌ బుధవారం ప్రారంభించారు.

హైదరాబాద్‌ నిర్మాణరంగం సింగపూర్‌ అభివృద్ధిని తలపిస్తోందని, ఆసియాఖండంలో అభివృద్ధి చెందిన సింగపూర్, జపాన్‌ వంటి దేశాల నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు. తెలివైనవారు ఇతర అనుభవాల నుంచి నేర్చుకుంటారు అనే సామెతను గుర్తు చేస్తూ సింగపూర్‌ నుంచి అనేక అంశాలను హైదరాబాద్‌ అభివృద్ధిలో తాము అనుకరిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌ నిర్మాణరంగంలో భవిష్యత్‌లో మరిన్ని పెట్టుబడులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

క్యాపిటా లాండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ తమ పెట్టుబడుల కోసం దేశంలోని ఇతర ప్రాంతాల వైపు చూడకుండా మాన్యుఫాక్చరింగ్, లైఫ్‌ సైన్సెస్‌ రంగంలోనూ పెట్టుబడులు పెట్టాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎల్‌ఐ ఇండియా సీఈఓ సంజీవ్‌దాస్‌ గుప్తా, సీఎల్‌ఐ ఇండియా పార్క్స్‌ సీఈఓ గౌరీశంకర్‌ నాగభూషణం, సింగపూర్‌ డిప్యూటీ స్పీకర్‌ జెస్సికా, సీఎల్‌ఐ చైర్మన్‌ మనోహర్‌ ఖైతాని, ఐటీ విభాగం చీఫ్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ అమర్‌నాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

40 మెగావాట్ల డేటా సెంటర్‌ 
క్యాపిటా లాండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (సీఎల్‌ఐ) ఇటీవల మాదాపూర్‌లో పునర్‌ నిర్మించిన ఐటీపీహెచ్‌ బుధవారం ప్రారంభమైంది. ఈ బిజినెస్‌ పార్కులోని బ్లాక్‌ ఏ భవనంలో అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకోవడంతో వందశాతం లీజ్‌ కమిట్‌మెంట్‌ జరిగినట్టు సీఎల్‌ఐ వెల్లడించింది. బ్లాక్‌ ఏ భవన్‌లో 1.4 మిలియన్ల చదరపు అడుగుల్లో అంతర్జాతీయ సంస్థలు బ్రిస్టల్‌ మైయర్స్‌ స్క్విబ్, ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, యూ ఎస్‌ టెక్నాలజీ, వార్నర్‌ బ్రదర్స్, డిస్కవరీ వంటి సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నా యి.

ఐటీపీహెచ్‌ దశలవారీగా వచ్చే 7 నుంచి పదే ళ్లలో క్యాపిటా లాండ్‌ ఇండియా ట్రస్ట్‌ (క్లింట్‌) పూర్తి చేస్తుంది. ఈ పార్కు పూర్తయితే 4.9 మిలియన్‌ అడుగుల ఏ గ్రేడ్‌ ఆఫీసు స్పేస్‌ అందుబాటులోకి వస్తుంది. ఐటీపీహెచ్‌ ఆవరణలో 40 మెగావాట్ల సామర్థ్యమున్న డేటా సెంటర్‌ ఏర్పాటు కోసం భూమిపూజ జరిగింది. క్లింట్‌కు దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో 12 బిజినెస్‌ పార్కులు ఉండగా, అందులో మూడు హైదరాబాద్‌లోనే ఉన్నాయి.  

వార్నర్‌ బ్రదర్స్‌ హైదరాబాద్‌ క్యాపబిలిటీ సెంటర్‌ ప్రారంభం
ప్రపంచవ్యాప్తంగా మీడియా, వినోద రంగంలో పేరొందిన వార్నర్‌ బ్రదర్స్, డిస్కవరీ కార్యాలయాన్ని ఐటీపీహెచ్‌లో మంత్రి కేటీఆర్‌ బుధవారం ప్రారంభించారు. వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ రాకతో మరిన్ని వైవిధ్యమైన కంపెనీలు హైదరాబాద్‌కు వస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌లో 2021–22లో 33శాతం, 2022–23లో 44శాతం ఐటీ ఉద్యోగాల కల్పన హైదరాబాద్‌లోనే జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో వార్నర్‌ బ్రదర్స్, డిస్కవరీ సీఈఓ గున్నార్‌ వీడెన్‌ఫెల్స్, హైదరాబాద్‌ క్యాపబిలిటీ సెంటర్‌ బాధ్యులు జైదీప్‌ అగర్వాల్, హైదరాబాద్‌లో యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక విభాగ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు