బాధ్యత నాది... సమ్మె విరమించండి: కేటీఆర్‌

21 Sep, 2022 04:57 IST|Sakshi

వీఆర్‌ఏ సంఘాల నేతలతో భేటీలో కేటీఆర్‌ విజ్ఞప్తి

నేడు జేఏసీ భేటీ... సమ్మె విరమణ లేదంటే వాయిదాపై నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: ‘మీ డిమాండ్లు న్యాయమైనవే. ప్రభుత్వం కూడా మీ పట్ల సానుకూలంగా ఉంది. ప్రభుత్వానికి కొంత సమయం కావాల్సి ఉంటుంది. సీఎంతో మాట్లాడి మంత్రివర్గ ఆమోదం తీసుకుంటాం. ప్రస్తుతానికి సమ్మె విరమించండి. మీ సమస్యలను నేనే స్వయంగా చూసుకుంటా. బాధ్యత నాది. సమ్మె విరమించండి’అని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) జేఏసీ నేతలకు హామీ ఇచ్చారు.

58 రోజులుగా సమ్మెలో ఉన్న వీఆర్‌ఏ జేఏసీ నేతలతో మంగళవారం మెట్రోభవన్‌లో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీకి సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ కూడా హాజరయ్యారు. వీఆర్‌ఏ జేఏసీ కోకన్వీనర్‌ వంగూరి రాములుసహా 12 మంది జేఏసీ నేతలతో మంత్రి, సీఎస్‌లు అరగంటకుపైగా మాట్లాడారు. సమ్మె విరమించాలని, వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరిస్తామని, ఎవరికీ అన్యాయం జరగదని, గడువు చెప్పలేం కానీ, అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

అయితే, ఉన్నఫళంగా సమ్మె విరమణ సాధ్యం కాదనే అభిప్రాయాన్ని వీఆర్‌ఏలు వ్యక్తం చేశారు. ఈ సమ్మె కాలంలో పలువురు వీఆర్‌ఏలు ప్రాణాలు కోల్పోయారని మంత్రి, సీఎస్‌లకు గుర్తుచేశారు. ఏ నిర్ణయమైనా జేఏసీలో మాట్లాడి తీసుకుంటామని చెప్పారు. దీంతో ప్రభుత్వం, వీఆర్‌ఏ జేఏసీల చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. కాగా, మంత్రి కేటీఆర్‌ ప్రతిపాదనపై చర్చించేందుకు వీఆర్‌ఏ జేఏసీ నేడు(బుధవారం) సమావేశం కానుంది. సమావేశంలోనే సమ్మెను విరమించాలా లేక కొంతకాలంపాటు వాయిదా వేసి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో కలిసి ముందుకెలా వెళ్లానేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు.   

మరిన్ని వార్తలు