Hyderabad: ఫ్లై ఓవ‌ర్ల కింద క్రీడా వేదిక‌లు.. ఆలోచన బాగుంది: కేటీఆర్

28 Mar, 2023 16:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాధారణంగా ఫ్లై ఓవర్ల కింద ఖాళీ స్థలంలో మొక్కలు పెంచడం, వాహనాల పార్కింగ్‌ వంటి సదుపాయాలు కల్పిస్తుంటారు. అయితే నవీ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు వినూత్నంగా ఆలోచించి.. ఫ్లైఓవర్‌ కింద బాస్కెట్‌ బాల్, బ్యాడ్మింటన్‌ కోర్టు ఏర్పాటు చేశారు.  దీనికి సంబంధించిన వీడియోను ధనుంజయ్‌ అనే యువకుడు ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు.

‘ఇది అద్భుత‌మైన ఆలోచ‌న‌.. న‌వీ ముంబైలో ఫ్లై ఓవ‌ర్ల కింద ఆట స్థ‌లాల‌ను నిర్మించిన‌ట్లు అన్ని ప‌ట్ట‌ణాల్లోని ఫ్లై ఓవ‌ర్ల కింద ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మీ ప‌ట్ట‌ణాల్లో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అని అతడు ట్వీట్‌ చేశాడు

ఈ ట్వీట్‌పై తెలంగాణ ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇది మంచి ఆలోచ‌న అని మంత్రి సైతం ఈ వీడియోను షేర్‌ చేశారు. ఈ విధానాన్ని ప‌రిశీలించాలని పుర‌పాల‌క శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్‌కు సూచించారు. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి త‌రహా క్రీడా వేదిక‌ల‌ను అందుబాటులోకి తీసుకురావొచ్చ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు