బాలిక దీనస్థితిపై కేటీఆర్‌ స్పందన

21 Oct, 2020 12:28 IST|Sakshi

సాక్షి, మునుగోడు: తల్లిదండ్రులతో పాటు సోదరుడిని కోల్పోయి అనాథగా మిగిలిన పన్నెండేళ్ల బాలిక వందనను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ను ఆదేశించారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చొల్లేడు గ్రామానికి చెందిన బొడ్డు అంజయ్య రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకోగా.. అతడి కుమారుడు ఏడాది క్రితం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో దుర్మరణ పాలయ్యాడు. భర్త, కుమారుడిని కోల్పోయిన పద్మ అనారోగ్యం బారినపడి ఇటీవల కన్నుమూసింది. దీంతో ఆమె కుమార్తె వందన ఒంటరిదైంది. ఆ బాలిక దీనగాథను ‘‘నాకు దిక్కెవరు దేవుడా’’ అనే శీర్షికన గత సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో వార్త ప్రచురితమైంది. చదవండి: (నాకు దిక్కెవరు దేవుడా?)

ఆ వార్త క్లిప్పింగ్‌ను సంస్థాన్‌ నారాయణపురానికి చెందిన గంధమల్ల సతీష్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. దాన్ని చూసిన మంత్రి కేటీఆర్‌ ఆ బాలికకు ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. దీంతో కలెక్టర్‌ మంగళవారం జిల్లా సంక్షేమ అధికారిణి సుభద్రని అనాథ బాలికను పరామర్శించి స్థితిగతులు తెలుసుకోవాలని ఆదేశించారు. అందుకు ఆమె వెంటనే గ్రామానికి చేరుకుని వందనని పరామర్శించి తల్లి దశదిన కరమ్మ అనంతరం చిల్డ్రన్స్‌ వెల్ఫేర్‌ సెంటర్‌కు తరలిస్తామని తెలిపారు. ఇతర వసతుల ఏర్పాట్లపై కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తానని, అప్పటి వరకు బంధువులు, గ్రామస్తులు బాలికకు అండగా ఉండాలని కోరారు. తక్షణ సాయంగా  రూ.30వేల నగదును ఆ బాలికకు అందించారు. ఆమె వెంట సీడీపీఓ కవిత, ఏసీడీపీఓ వెంకటమ్మ, సూపర్‌వైజర్‌ జ్యోతి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు