ట్విట్టర్‌లో స్పందించి.. సాయం అందించి! 

25 May, 2021 05:18 IST|Sakshi

గర్భిణికి వైద్యం అందించాలని కేటీఆర్‌ సూచన

మహబూబ్‌నగర్‌ రూరల్‌: సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఓ వినతికి రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ స్పందించి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ నిండుగర్భిణికి అభయహస్తం అందించారు. వివరాల్లోకి వెళితే... మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మసానిపల్లికి చెందిన ప్రియాంక నిండుగర్భిణి. రెండు నెలల క్రితం భర్త ఓ కేసులో జైలు పాలయ్యాడు. ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. ప్రసూతి కోసం ఆర్థికసాయం చేయాలని పక్కింటిలో ఉండే రాజేశ్వరి ఈ నెల 22న స్టార్‌ బాయ్స్‌ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు రహెమాన్, రసూల్‌ఖాన్‌కు సమాచారమిచ్చారు. ప్రియాంకకు సాయం చేయాల్సిందిగా వీరు స్థానిక యూట్యూబ్‌ చానల్‌లో ఓ వీడియో పోస్టు చేశారు.

మహబూబ్‌నగర్‌కు చెందిన ఎస్‌.మనోహర్‌గౌడ్‌ అనే వ్యక్తి గమనించి దీనిపై సోమవారం ఉదయం 7.30 గంటలకు మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. వెంటనే కేటీఆర్‌ స్పందించి జిల్లామంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు విషయం చెప్పి బాధితురాలికి అవసరమైన సహాయం చేయాలని సూచించారు. కాగా, ఆమెను అప్పటికే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రికి తరలించగా 8.30 గంటలకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మరోవైపు మధ్యాహ్నం 2.30 గంటలకు ఐసీడీఎస్‌ ఇన్‌చార్జి, డీడబ్ల్యూఓ రాజేశ్వరి తిమ్మసానిపల్లికి వెళ్లి ఆరా తీశారు. అనంతరం ఆస్పత్రికి చేరుకుని బాలింతకు అవసరమైన దుస్తులు, పండ్లు సమకూర్చారు. మంగళవారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే తల్లీబిడ్డలను స్టేట్‌హోంకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
 

మరిన్ని వార్తలు