డెత్‌ సర్టిఫికెట్‌ కోసం ‘యుద్ధం’: స్పందించిన మంత్రి కేటీఆర్‌

18 May, 2021 01:58 IST|Sakshi

తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం కోసం ఓ కల్నల్‌ విశ్వప్రయత్నం 

ట్విట్టర్‌లో స్పందించి సర్టిఫికెట్‌ ఇప్పించిన మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: సైన్యంలో పనిచేసి పదవీ విరమణ పొందిన తన తండ్రి డెత్‌ సర్టిఫికెట్‌ కోసం, సైన్యంలోనే కల్నల్‌ హోదాలో పనిచేస్తున్న ఆయన కుమారుడు జీహెచ్‌ఎంసీతో పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. చివరకు మంత్రి కేటీఆర్‌ స్పందించడంతో సమస్య పరిష్కారమైంది. సైన్యంలో పనిచేసి పదవీ విరమణ అనంతరం సికింద్రాబాద్‌లోని సైనిక్‌పురిలో నివసిస్తున్న సత్యబ్రత దాస్‌గుప్తా (84)ఈ నెల 9వ తేదీన మృతి చెందారు. ఆయన కుమారుడు కల్నల్‌ జాయ్‌ దాస్‌గుప్తా కూడా ఒక బెటాలియన్‌కు కమాండింగ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న జాయ్, తండ్రి మరణవార్త తెలుసుకుని నగరానికి వచ్చారు.

ఎన్నో ఇబ్బందుల మధ్య నేరేడ్‌మెట్‌ శ్మశానవాటికలో తండ్రి అంత్యక్రియలు పూర్తిచేశారు. తిరిగి విధుల్లో చేరాల్సి ఉండటంతో, తండ్రి డెత్‌ సర్టి ఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 10వ తేదీన శ్మశానవాటికకు వెళ్లారు. అయితే శ్మశాన వాటిక నిర్వాహకులు అంత్యక్రియలకు సంబంధించిన రశీదు ఇవ్వలేదు. ఇటీవలి కాలంలో మరణాలు పెరిగి, రశీదు పుస్తకాలు అయిపోయాయని, జీహెచ్‌ఎంసీ నుంచి కొత్త పుస్తకాలు రాలేదని వారు తెలిపారు. విషయాన్ని ఫిర్యాదు చేసేందుకు కల్నల్‌ జాయ్‌ జీహెచ్‌ఎంసీ యాప్‌లో ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేసినా సమస్య పరిష్కారం కాలేదు. జీహెచ్‌ఎంసీ మల్కాజిగిరి సర్కిల్‌ కార్యాలయానికి వెళ్లాల్సిందిగా వారు సలహా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో పనిచేస్తున్న ఒకరు, దాస్‌గుప్తా పరిస్థితిని వివరిస్తూ మంత్రి కేటీఆర్‌కు ఈ నెల 13వ తేదీన ట్వీట్‌ చేశారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి, అధికారులతో మాట్లాడి సోమవారం డెత్‌ సర్టిఫికెట్‌ జారీ చేయించారు. ఇకముందు ఇలాంటి పరిస్థితి రాకుండా పరిస్థితిని చక్కదిద్దాల్సిందిగా ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌కు కేటీఆర్‌ సూచించారు.    

మరిన్ని వార్తలు