సర్కార్‌ సై అంటేనే.. గ్రేటర్‌ ఎన్నికలు

14 Oct, 2020 08:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి, ప్రభుత్వ సమ్మతి తీసుకున్నాకే రాష్ట్ర ఎన్నికల సంఘం... ఇకపై  ఎన్నికలు నిర్వహించాలి. ప్రస్తుతం కోవిడ్‌–19 సంక్షోభం నెలకొని ఉంది. కుంభవృష్టి కురుస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు వస్తుంటాయి. ఇలాంటి సంక్షోభాల్లో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కీలకంగా ఉంటుంది. శాంతిభద్రతలు, సిబ్బంది లభ్యత చూసుకోవాల్సి ఉంటుంది.

కాబట్టి... కొత్త పంచాయతీరాజ్, మున్సిపల్‌ చట్టాల తరహాలోనే జీహెచ్‌ఎంసీ చట్టంలో సైతం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి, ప్రభుత్వ సమ్మతితో ఎన్నికలు నిర్వహించాలనే నిబంధనను పొందుపరుస్తున్నాం’ అని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. మంగళవారం నిర్వహించిన ప్రత్యేక శాసనసభ సమావేశంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) చట్టానికి 5 కీలకమైన సవరణలతో కూడిన బిల్లును మంత్రి కేటీఆర్‌ ప్రవేశపెట్టగా, స్వల్ప చర్చ అనంతరం సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బిల్లుకు సంబంధించిన ఉద్దేశాలకు కేటీఆర్‌ సభకు వివరించి సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 

మరోసారి అవే రిజర్వేషన్లు... 
డివిజన్ల రిజర్వేషన్లు రెండు పర్యాయాలు కొనసాగించాలని తాజాగా జీహెచ్‌ఎంసీ చట్టానికి సవరణను ప్రతిపాదించామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 2015 ఎన్నికల్లో ఖరారు చేసి రిజర్వేషన్లు వచ్చే ఎన్నికల్లో య«థాతథంగా ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి సాధారణ ఎన్నిక కోసం డివిజన్ల రిజర్వేషన్లు మారుస్తూ ఉండాలని ప్రస్తుత జీహెచ్‌ంసీ చట్టంలో ఉందన్నారు. ప్రతిసారి రిజర్వేషన్లు మారుస్తుండటంతో ఎన్నికైన కార్పొరేటర్లలో జవాబుదారీతనం, శ్రద్ధ లోపిస్తోందన్నారు. 

‘ఆమె’కు చట్టబద్ధంగా 50% కోటా..  తొలి రాష్ట్రంగా తెలంగాణలో 2015లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను జీవో ద్వారా అమలు చేశామన్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు చట్టం ద్వారా మహిళలకు 50  శాతం కోటా అమలు చేయడానికి ఈ సవరణను ప్రతిపాదిస్తున్నామన్నారు. అన్ని స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం కోటా అమలు చేస్తే బాగుంటుందా? అని కేంద్రం అభిప్రాయం కోరిందని సభకు తెలిపారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243 (టి) ప్రకారం కనీసం మూడో వంతు సీట్లను మహిళలకు కేటాయించాలని ఉందన్నారు. ఇప్పటికే కొత్త పంచాయతీరాజ్, మున్సిపల్‌ చట్టాల ద్వారా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చామని, తాజాగా జీహెచ్‌ఎంసీ చట్ట సవరణతో అన్ని స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం కోటాను చట్టబద్ధంగా అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుందన్నారు. జీహెచ్‌ఎంసీ చట్టంలో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఇప్పటికే ఉందని, ఇందుకు ప్రత్యేకంగా మళ్లీ సవరణ చేయాల్సిన అవసరం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేవనెత్తిన ఓ ప్రశ్నకు కేటీఆర్‌
గ్రేటర్‌లో గ్రీనరీకి జవాబుదారీతనం
జీహెచ్‌ఎంసీ పరిధిలో మొక్కలు, నర్సరీల పెంపకం, నీళ్లు పోయడంతో పాటు కచ్చితంగా 85 శాతం నాటిన మొక్కలు బతికేలా స్థానిక కార్పొరేటర్, అధికారులు బాధ్యత తీసుకోవాలని, సంస్థ బడ్జెట్‌లో 10 శాతం నిధులను పచ్చదనానికి కేటాయించాలని మరో సవరణ తీసుకొచ్చామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌లో ఇప్పటి వరకు 2.5 శాతం మాత్రమే గ్రీన్‌ బడ్జెట్‌ పెట్టేవారని, దీన్ని 10 శాతానికి పెంచడం ద్వారా కాంక్రీట్‌ జంగిల్‌గా మారుతున్న హైదరాబాద్‌ను హరితవనంగా మార్చడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఫార్మా సిటీ, పర్యావరణం గురించి కాంగ్రెస్‌ మాట్లాడటం చూస్తే వంద ఎలుకలను తిన్న పిల్లి నీతులు చెప్పినట్టు ఉందని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. 


పాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించడం, వికేంద్రీకరణలో భాగంగా ప్రతి డివిజన్‌లో 4 రకాల కమిటీల ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ చట్టంలో పొందుపరుస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. ఒక్కో కమిటీలో 25 మంది చొప్పున ప్రతి డివిజన్‌లో 100 మంది వీటిలో ఉంటారని, మొత్తం 150 డివిజన్లలో 15 వేల మందితో శక్తివంతమైన పౌర సైన్యాన్ని తయారు చేస్తామన్నారు. కమిటీల్లో 50 శాతం మహిళలు ఉంటారన్నారు. యువజన, వయోజనులు, మహిళలు, ప్రముఖ పౌరులతో ఈ నాలుగు కమిటీలు ఏర్పాటు అవుతాయన్నారు.

పచ్చదనం, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, అక్రమ కట్టడాలు, ప్రభుత్వ స్థలాల కబ్జాలకు చెక్‌ పెట్టడం, ప్లాస్టిక్‌ నిర్మూలన, క్రీడలు, పార్కులను ప్రోత్సహించడం కోసం... పౌరసైన్యాన్ని జీహెచ్‌ఎంసీకి అందించాలని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వార్డు కమిటీలు ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశమై సూచనలు చేస్తాయని, వాటిలో ముఖ్యమైన వాటిని కౌన్సిల్‌ ముందు ఉంచుతారన్నారు. రాజకీయాలకు అతీతంగా... ఎన్జీఓలు, కాలనీ అసోసియేషన్లు, క్రీయాశీలంగా ఉన్న వారికి ఈ కమిటీల్లో అవకాశం కల్పిస్తామన్నారు. 2015లో ప్రవేశపెట్టిన బీఆర్‌ఎస్‌ కింద వచ్చిన 1.13 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తైందని, లోపాలు సరి చేసుకోవాలని దరఖాస్తుదారులకు తెలియజేశామన్నారు. బీఆర్‌ఎస్‌పై హైకోర్టులో స్టే తొలగించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని, స్టే తొలిగిపోతే దరఖాస్తులను పరిశీలిస్తామన్నారు. 

చదవండి: కీసర మాజీ తాహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య

మరిన్ని వార్తలు