85 వేల ‘డబుల్‌’ ఇళ్లు సిద్ధం

27 Aug, 2020 05:39 IST|Sakshi
జీహెచ్‌ఎంసీ డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహిస్తున్న కేటీఆర్‌. చిత్రంలో మేయర్‌ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీయొద్దీన్‌ తదితరులు

డిసెంబర్‌ నాటికి జీహెచ్‌ఎంసీలో పంపిణీకి ఏర్పాట్లు 

ఒకటి రెండు రోజుల్లో లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలు 

జీహెచ్‌ఎంసీ పరిసర జిల్లాల పేదలకు పది శాతం కోటా 

మొత్తం 24 నియోజకవర్గాల్లో నాలుగు వేల ఇళ్ల చొప్పున పంపిణీ 

డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకంపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష 

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో పేదల కోసం సుమారు లక్ష ఇళ్ల నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఇందులో 85 వేల ఇళ్లను ఈ ఏడాది చివరి నాటికి అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. ఒకటి రెండ్రోజుల్లో లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తామని వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకంపై మంత్రి కేటీఆర్‌ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్లతో పాటు జీహెచ్‌ఎంసీ హౌసింగ్, పురపాలక శాఖ ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. 

రూ.9,700 కోట్లతో డబుల్‌ ఇళ్లు.. 
దేశంలోని ఏ ఇతర మెట్రో నగరంలో లేని విధంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.9,700 కోట్ల వ్యయంతో పేదల కోసం ఇళ్లు నిర్మిస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులు చాలా చోట్ల ఆగస్టు నెలాఖరు నుంచి డిసెంబర్‌ చివరి నాటికి పూర్తవుతాయన్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పనులు పూర్తయిన చోట అర్హులైన పేదలకు ఇళ్లు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. 

నియోజకవర్గానికి 4 వేల ఇళ్లు.. 
జీహెచ్‌ఎంసీ పరిధిలో 75 వేల డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణంతో పాటు మరో 10 వేల ఇళ్లు జేఎన్‌యూఆర్‌ఎం, వాంబే పథకం కింద నిర్మాణంలో ఉన్నట్లు అధికారులు నివేదించారు. డబుల్‌ బెడ్రూం ఇళ్లకు సంబంధించి జీహెచ్‌ఎంసీ దాని పరిసర జిల్లాల్లోని మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఒక్కో నియోజకవర్గానికి 4 వేల ఇళ్లు అందజేస్తామని తెలిపారు. డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం స్థలాలు ఇచ్చిన మురికివాడల్లోని ప్రజల (ఇన్స్‌ట్యూ) జాబితా రూపొందించాలన్నారు. జీహెచ్‌ఎంసీ పరిసర జిల్లాల్లోని ప్రజల కోసం 10 శాతం ఇళ్లు కేటాయించినందున లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీయొద్దీన్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు