ఆవిష్కరణలకు ప్రాధాన్యం

2 Sep, 2020 05:51 IST|Sakshi

ద్వితీయ శ్రేణి నగరాల్లో ‘టీ హబ్‌’ తరహా సేవలు

ఇంటింటా ఇన్నోవేటర్‌తో విద్యార్థులకు ప్రోత్సాహం

ఇన్నోవేషన్‌ సెల్, టీ హబ్‌పై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న నేపథ్యంలో గ్రామీణ, వ్యవసాయ ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పిలుపునిచ్చారు. ఔత్సాహిక యువతకు సేవలు అందిస్తున్న స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ ‘టీ హబ్‌’కార్యక్రమాలను ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్, టీ హబ్‌ కార్యకలాపాలపై మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్, టీ హబ్, వీ హబ్, టీ వర్క్స్, రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సర్కిల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (రిచ్‌), తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌) వంటి సంస్థలు ఏర్పాటైనట్లు కేటీఆర్‌ వెల్లడించారు. ఈ సంస్థల ద్వారా రాష్ట్రంలో ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం ఏర్పడిందన్నారు.

తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఇంటింటా ఇన్నోవేటర్‌’ద్వారా గ్రామీణ యువతకు, విద్యార్థులకు ప్రోత్సాహం లభిస్తోందని మంత్రి వెల్లడించారు. పాఠశాల విద్యార్థుల వినూత్న ఆలోచనలకు అండగా నిలిచేందుకు పాఠశాల స్థాయిలోనే ఇన్నోవేషన్‌ కల్చర్‌ను అలవాటు చేయాలని, ఈ దిశగా విద్యా శాఖతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. టీ హబ్‌ ద్వారా సాంకేతిక ఆవిష్కరణలతో పాటు గ్రామీణ, సామాజిక ఆవిష్కరణల పైనా దృష్టి సారించాలన్నారు. వివిధ రంగాల్లో ఆవిష్కరణలకు తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్, టీ హబ్, వీ హబ్‌ వంటి సంస్థల ద్వారా సహకారం అందించాలని ఆదేశించారు. సమావేశంలో ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, టీ హబ్‌ సీఈవో రవి నారాయణ్‌ తదితరులు పాల్గొన్నారు. టీ హబ్, స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ కార్యకలాపాలపై అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

మరిన్ని వార్తలు