వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లు

1 Jul, 2021 07:51 IST|Sakshi
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లపై జరిగిన సమావేశంలో మంత్రులు కేటీఆర్, గంగుల, నిరంజన్‌రెడ్డి తదితరులు

మంత్రి కేటీఆర్‌ వెల్లడి 

తెలంగాణ ఫుడ్‌ మ్యాప్‌ ఆధారంగా ప్రాసెసింగ్‌ జోన్ల ఏర్పాటు 

ఒక్కో జోన్‌ 225 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుకు కసరత్తు 

ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తుల గడువు పెంపు 

కేటీఆర్‌ ఆధ్యక్షతన వ్యవసాయ, పౌర సరఫరాల మంత్రుల భేటీ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్, మార్కెటింగ్‌ సదుపాయాన్ని పెంచేందుకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. ఇందు లో భాగంగా కేవలం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకే పరిమితం కాకుండా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లను కూడా ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్ల కు సంబంధించి మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో బుధవారం విస్తృతస్థాయి సమావేశం జరిగింది. వ్యవసా  య అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయ డం ద్వారా రాష్ట్రంలో సాగు ఉత్పత్తులు భారీగా పెరిగిన విషయాన్ని కేటీఆర్‌ గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలో ప్రధాన పంట వరితోపాటు ఆయిల్‌పామ్‌ వంటి నూతన పంటల భవిష్యత్‌ ప్రాసెసింగ్‌ అవసరాలను కూడా ‘స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు’ఏర్పాటులో పరిగణనలోకి తీసుకుంటామ న్నారు. తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు ఎస్‌.నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌తోపాటు పరిశ్రమలు, వ్యవసాయం, పౌరసరఫరాల శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

నిరుద్యోగ సమస్యకు పరిష్కారం 
వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్, డిమాండ్‌ కల్పించడం ద్వారానే ఆర్థిక పురోగతి, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి అన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్ల ఏర్పాటు ద్వారా సాగు ఉత్పత్తులకు గిరాకీ పెరగడంతో పాటు దీర్ఘకాలంలో లాభసాటి ధర వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఉత్పత్తులకు శాశ్వత డిమాండ్‌ ఉండే అవకాశం ఉండటంతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తాయన్నారు. పెరిగిన వరి ధాన్యం మిల్లింగ్‌ సామర్థ్యం పెంచేందుకు ప్రత్యేక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లలో ఏర్పాట్లు చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. సుమారు 92 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఎఫ్‌సీఐకి అందించేందుకు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు మిల్లింగ్‌ ఇండస్ట్రీకి ప్రోత్సాహమిచ్చేలా కొత్త పాలసీ రూపొందించాలన్నారు. మిల్లింగ్‌ పెరిగితే చైనా లాంటి దేశాలకు తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతికి అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 

ఉమ్మడి తొమ్మిది జిల్లాల పరిధిలో.. 
తొలి విడతలో హైదరాబాద్‌ మినహా పూర్వ ఉమ్మడి తొమ్మిది జిల్లాల పరిధిలో కనీసం 225 ఎకరాల విస్తీర్ణంలో స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసిసెంగ్‌ జోన్ల ఏర్పాటుకు కసరత్తు జరుగు తోంది. ఈ జోన్లలో విద్యుత్, తాగునీటి సరఫరా, వ్యర్థాల నిర్వహణ, కాలుష్య వ్యర్థాల శుద్దీకరణ ప్లాంటు తదితర మౌలిక వసతులన్నీ ఈ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లలో అంతర్భాగంగా ఉంటాయి. రాష్ట్రంలో ప్రధానంగా వరి, మిరప, పసుపు, చిరు ధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్, స్టోరేజీ, మార్కెటింగ్‌ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ జోన్లలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తారు.  

ఇప్పటికే 350 దరఖాస్తులు 
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్ల ఏర్పాటుకు సంబం ధించి ఔత్సాహికుల నుంచి ప్రభుత్వం ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు ఆహ్వానించింది. ఇప్పటికే 350 దరఖాస్తులు అందగా, మరిన్ని కం పెనీలను భాగస్వాములను చేసేందుకు  గడువు పెంచాలని కేటీఆర్‌ ఆదేశించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్ల ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ, ఇతర అంశాల్లో స్థానిక ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. హరిత విప్లవంతోపాటు మాంసం, పాలు, మత్య్స రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నందున ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అవకాశాలు మెరుగుపరచాల్సి ఉందన్నారు.

పరిశ్రమలు, ఐటీ శాఖలపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ప్రతిపాదనలపై పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు  సమీక్ష  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా రంగాల వారీగా పరిశ్రమలు, ఐటీ శాఖ విభాగాధిపతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలైన ఫుడ్‌ ప్రాసెసింగ్, ఐటీ, ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్, ఫార్మా మరియు లైఫ్‌ సైన్సెస్‌ వంటి రంగాల్లో అనేక కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సం సిద్ధత వ్యక్తం చేశాయని, ఈ మేరకు పలు కంపెనీలు తమ ఆసక్తిని వివిధ శాఖల అధికారులకు తెలియజేశాయని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల ఏర్పాటు జరగాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని, ఆ మేరకు పారిశ్రామిక వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. 


 

మరిన్ని వార్తలు