కరోనా సంక్షోభం తర్వాతే కొత్త అవకాశాలు

28 Aug, 2020 01:23 IST|Sakshi
గురువారం హైదరాబాద్‌లో సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్‌ జిల్లా అభివృద్ధి ప్రణాళికను ఆవిష్కరిస్తున్న మంత్రి కేటీఆర్‌. చిత్రంలో ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ 

డిజిటలీకరణ వైపుగా  ప్రస్తుత పరిస్థితులు  

టీ ఫైబర్‌ ద్వారా డిజిటల్‌ రంగంలో అవకాశాలు  

స్టార్టప్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్‌  

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా సంక్షోభం ముగిసిన తర్వాతే కొత్త అవకాశాలు వస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు కేంద్రంగా మారిందని, ప్రస్తుత సంక్షోభం తర్వాత వివిధ రంగాల్లో రానున్న మార్పులకు అనుగుణంగా మరిన్ని పెట్టుబడులు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. గురువారం సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఇన్వెస్ట్‌ ఇన్‌ తెలంగాణ అపర్చునిటీస్‌ ఇన్‌ పోస్ట్‌ కోవిడ్‌ వరల్డ్‌ పేరుతో రెండ్రోజుల పాటు జరిగే ఈ వర్చువల్‌ కాన్ఫరెన్సులో పలువురు వ్యాపారవేత్తలు, వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐఐ రూపొందించిన నిజామాబాద్‌ డిస్ట్రిక్ట్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ను మంత్రి విడుదల చేశారు. ప్రస్తుత కరోనా సంక్షోభంతో ప్రపంచం డిజిటలీకరణ వైపు వెళ్తుందని, తెలంగాణ సైతం ఈ మార్గాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.  (జనరల్‌ పర్పసెస్‌ కమిటీ సభ్యుడిగా కేకే)

ఇప్పటికే తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్‌ అందించే పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. పల్లెలకు ఇంటర్నెట్‌ వెళ్లిన తర్వాత ఎడ్యుకేషన్, హెల్త్‌ కేర్‌ వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని, ఇది డిజిటల్‌ విప్లవం వైపు తెలంగాణను తీసుకెళ్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొత్త అవకాశాలు వస్తాయని, ఆ దిశగా తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ ద్వారా వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 14 ప్రాధాన్యత రంగాలను ఎంచుకుందని, ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టే వారికి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను స్టార్టప్‌ క్యాపిటల్‌గా తయారు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం గత ఐదేళ్లుగా అనేక కార్యక్రమాలు చేపట్టిందని, ఇందులో భాగంగా టీ హబ్‌ ఏర్పాటు ఇండియన్‌ స్టార్టప్‌ ఈకో సిస్టంలో ఒక గొప్ప మార్పుకి కారణమైందన్నారు. దీంతో పాటు మహిళల కోసం ప్రత్యేకంగా వి–హబ్‌ను కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.  

ప్రపంచస్థాయి పారిశ్రామిక పార్కులు... 
రాష్ట్రంలో భారీ స్థాయిలో పారిశ్రామిక పార్కులు ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌ ఫార్మా సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ అని, దేశంలోనే అతి పెద్దదైన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్, మెడికల్‌ డివైజెస్‌ లాంటి వివిధ పారిశ్రామిక పార్కుల అభివృద్ధి చేపడుతున్నామని పేర్కొన్నారు. అన్ని రంగాలకు 24 గంటలూ విద్యుత్‌ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. పారిశ్రామిక రంగానికే కాకుండా వ్యవసాయ రంగానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, రైతుబంధు, రైతు బీమా తదితర సంక్షేమ కార్యక్రమాలు రైతుల కోసం చేపట్టామన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో సాగు నమోదైందన్నారు. రాష్ట్రంలోని రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.     

>
మరిన్ని వార్తలు