కృత్రిమ మేధస్సు రంగంలో తెలంగాణ టాప్‌

3 Jan, 2021 01:53 IST|Sakshi

కరోనా సమయంలోనూ పురోగమించాం

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడి

ఏఐ ద్వారా సామాజిక ఆవిష్కరణలకు ఆరు అంచెల వ్యూహం

గతేడాది సాధించిన విజయాలతో ప్రగతి నివేదిక విడుదల

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఇయర్‌ ఆఫ్‌ ఏఐ 2020’కార్యక్రమం కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. కరోనా సమయంలోనూ ఏఐ రంగంలో రాష్ట్రం పురోగమించిందన్నారు. ఆధునిక ఐటీ సాంకేతికతలో భాగమైన కృత్రిమ మేధస్సు రంగంలో గతేడాది  సాధించిన విజయాలతో కూడిన ‘తెలంగాణాస్‌ ఇయర్‌ ఆఫ్‌ ఏఐ–2020 అండ్‌ బియాండ్‌’అనే నివేదికను మంత్రి కేటీఆర్‌ శనివారం విడుదల చేశారు. ఏఐ ద్వారా సామాజిక ఆవిష్కరణలు చేయడంలో తెలంగాణను విశ్వకేంద్రంగా నిలబెట్టేందుకు ఆరు అంచెలతో కూడిన వ్యూహానికి ఈ నివేదికలో పెద్దపీట వేసినట్లు కేటీఆర్‌ వెల్లడించారు. చదవండి:  (తెలంగాణ: డ్రై రన్‌ సక్సెస్‌)

రాష్ట్రంలో ఏఐ విధానం అమలును వేగవంతం చేసేందుకు ‘తెలంగాణ ఏఐ మిషన్‌’(టీ–ఎయిమ్‌)ను ఏర్పాటు చేశామన్నారు. ఏడాది కాలంలో ట్రిపుల్‌ ఐటీ, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా, సెంటర్‌ ఫర్‌ ఫోర్త్‌ ఇండస్ట్రియల్‌ రివల్యూషన్, ప్రపంచ ఆర్థిక వేదిక, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్, ఎన్‌విడియా, మైక్రోసాఫ్ట్, ఐఐటీహెచ్‌ తదితర సంస్థల సహకారంతో 120 కార్యక్రమాలను నిర్వహించినట్లు కేటీఆర్‌ ప్రకటించారు. రాష్ట్రంలో ఏఐ వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు వివిధ సంస్థలతో బహుళ భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవడంపై ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ డైరక్టర్‌ రమాదేవి లంక, సాఫ్ట్‌నెట్‌ సీఈఓ శైలేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

నివేదికలోని ముఖ్యాంశాలు... 
– జీవితాలపై రోజూవారీగా ఎమర్జింగ్‌ టెక్నాలజీ చూపుతున్న ప్రభావాన్ని లోతుగా అర్థం చేసుకోవడంతోపాటు కృత్రిమ మేథస్సు (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌–ఏఐ) రంగంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు గతేడాది జనవరి 2న రాష్ట్ర ప్రభుత్వం 2020ని ‘ఇయర్‌ ఆఫ్‌ ది ఏఐ’గా ప్రకటించింది. 
– ఆరోగ్యం, వ్యవసాయం, రవాణా, న్యాయ, విద్యా రంగాలపై దృష్టి సారించి ఏఐ రంగంలో నూతన ఆవిష్కరణలకు బాటలు వేయాలని నిర్ణయించింది. 
– రాష్ట్రంలో ఏఐ వాతావరణాన్ని పెంపొందించేందుకు ఇంటెల్, ఎన్‌విడియా, వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం, నాస్కామ్, ఐఐటీ వంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 
– ఐటీ పరిశ్రమ, విద్యా సంస్థలు, స్టార్టప్‌లు, పౌర సమాజంతో సంప్రదింపుల తర్వాత ఆచరణయోగ్యంగా ఉండే ఏఐ పాలసీ విధి విధానాలను రూపొందించి గతేడాది జూన్‌లో ‘ఏఐ ఫ్రేమ్‌వర్క్‌’ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఫ్రేమ్‌వర్క్‌ను ఆచరణలోకి తెచ్చేందుకు నాస్కామ్‌ భాగస్వామ్యంతో ‘తెలంగాణ ఏఐ మిషన్‌’(టి ఎయిమ్‌) ఏర్పాటు చేసి ఆరు అంచెల వ్యూహాన్ని రూపొందించింది. 
– ఆరోగ్య, రవాణా రంగాలపై దృష్టి కేంద్రీకరించేందుకు ఇంటెల్, ట్రిపుల్‌ ఐటీ (హైదరాబాద్‌), పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా సహ భాగస్వామ్యంతో ‘ఏఐ పరిశోధన కేంద్రం’ఏర్పాటైంది. 
– వ్యవసాయ, న్యాయ రంగాలపై ప్రాథమికంగా దృష్టి సారించేందుకు సెంటర్‌ ఫర్‌ ఫోర్ట్‌ ఇండస్ట్రియల్‌ రివల్యూషన్, వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సహకారంతో సెంటర్‌ ఫర్‌ రెస్పాన్సిబుల్‌ డిప్లాయ్‌మెంట్‌ ఆఫ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ (క్రెడెట్‌) ఏర్పాటైంది. 
– రైతులు, వ్యవసాయ శాఖ విధాన నిర్ణేతలకు వ్యవసాయ రంగంలో ఏఐ ఆధారిత పరిష్కారాలు కనుగొనేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సాయంతో ‘ఏఐ4ఏఐ’, అగ్రిటెక్‌ ఇన్నోవేషన్‌ పైలట్స్, అగ్రిడేటా హబ్, డ్రోన్ల ద్వారా క్రిమి సంహారకాల పిచికారీ వంటి కార్యక్రమాలు నిర్వహించింది. జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో ఆవిష్కర్తల కోసం అగ్రి డేటా హబ్‌ను నెలకొల్పింది. 

ప్రాజెక్టులకు ఏఐ సాయం ఇలా
►కోవిడ్‌ సమయంలో 100కుపైగా డాష్‌ బోర్డుల ద్వారా వైద్య సదుపాయాలు, అన్‌లాక్‌ ప్రక్రియ, జిల్లా స్థాయిలో అవగాహన, సంక్రమణ తీరు, జిల్లాలవారీగా పరిస్థితి, ఫేస్‌ మాస్క్‌ లేకుండా తిరిగే వారిని గుర్తించడం, గ్రామీణ స్థాయిలో వైద్య సదుపాయాల కోసం ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ వంటివి అందుబాటులోకి. 
►ప్రభుత్వ సేవలను పౌరులకు అందుబాటులోకి తేవడంలో రియల్‌టైమ్‌ డిజిటల్‌ అథంటికేషన్‌ ఆఫ్‌ ఐడెంటిటీ ద్వారా 32 వేల మంది పెన్షనర్లు లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించేలా ఏర్పాటు. 
►గ్రామాల్లో పోషకాహార లోపంతో పుట్టే పిల్లలను గుర్తించేందుకు ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తల కోసం ఏఐ 
టెక్నాలజీపై పరిశోధనలు.
►జాతరలు, సభల్లో తొక్కిసలాటలు జరగకుండా ఏఐ ఆధారిత పరిష్కారం. 
►రాష్ట్ర నైపుణ్య శిక్షణ సంస్థ, ఉన్నత విద్యామండలి, మైక్రోసాఫ్ట్, నాస్కామ్‌ ఫ్యూచర్‌ స్కిల్స్‌ ద్వారా ఏఐ రంగంలో 30 వేల మంది యువతకు శిక్షణ. 

మరిన్ని వార్తలు