టెక్నాలజీతోనే వినూత్న మార్పులు 

3 Sep, 2020 05:31 IST|Sakshi
నాస్కామ్‌ రూపొందించిన ‘సర్వే ఆఫ్‌ ఇండియన్‌ ఎంటర్‌ప్రైజెస్‌’ నివేదికను విడుదల చేస్తున్న మంత్రి కేటీఆర్‌

విభిన్న రంగాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా ప్రయోజనం 

ప్రభుత్వ పాలనలో డేటా వినియోగంపై లోతైన చర్చ 

నాస్కామ్‌ ఇష్టాగోష్టిలో మంత్రి కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) వంటి నూతన సాంకేతికత సామాన్యుడి జీవితంలో మార్పులు తెచ్చే అవకాశముందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఆహారభద్రత, ఆరోగ్యం, వ్యవసాయం, పాలన, శాంతిభద్రతలు వంటి రంగాల్లో కృత్రిమ మేధస్సు(ఏఐ)ని పెద్ద ఎత్తున ఉపయోగించుకునే వీలుందన్నారు. ‘ఎక్స్‌పీరియెన్స్‌ ఇన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌’ పేరిట నాస్కామ్‌ బుధవారం నిర్వహించిన వర్చువల్‌ ఇష్టాగోష్టిలో ‘ఐటీ పరిశ్రమలో ఏఐ పాత్ర – భారత్‌ చేపట్టాల్సిన చర్యలు’అనే అంశంపై కేటీఆర్‌ ప్రసంగించారు. ఏఐ ఉపయోగాలు, తెలంగాణ ప్రభుత్వం వాటిని అందిపుచ్చుకుంటు న్న తీరును వివరిస్తూ 2020ని తమ ప్రభు త్వం ‘ఇయర్‌ ఆఫ్‌ ది ఏఐ’గా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రపంచ ఆర్థిక వేదిక, ఇంటెల్, ట్రిపుల్‌ ఐటీ, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ వంటి సంస్థలతో ఏఐ రంగంలో తాము ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. 

ఓపెన్‌ డేటా పాలసీ ద్వారా సమాచారం 
ఏఐ టెక్నాలజీ వినియోగంలో పెద్ద ఎత్తున సమాచారం(డేటా) అవసరమని, డేటా వినియోగంలో ప్రభుత్వం అప్రమత్తతతో వ్యవహరిస్తోందని కేటీ ఆర్‌ వెల్లడించారు. ‘డేటా వినియోగం’, ‘వ్యక్తిగత గోప్యత’వంటి అంశాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాలనలో డేటా వినియోగంపై లోతైన చర్చ జరగాలన్నారు. ఓపెన్‌ డేటా పాలసీలో భాగంగా వివిధ శాఖల సమగ్ర సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన విషయాన్ని కేటీఆర్‌ గుర్తు చేశారు. ఏఐ ప్రయోజనాలను అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం, విద్యారంగం, పరిశ్రమల నడుమ భాగస్వామ్యం ఏర్పడాలని అభిప్రాయపడ్డారు.

వ్యవసాయ రంగంలోనూ.. 
వ్యవసాయ రంగంలో ఏఐ ద్వారా లాభం పొందేందుకు ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పర్‌ అగ్రికల్చరల్‌ ఇన్నోవేషన్‌’అనే ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. కాగా, ఏఐ రంగంలో తెలంగాణ ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామని నాస్కామ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ దేబ్‌జానీ ఘోష్‌ హామీ ఇచ్చారు. ఏఐపై నాస్కామ్‌ రూపొందించిన ‘సర్వే ఆఫ్‌ ఇండియన్‌ ఎంటర్‌ప్రైజెస్‌’నివేదికను కేటీఆర్‌ విడుదల చేశారు. 

>
మరిన్ని వార్తలు