వారు మాకు బ్రాండ్‌ అంబాసిడర్లు 

23 Oct, 2021 04:15 IST|Sakshi
వర్చువల్‌ సదస్సులో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌. చిత్రంలో జయేశ్‌ రంజన్‌ 

పబ్లిక్‌ అఫైర్స్‌ ఫోరం ఆఫ్‌ ఇండియా సదస్సులో మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: కొత్త పెట్టుబడిదారులను ఆకర్షించే క్రమంలో ఇప్పటికే పెట్టుబడి పెట్టినవారిని చాలా రాష్ట్రాలు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాయని, తెలంగాణ మాత్రం వారిని బ్రాండ్‌ అంబాసిడర్లుగా భావిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. పబ్లిక్‌ అఫైర్స్‌ ఫోరం ఆఫ్‌ ఇండియా (పీఏఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ‘8వ జాతీయ సదస్సు 2021’లో కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

వర్చువల్‌ విధానంలో జరిగిన ఈ సదస్సులో కేటీఆర్‌ మాట్లాడుతూ ఏడేళ్ల వ్యవధిలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల్లో 24 శాతం అనగా సుమారు 32 బిలియన్‌ డాలర్ల మేర ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పెట్టుబడిదారుల నుంచి ఆకర్షించామని చెప్పారు. పెట్టుబడులను రాబట్టేందుకు అవసరమైన విధానాలు, మౌలిక వసతులపై మార్గదర్శనం చేసేందుకు నైపుణ్యం కలిగిన యువకుల సేవలను ప్రభుత్వం ఉపయోగించుకుంటోందన్నారు. ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’వేదిక ద్వారా ఈ యువకులు మంచి ఫలితాలు రాబడుతున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు.  

టీఎస్‌ఐఐసీ వద్ద రెండు లక్షల ఎకరాల భూమి  
పరిశ్రమల ఏర్పాటుకు టీఎస్‌ఐఐసీ వద్ద రెండు లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పునరుద్ధరణీయ ఇంధన ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందని వెల్లడించారు. ప్రభుత్వ ఖర్చుతో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేస్తున్నామని, స్థానికులకు ఎక్కువసంఖ్యలో ఉద్యోగాలు లభించేలా చూస్తున్నామని వివ రించారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించే సంస్థలకు అదనపు ప్రోత్సాహకాలు ఇస్తు న్న విషయాన్ని కేటీఆర్‌ ప్రస్తావించారు.

ఐటీ, ఎలక్ట్రానిక్స్, జీవ ఔషధాలతోపాటు ఫార్మా, బయోటెక్, వైద్య ఉపకరణాలు, రక్షణ, ఏరోస్పేస్, ఫుడ్‌ ప్రాసెసింగ్, వస్త్ర, యంత్ర, ఎలక్ట్రానిక్‌ వాహనాలు, ప్లాస్టిక్, రసాయన, వజ్రాభరణాలు, చిల్లర వర్తకం వంటి రంగాలకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. సమావేశంలో ఫిక్కి కార్యదర్శి జనరల్‌ దిలీప్‌ షెనాయ్, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు