రోబో పార్కు రాష్ట్రంగా తెలంగాణ

10 May, 2023 05:10 IST|Sakshi
రోబోటిక్‌ ఫ్రేమ్ర్‌వర్క్‌పై బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రి కేటీఆర్, జయేశ్‌రంజన్‌ తదితరులు

రోబోటిక్‌ టెక్నాలజీ గేమ్‌ చేంజర్‌ అవుతుంది: మంత్రి కేటీఆర్‌  

త్వరలో తెలంగాణ రోబోటిక్స్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఏర్పాటు 

పెట్టుబడులను ఆకర్షించడానికి జూలైలో గ్లోబల్‌ రోబోటిక్స్‌ సమ్మిట్‌ 

టీహబ్‌లో ‘తెలంగాణ స్టేట్‌ రోబోటిక్స్‌ ఫ్రేమ్‌వర్క్‌’ను ఆవిష్కరించిన కేటీఆర్‌ 

దేశంలో తొలిసారిగా ఈ ఫ్రేమ్‌వర్క్‌ విడుదల చేసిన రాష్ట్రంగా ఘనత 

రాయదుర్గం: దేశంలో రోబోటిక్‌ టెక్నాలజీ గేమ్‌ చేంజర్‌ అవుతుందని ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. తెలంగాణ రోబోటిక్స్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ (టీఆర్‌ఐసీ)ను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రోబోటిక్స్‌ రంగంలో అగ్రగామిగా నిలుస్తామని, రోబో పార్కు రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందడం ఖాయమన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడానికి వచ్చే జూలైలో ‘గ్లోబల్‌ రోబోటిక్స్‌ సమ్మిట్‌’ను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు.

మంగళవారం హైదరాబాద్‌ నాలెడ్జి సిటీలోని టీహబ్‌లో ‘తెలంగాణ రోబోటిక్‌ ఫ్రేమ్‌వర్క్‌ను ఆవిష్కరించిన అనంతరం కేటీఆర్‌ మాట్లా డారు. ఇది ఫ్రేమ్‌వర్క్‌ కింద అన్ని కార్యక్రమాలకు నాయకత్వం వహించడానికి నోడల్‌ బాడీగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో స్థిరమైన రోబోటిక్స్‌ పర్యావరణ వ్యవస్థను సృష్టించడం, ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధిలో రాష్ట్రాన్ని కేంద్రంగా చేయడం వంటి లక్ష్యాలతో ‘స్టేట్‌ రోబోటిక్స్‌ ఫ్రేమ్‌వర్క్‌’ను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు.

అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, పారిశ్రామిక ఆటోమేషన్, కన్సూ్యమర్‌ రంగాల్లో మరింత అభివృద్ధిని సాధించడానికి ఈ ఫ్రేమ్‌వర్క్‌ దోహదపడుతుందని చెప్పారు. రాష్ట్రంలోని స్టార్టప్‌లకు అవసరమైన ఇంక్యుబేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆథరైజేషన్‌ సపోర్ట్, మార్కెట్‌ ఇన్‌సైట్‌లు, ఇన్వెస్టర్‌ కనెక్షన్‌లు తదితరాల కోసం ప్రపంచస్థాయి రోబోటిక్స్‌ యాక్సిలరేటర్‌ను ఏర్పాటు చేస్తుందన్నారు.

రోబోటిక్‌ టెక్నాలజీ వినియోగంలో చైనా, జపాన్, అమెరికా తర్వాత పదో దేశంగా భారత్‌ గుర్తింపు పొందుతోందన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడానికి, వివిధరంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా ఐఐటీ హైదరాబాద్, ఆర్ట్‌ పార్కు ఐఐఎస్‌సీ, జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు, ఏజీహబ్, ఆలిండియా రోబోటిక్స్‌ అసోసియేషన్‌ వంటి సంస్థలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ డైరెక్టర్‌ రమాదేవిలంకా, పలుసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు