మహిళల భద్రతకు డ్రోన్లు వాడాలి

12 Nov, 2020 03:46 IST|Sakshi

ఆపదలో ఉన్నవారి వద్దకు పోలీసు సైరన్‌తో వెళ్లేలా చూడాలి 

దీనివల్ల నేరగాడు భయపడి నేరం చేసేందుకు అవకాశముండదు 

ఈ డ్రోన్లు వినియోగించేలా డీజీసీఏ నుంచి అనుమతులు తీసుకోవాలి 

సాక్షి, హైదరాబాద్‌ : మహిళల భద్రత విషయంలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన డ్రోన్లు వాడటం వల్ల నేరాలు తగ్గే అవకాశముందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అభిప్రాయపడ్డారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో నిర్మించిన పబ్లిక్‌ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్‌ ఆపరేషన్‌ సెంటర్‌ అండ్‌ డేటా సెంటర్‌ను హోంమంత్రి మహమూద్‌ అలీ, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలసి ఆయన బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ‘డయల్‌ 100కు కాల్‌ చేయడం వల్ల ఐదు నిమిషాల్లో ఘటనకు చేరుతారు, అదే ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కి డ్రోన్లు వినియోగించడం వల్ల ఒక నిమిషం వ్యవధిలో అక్కడికి చేరుతారు. అదే సమయంలో పోలీసు సైరన్‌ మోగిస్తే నిందితుడు పారిపోతాడు. దీనివల్ల బాధిత మహిళ నేరం బారినపడకుండా ఉంటుంది. పోలీసులు బాధితురాలికి భరోసా ఇచ్చి నిందితులను పట్టుకోవచ్చు’అని అన్నారు. వీటి వినియోగం కోసం డీజీసీఏ అనుమతులు తీసుకునే అంశాల్నీ పోలీసులు పరిశీలించాలని సూచించారు.  

 
నేరం చేయాలంటే దొంగలు భయపడుతున్నారు.. 
‘దేశంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో 60 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ‘నేను సైతం’ప్రాజెక్టులో భాగంగా సీసీ కెమెరాలు బిగించుకుంటు న్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఐదు లక్షల సీసీ కెమెరాలున్నాయి. వీటిని పది లక్షలు చేసే దిశగా ముందుకెళుతున్నాం. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలోని ఈ సీసీటీవీలు సైబరాబాద్‌లోని పబ్లిక్‌ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్‌ ఆపరేషన్‌ సెంటర్‌ అండ్‌ డేటా సెంటర్‌ అనుసంధానం చేయడం వల్ల నేరాలు పూర్తిస్థాయిలో తగ్గే అవకాశముంది.

ఇప్పటికే హైదరాబాద్‌లో దొంగత  నాలు చేయాలంటే అంతర్రాష్ట ముఠాలు భయపడుతున్నాయి. ఒకవేళ చేసినా 24 గంటలు గడవక ముందే సీసీటీవీల సహాయంతో పట్టేస్తున్నారు. అయితే ఈ డేటా సెంటర్‌ ద్వారా అన్ని ప్రభుత్వ విభాగాలను ఒకేతాటిపైకి తీసుకురావాలి, ఆయా పనులను కలిసికట్టుగా చేయడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉంటుంది’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఎఫెక్టివ్‌ పోలీసింగ్‌ వల్లే రాష్ట్రానికి, ముఖ్యంగా హైదరాబాద్‌కు పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి చెప్పారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా పెరుగుతున్న సైబర్‌ నేరాలు నిలువరించేలా ఎప్పటికప్పుడూ సిబ్బంది సైబర్‌ వారియర్‌లుగా మారి ఆధునిక టెక్నాలజీని అర్థం చేసుకుంటూ ముందుకెళ్లాలని ఆయన సూచించారు.

అంబులెన్స్‌ వాహనాలను అనుసంధానించాలి... 
‘ఈ సెంటర్‌ ద్వారా పోలీసు పెట్రోలింగ్‌ వాహనాలు ఏ ఏ సమయంలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకునే వీలుంది. నేరం జరిగిన ప్రాంతానికి ఏ వాహనం దగ్గరగా ఉంటే వారికి సమాచారమిచ్చి సులువైన మార్గంలో వెళ్లేలా సెంటర్‌ సిబ్బంది మార్గదర్శనం చేస్తారు. ఇదే మాదిరిగా అత్యవసర వైద్యసహాయం కోసం రోగులను తీసుకొచ్చే అంబులెన్స్‌లకు కూడా పెట్రోలింగ్‌ వాహనాలకు మాదిరిగానే ఈ సెంటర్‌తో అనుసంధానం చేయాలి. ప్రమాదసమయాల్లో ప్రాధమ్యంగా భావించే గోల్డెన్‌ అవర్‌లో రోగి సమీప ఆసుపత్రికి వెళ్లే దారి చూపేలా వైద్యారోగ్య శాఖతో మాట్లాడి అనుసంధానం చేయాల’ని సంబంధిత అధికారులకు కేటీఆర్‌ సూచించారు. బంజారాహిల్స్‌లో నిర్మిస్తున్న పోలీసు ట్విన్‌ టవర్స్‌ రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రపంచంలోని ఎక్కడి పోలీసులకైనా ఇది ఐకానిక్‌గా నిలుస్తుందని అన్నారు.  

ప్రతి వెయ్యిమందికి 30 సీసీటీవీలు: మహమూద్‌ 
అంతకుముందు హోంమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ప్రతి వెయ్యి మందికి 30 సీసీటీవీ కెమెరాలున్నాయని, ఇది ఎంతో భద్రతపరమైన నగరమని అన్నారు. ‘ఈ సెంటర్‌ వల్ల కిందిస్థాయి సిబ్బందికి మెరుగైన ఫలితాలు ఉంటాయి. నేరం జరిగే ప్రాంతానికి వెళ్లేలోపు సమగ్ర సమాచారం చేతికి అందేలా ఈ సెంటర్‌ చూస్తుంద’ని డీజీపీ మహేందర్‌ రెడ్డి అన్నారు. సైబర్‌ సెక్యూరిటీలో పోలీసులకు శిక్షణ కోసం తెలంగాణ పోలీసు శాఖ, ఐటీఈఎస్‌ ఎంవోయూ కుదుర్చుకున్నాయి. కార్యక్రమంలో హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, మహేష్‌ భగవత్, వీసీ సజ్జనార్, ఐటీ కార్యదర్శి జయేష్‌ రంజన్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ,ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, ఇతర పోలీసు సిబ్బంది, ఎల్‌ అండ్‌ టీ స్మార్ట్‌ ప్రతినిథి జేవీఎస్‌ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు