మీ ఆటలు ఎన్నో రోజులు సాగవు.. బీజేపీకి కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

15 May, 2022 16:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో శనివారం కేంద్ర హోం మంత్రి పర్యటన తర్వాత తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడిక్కెంది. అమిత్‌ షా వ్యాఖ‍్యలకు టీఆర్‌ఎస్‌ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గత కొంత కాలంగా తెలంగాణలో రాజకీయ పర్యటకుల తాకిడి ఎక్కువైంది. హైదరాబాద్‌కి వచ్చి బిర్యానీ తిని, చాయి తాగి ఇక్కడి నేతలు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్తున్నారు.

అమిత్ షా మాట్లాడిన అబద్దాలు చూస్తుంటే తన పేరు మార్చుకోవాలి. తన పేరు అమిత్ షా కాదు అబద్దాల బాద్ షాగా మార్చుకోవాలి. తుక్కుగూడలో తుక్కు డిక్లరేషన్ అంతా తుప్పే మాటలే. కేంద్ర మంత్రి హోదాలో ఉండి వాస్తవాలు చెప్పకుండా ఇష్టానుసారంగా మాట్లాడి వెళ్ళాడు. పదవులు అమ్ముకునే దౌర్భాగ్యులు, హీనులు, చిల్లర పార్టీ బీజేపీ. కర్నాటకలో 40 శాతం కమీషన్ ఇవ్వకపోతే నిధులు ఇచ్చే పరిస్థితి లేదు.. అవినీతి ఎవరిది?. సీఎం పదవిని అమ్ముకునే మీ పార్టీ అవినీతి పార్టీ కాదా?. చైతన్యవంతమైన పార్టీ టీఆర్‌ఎస్‌పైన పిచ్చిగా మాట్లాడటం మంచిది కాదు. నిజం చెప్పమని అడిగితే నిజాం గురించి మాట్లాడుతున్నాడు. నిజాం వారసులుగా బీజేపీ నేతలు పదే పదే తలుచుకుంటున్నారు. ఈ ఎనిమిది ఏళ్లలో కేంద్రం తెలంగాణకు చేసింది ఏమిటో చెప్పాలని అడిగాము. 

ఓ చదువుకోని బీజేపీ ఎంపీ 3 లక్షల 94 వేల కోట్లు ఇచ్చామని చెప్తున్నాడు. కానీ, నిన్న అమిత్ షా 2లక్షల కోట్లు ఇచ్చామని చెప్పాడు. బీజేపీ నేతల మాటలు అబద్దాలు అనడానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణ ప్రజలు కడుతున్న పన్నులతో బీజేపీ పాలిత రాష్ట్రాలు బతుకుతున్నాయి. అప్పుల శాతంలో మనది 23వ రాష్ట్రం. 28 రాష్ట్రాలలో కింది నుండి 5వ స్థానం తెలంగాణది. 2014లో 56 లక్షల కోట్లు దేశం అప్పులు ఉంటే.. ఇప్పుడు 80 లక్షల కోట్లు అప్పు దేశానికి అయ్యింది. మేము అప్పు చేసేది అభివృద్ధి, సంక్షేమం కోసమే.. కానీ, బీజేపీ అప్పు చేస్తే కార్పొరేట్ మిత్రుల కోసం. అసమర్థ ప్రధాని ఉంటే దేశం ఇట్లా ఉంటది. మా స్టీరింగ్ మా చేతుల్లోనే ఉంది.. మీ స్టీరింగ్ ఎక్కడ ఉందో అందరికీ తెలుసు’’ అని కౌంటర్‌ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: రాజకీయాల్లో​​​కి రాక ముందే బెంజ్‌ కారులో తిరిగా: మంత్రి

మరిన్ని వార్తలు