లెక్క తప్పైతే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: కేటీఆర్‌

21 Apr, 2022 15:44 IST|Sakshi

సాక్షి, హన్మకొండ: ‘ఏడేళ్లలో తెలంగాణ నుంచి కేంద్రం పన్నుల రూపంలో రూ. 3,65,797 కోట్లు రాబట్టింది. అందులో రూ.1,68,647 కోట్లే రాష్ట్రానికి తిరిగి ఇచ్చింది. ఈ లెక్కలు తప్పని కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు నిరూపిస్తే మంత్రి పదవిని ఎడమకాలి చెప్పులా వదిలేస్తా. సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగుతా’అని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. ‘కేసీఆర్‌ అనే మూడక్షరాల పదం లేకపోతే టీపీసీసీ, టీబీజేపీలు ఎక్కడివని.. ఇవాళ మొరుగుతున్న కుక్కలు, గాడిదలకు ఆ పదవులు కేసీఆర్‌ వల్ల ఆ పార్టీలు పెట్టిన భిక్ష కాదా?’అని ధ్వజమెత్తారు.

బుధవారం హనుమకొండ, వరంగ ల్‌ జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి కేటీఆర్‌.. సాయంత్రం హనుమకొండ హయగ్రీవాచారి (కుడా) మైదానంలో టీఆర్‌ఎస్‌ ప్రతినిధుల సమా వేశంలో మాట్లాడారు. ‘తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన జరగకపోతే ఎవడీ రేవంత్‌ రెడ్డి, ఎవడీ బండి సంజయ్‌? నోటికొచ్చినట్లు చిల్లర మాటలు మాట్లాడుతున్నరు. మోదీని మేం తిట్టలేమా? కానీ మాకు కేసీఆర్‌ సంస్కారం నేర్పారు. మేం నోరు విప్పితే మా కంటే ఎవరూ బాగా మాట్లాడలేరని గుర్తుంచుకోవాలి’అని హెచ్చరించారు. కేసీఆర్‌పై కుక్కల్లా మొరిగే వారిని గులాబీ సైనికులు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.  

మోదీవన్నీ గాలి మాటలే 
తెలంగాణ బిడ్డల చెమట, రక్త సమానమైన పన్నులను కేంద్ర పాలకులు గుజరాత్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు ధారాదత్తం చేశారని కేటీఆర్‌ అన్నారు. ప్రధాని మోదీ మొదటి నుంచీ రాష్ట్రంపై వివక్ష చూపుతున్నారని, ఆయన చెప్పేవన్నీ గాలిమాటలేనని ఆరోపించారు. తెలంగాణ బీజేపీ నేతలు, ఎంపీలకు వెన్నెముక లేదని, తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంటే కనీసం ప్రధానిని అడిగే దమ్ములేదన్నారు. తెలంగాణ విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీల జాడేదని ప్రశ్నించారు. కాజీపేటకు సాధ్యం కాదన్న ఫ్యాక్టరీని బీజేపీ మహారాష్ట్రలోని లాతూరుకు తరలించి తెలంగాణ నిరుద్యోగులకు తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు.  

కిషన్‌రెడ్డి ఏం జవాబిస్తారు? 
‘దేశవ్యాప్తంగా 157 మెడికల్‌ కాలేజీలను మంజూరు చేసిన కేంద్రం.. తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. 7 ఎయిమ్స్‌లను మంజూరు చేసినా రాష్ట్రానికి రిక్తహస్తం చూపింది. 7 ఐఐటీల్లో రాష్ట్రానికి ఒక్కటి కూడా దక్కలేదు. ఎస్‌ఐటీలు 4, నవోదయాలు 84 వివిధ రాష్ట్రాలకు కేటాయించినా తెలంగాణకు చోటివ్వలేదు. రాష్ట్రానికి వచ్చిన సంప్రదాయ వైద్య కేంద్రం గుజరాత్‌కు తరలిపోయింది. ఈ వైద్య కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు గతంలో ప్రకటించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇప్పుడేం చెబుతారు?’అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

ఎమ్మెల్యేలను కొంటూ పట్టుబడ్డ దొంగ రేవంత్‌ 
‘కాంగ్రెస్‌ పార్టీ చచ్చిపోయింది. పట్టపగలే ఎమ్మెల్యేలను డబ్బుతో కొంటూ పట్టుబడ్డ దొంగ రేవంత్‌. ఆయన కూడా కేసీఆర్, టీఆర్‌ఎస్‌పై అవాకులు చెవాకులు మాట్లాడుతున్నడు’అని కేటీఆర్‌ మండిపడ్డారు. కాగా, వరంగల్, నర్సంపేటలో రూ.185 కోట్ల పనులకు కేటీఆర్‌ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సభ కోసం ఏర్పాటు చేసిన టెం ట్లు మధ్యాహ్నం గాలివాటానికి కూలిపోయాయి. దీంతో రెండు జేసీబీలు తీసుకొచ్చి లాగికట్టారు.  

బీజేపీ ఎంపీలు చిల్లరగాళ్లు 
‘తెలంగాణ బీజేపీ నేతలు, ఎంపీలకు వెన్నెముక లేదు. ఒకడు కరీంనగర్‌లో ఏం పీకలేదు.. కానీ పాలమూరులో తిరుగుతుండు. ట్రిపుల్‌ ఐటీని తీసుకురాలేని దద్దమ్మ పాలమూరును ఉద్ధరిస్తడంటా?’’అని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. ‘బీజేపీ బేకార్‌ నాయకుల్లారా.. రాష్ట్రానికి మీరేం చేశారు? పొత్తిళ్లలో ఉన్న పసిగుడ్డును కాళ్లతో తన్నింది మీరు కాదా? 7 మండలాలను గుంజుకుపోయి కలిపింది మోదీ కాదా? 7 మండలాల్లోని లోయర్‌ సీలేరు విద్యుత్‌ కేంద్రాన్ని ఆంధ్రాలో కలిపింది బీజేపీ కాదా?’అని కేటీఆర్‌ నిలదీశారు. ‘రాష్ట్రంలో ఎన్నికైన నలుగురు బీజేపీ ఎంపీలు చిల్లరగాళ్లు. నిజామాబాద్‌ ఎంపీ 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పి మోసం చేశాడు. బూతులు తప్ప ఏం మాట్లాడడు. ఆదిలాబాద్‌ ఎంపీ సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తెరిపిస్తానని చెప్పి అడ్రస్‌ లేకుండా పోయాడు’అన్నారు. 

తెలంగాణపై మోదీ వివక్ష: కేటీఆర్‌ 
కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ విభాగం హైదరాబాద్‌లో ‘గ్లోబల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఆయుష్‌ మెడిసిన్‌‘ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన ట్వీట్‌పై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ‘కిషన్‌రెడ్డి గారూ.. ఎన్‌పీయే (నిరర్థక) ప్రభుత్వంలో కేబినెట్‌ మంత్రిగా ఉన్న మీరు రాష్ట్రానికి ప్రతిష్టాత్మక జాతీయ సంస్థను తెస్తున్నందుకు అభినందనలు. ఓహ్‌.. కాస్త ఆగండి. యథావిధిగా గుజరాత్‌ ప్రధాని దీన్ని జామ్‌నగర్‌కు తరలించాలని నిర్ణయించారు. తెలంగాణకు వ్యతిరేకంగా ప్రధాని మోదీ వివక్ష నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది’అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు