ప్రాణ, ఆస్తి నష్టం జరగొద్దు

22 Sep, 2020 03:43 IST|Sakshi

వర్షాలపై సమీక్షలో పురపాలక మంత్రి కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: వర్షాలు మరో రెండు వారాల పాటు కొనసాగే అవకాశం ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఈ పక్షం రోజులు అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు. అలాగే 2 వారాల పాటు ఉద్యోగులందరికీ సెలవులు రద్దు చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ను ఆదేశించారు. పర్యవేక్షణ కోసం సీనియర్‌ అధికారులకు బా«ధ్యత అప్పగించాలని, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శితోపాటు కమిషనర్లు సైతం ఆకస్మిక తనిఖీలు చేస్తూ నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ పురపాలక శాఖ, జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జీహెచ్‌ఎంసీతో సహా రాష్ట్రంలోని పురపాలికల్లో ప్రస్తుత పరిస్థితులను తెలుసుకున్నారు. హైదరాబాద్‌లో గత 10 రోజుల్లో 54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులకు తెలిపారు. ఇప్పటిరకు వర్షాలతో రెండు ఘటనల్లో ప్రాణనష్టం సంభవించినట్లు తెలిపారు.  

గుంతలకు కంచెలు..: కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న భవనాలను గుర్తించి తక్షణమే కూల్చివేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన భవనాలను కూల్చివేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండేలా ప్రైవేట్‌ కాంట్రాక్టర్లకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయాలని సూచించారు. మౌలిక వసతుల కల్పన కోసం తవ్విన గుంతల చుట్టూ కంచె వేయాలని, నీళ్లు నిలిచిన ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని.. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాత యుద్ధప్రాతిపదికన అన్ని రోడ్లను పూర్వస్థితికి తీసుకురావాలని ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు