వ్యాపారంతో పాటు వ్యవసాయానికి ప్రాధాన్యత: కేటీఆర్‌

27 Aug, 2020 13:45 IST|Sakshi

హైదరాబాద్‌ని ‘స్టార్టప్ క్యాపిటల్‌’గా తీర్చిదిద్దే యత్నం

టీ హబ్, వి హబ్, టీ వర్క్స్ ద్వారా స్టార్టప్‌లకు చేయూత

తెలంగాణకు సాగు విస్తీర్ణంలో మొదటి స్థానం

పారిశ్రామిక రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లో ముందుండేలా కృషి

సాక్షి, హైదరరాబాద్‌: ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత అనేక అవకాశాలు వస్తాయని పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు అన్నారు. ఇప్పటికే తెలంగాణ పెట్టుబడులకు ఆకర్షణీయమైన కేంద్రంగా మారిందన్నారు. అయితే ప్రస్తుత సంక్షోభం తర్వాత వివిధ రంగాల్లో రానున్న మార్పులకు అనుగుణంగా మరిన్ని పెట్టుబడులను తెలంగాణకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా కేటీఆర్ తెలియజేశారు. గురువారం సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రెండు రోజులపాటు “ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ అప్పార్చునిటీస్ ఇన్ పోస్ట్ కోవిడ్ వరల్డ్” పేరుతో నిర్వహిస్తున్న ఈ వర్చువల్ కాన్ఫరెన్స్‌లో పలువురు ప్రముఖ పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐఐ రూపొందించిన ‘నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్’ పేరుతో ఒక నివేదికను విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న సంక్షోభం ద్వారా ప్రపంచం డిజిటలీకరణ వైపు వెళ్తుందని తెలిపిన మంత్రి కేటీఆర్, తెలంగాణ సైతం ఈ మార్గాన్ని అందిపుచ్చుకోవడానికి ముందువరుసలో ఉందన్నారు. ఇప్పటికే తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ అందించే కార్యక్రమానికి సంబంధించిన పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలియజేశారు. 

పల్లెలకు ఇంటర్నెట్‌.. విప్లవాత్మక మార్పులు
పల్లెలకు ఇంటర్నెట్ వెళ్ళిన తర్వాత ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్ వంటి రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని, ఇది డిజిటల్ విప్లవం వైపుగా తెలంగాణను తీసుకెళ్తుందన్న విశ్వాసాన్ని కేటీర్‌ వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక కొత్త అవకాశాలు వస్తాయని, ఆ దిశగా వారిని నైపుణ్య శిక్షణలో భాగస్వాములు చేసేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ద్వారా వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 14 ప్రాధాన్యత రంగాలను ఎంచుకుని ఆ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తుందని తెలిపిన మంత్రి కేటీఆర్, ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పెట్టుబడిదారులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. దీంతోపాటు హైదరాబాద్‌ని ‘స్టార్టప్ క్యాపిటల్’‌గా తయారు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. టీ హబ్ ఏర్పాటు ఇండియన్ స్టార్టప్‌ సిస్టంలో ఒక గొప్ప మార్పుకి కారణం అయ్యిందన్నారు. ఇప్పటికే టీ హబ్ ద్వారా అనేక స్టార్టప్ కంపెనీలు గొప్ప ప్రగతిని సాధించాయన్నారు. దీంతో పాటు మహిళల కోసం ప్రత్యేకంగా వీ హబ్‌ని కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్‌ ప్రస్తావించారు. (చదవండి: ప్రపంచం చూపు మన వైపు)

వ్యాపారానికే కాక వ్యవసాయానికి ప్రాధాన్యత
భారీ స్థాయిలో పారిశ్రామిక పార్కులు ఉండాలన్న బృహత్తర లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు కేటీఆర్‌. ఇప్పటికే ఈ దిశగా దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక పార్కులను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్.. హైదరాబాద్ ఫార్మా సిటీతో పాటు దేశంలోని అతిపెద్ద టెక్స్టైల్ పార్క్.. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌, దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైసెస్ లాంటి వివిధ పారిశ్రామిక పార్కుల అభివృద్ధి చేపడుతున్నామని ఈ సందర్భంగా కేటీఆర్‌ తెలియజేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి పోల్చిచూస్తే రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో ఉన్నత ప్రమణాలు నెలకొల్పామన్నారు. దేశంలోని 24 గంటలపాటు గృహ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం వ్యాపార సంస్కరణలకు, పెట్టుబడుల ఆకర్షణలో మాత్రమే కాకుండా వ్యవసాయ రంగానికి సైతం పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు రైతు బంధు, రైతు బీమా రైతు సంక్షేమ కార్యక్రమాల ద్వారా రైతాంగంలో వ్యవసాయం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడిందని తెలిపారు కేటీఆర్‌. (చదవండి: ఇంటింటికీ ఇంటర్నెట్‌ )

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల వలనే దేశంలోనే అత్యధికంగా సాగు నమోదు అయిందన్నారు కేటీఆర్‌. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది సుమారు 36 శాతం సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. తెలంగాణ రైతాంగానికి, వారి సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో తనదైన శైలితో ముందుకు పోతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు